BRS Plan to hold a dharna in front of Rahul house : తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజాపోరాటాలు ప్రారంభించాలని బీఆర్ఎస్ అనుకుంటోంది. ఎప్పటికప్పుడు నిరసనలు చేయడం మినహా నిర్మాణాత్మకంగా ఇంకా పోరాటం ప్రారంభించలేదు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల హామీలు నెరవేర్చడం లేదని. ఆరు గ్యారంటీలను అరకొరగా అమలు చేస్తున్నారని అంటున్నారు. అదే సమయంలో రుణమాఫీని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదని రోజూ విమర్శిస్తున్నారు. అన్నింటినీ కలిపి ఒకే సారి భారీ పోరాటం చేయాలని అనుకుంటున్నారు. ఇందులో భాగంగా ఢిల్లీలో రాహుల్ గాంధీ ఇంటి ఎదుట ధర్నా చేస్తే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చినట్లుగా బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. 


ఇటీవలి కాలంలో రాహల్‌ను ఎక్కువగా టార్గెట్ చేస్తున్న కేటీఆర్ 


భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల రేవంత్ రెడ్డితో పాటు రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తున్నారు. తెలంగాణలో వివిధ పథకాలు పేరుతో ఊరూవాడా వచ్చి ప్రచారం చేశారని కానీ ఇప్పుడు ఏమీ అమలు కావడం లేదని మీరే సమాధానం చెప్పాలని అంటూ ఎక్స్‌లో పోస్టులు పెడుతున్నారు. అనేక సమస్యలపై నేరుగా రాహుల్‌కు ట్యాగ్ చేస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వం కన్నా నేరుగా రాహుల్‌నే తెలంగాణ అంశాలకు బాధ్యుల్ని చేయాలని కేటీఆర్ అనుకుంటున్నారు. ఈ క్రమంలో రాహుల్ ఇంటి దగ్గర ఢిల్లీలో బీఆర్ఎస్ ధర్నా చేయాలనుకోవడం వ్యూహాత్మక నిర్ణయమేనని అనుకుంటున్నారు. 


ఏపీలో మద్యం దుకాణాల కేటాయింపు పూర్తి - లాటరీలో మహిళల హవా, ప్రభుత్వానికి ఈసారి లిక్కర్ కిక్కు


జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ను బద్నాం చేసే అవకాశం


తెలంగాణలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేయడం లేదని రాహుల్ ఇంటి ముందు బీఆర్ఎస్ ధర్నా చేస్తే అది దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతుంది. ఇప్పటికే హర్యానాలో కాంగ్రెస్ ఇచ్చిన ఏడు గ్యారంటీలను అక్కడి ప్రజలు నమ్మలేదని కేటీఆర్ ప్రకటించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సిద్ధమవుతున్న మహారాష్ట్ర, బీహార్, ఢిల్లీ వంటి చోట్ల కూడా కాంగ్రెస్ వ్యవహారాన్ని మరింత చర్చనీయాంశం చేయవచ్చన్న ప్లాన్ లో బీఆర్ఎస్ ఉన్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఏడాది అవుతున్నా సగం కూడా అమలు చేయలేదని చెప్పడం ద్వారా మరెక్కడా కాంగ్రెస్ గ్యారంటీలను ప్రజలు నమ్మకం చేయవచ్చని బీఆర్ఎస్ భావిస్తున్నాయి. 


Also Read: YS Jagan: లిక్కర్‌ మాఫియాకు, సిండికేట్లకు అడ్డాగా ఏపీ! చంద్రబాబుకు మాజీ సీఎం జగన్ 6 ప్రశ్నలు


జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ను బద్నాం చేస్తే బీఆర్ఎస్‌కు లాభమేంటి ? 


తెలంగాణ ప్రభుత్వంపై తెలంగాణలో పోరాడితే అది రాష్ట్ర రాజకీయ పోరాటం అవుతుంది. అదే ఢిల్లీలో పోరాడితే అది జాతీయ అంశం అవుతుంది కానీ.. రాష్ట్రంలో పెద్దగా చర్చనీయాంశం కాదు. పైగా ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తే ప్రయోజనం ఉంటుంది కానీ.. రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తే ఏం ప్రయోజనం అన్న వాదన వినిపిస్తుంది. అదే సమయంలో కాంగ్రెస్ పై వ్యతిరేకత ప్రచారం కోసం బీజేపీకి మేలు చేసేందుకే ఇలాంటి ఆలోచన చేస్తున్నారన్న విమర్శలు వస్తాయి. ఎందుకంటే సాధారణంగా ఢిల్లీలో జరిగే ధర్నాలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా  ఉంటాయి. ప్రతిపక్షానికి వ్యతిరేకంగా ఉండవు. ఇక్కడ తెలంగాణలో అధికారపక్షం.. కేంద్రంలో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ పోరాటం భిన్నంగా సాగుతోంది. మరి ఢిల్లీ ధర్నాపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది.