Controversy On setting up a radar station in Damagundam Reserve Forest : భారత నావికా దళం తెలంగాణను కీలక స్థావరంగా ఎంపిక చేసుకుంది. దేశంలోనే రెండో వీఎల్ఎఫ్ కమ్యూనికేషన్ స్టేషన్ ను వికారాబాద్ మండలం పూడూరు సమీపంలోని దామగూడెం అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నౌకలు, జలాంతర్గాములతో సంభాషించేందుకు నావికా దళం వెరీ లో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ ట్రాన్స్ మిషన్ స్టేషన్ ను నిర్మిస్తారు. వ్యూహాత్మకంగా భారత రక్షణ రంగానికి ఇది కీలకమైనదని చెబుతున్నారు. అయితే ఇప్పుడీ నిర్మాణంపై కొంత మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దానికి పర్యావరణ కారణాలు చెబుతున్నారు.
రాడార్ స్టేషన్ ఏర్పాటుపై ఉధృతంగా వ్యతిరేక ప్రచారం
అనంతగిరి రిజర్వ్ ఫారెస్ట్‌కు ఆనుకుని ఉన్న దామగుండం అడవిలో రాడార్ స్టేషన్ నెలకొల్పితే అడవి అంతా నాశనం అయిపోతుందని కొంత మంది ఉద్యమకారులు ప్రచారం చేస్తున్నారు. ఈ స్టేషన్ ఏర్పాటుకు ఫారెస్ట్‌లోని 12 లక్షల మెుక్కలు నరికివేస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అటవీ సంపద, వన్యప్రాణులకు ముప్పు పొంచి ఉందని .. రేడియేషన్ ఉంటుందని కూడా చెబుతున్నారు. అడవుల్లో సహజ వనరులను కోల్పోతామని, వన్యప్రాణుల మనుగడకు కూడా ముప్పు కలుగుతుందని పర్యావరణం, స్థానికల పేరుతో వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు.
నివేదికల్లోని నిజాలు వేరు !
ప్రాజెక్టు ఏర్పాటులో భాగంగా 12 లక్షల చెట్లను తొలగిస్తారనే వార్తలను పూర్తి అవాస్తమని అటవీ శాఖ స్పష్టం చేస్తోంది. నేవీకి అప్పగించే భూమిలో చాలావరకు చిన్న పొదలు, ఖాళీ ప్రదేశం మాత్రమే ఉందని చెబుతున్నారు. దట్టమైన అటవీ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టబోరని ఒకటిన్నర లక్షల వరకూ చెట్లు తొలగించే ఉంది. నష్టాన్ని పూడ్చేందుకు వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 17.5 లక్షల మొక్కలు నాటేందుకు ఆటవీ శాఖకు నిధులు మంజూరు చేస్తున్నారు. రేడియేషన్ పై జరుగుతున్న ప్రచారం కూడా అవాస్తమని అంటున్నారు. సాధారణంగా రాడార్ వ్యవస్థ 3– 30 కిలోహెడ్జ్ రేడియో ఫ్రీక్వెన్సీతో పనిచేస్తుంది. ఇక్కడ దాదాపు 450 మీటర్ల ఎత్తు టవర్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటివల్ల చుట్టుపక్కల ఉండే ఏ వస్తువుకు కానీ, వ్యక్తికి కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదని రక్షణ శాఖ శాస్త్రవేత్తలు క్లారిటీ ఇస్తున్నారు. సముద్ర జలాల గుండా చొచ్చుకుపోయే ఫ్రీక్వెన్సీ తరంగాల ఆధారంగా సబ్ మెరైన్లలోని సిబ్బందితో సమాచార మార్పిడి ఈ రాడార్ స్టేషన్ ఏర్పాటు లక్ష్యం. దాదాపు 2500 నుంచి 3000 మంది ఈ టౌన్‌షిప్‌లో నివసిస్తారు. విస్తృతంగా మొక్కలు నాటి పెంచడం ద్వారా ఈ ప్రాంతంలో జీవవైవిధ్యం, పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు తగిన చర్యలు చేపడుతారు. ఈ ప్రాజెక్టులో భాగంగానే దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ చుట్టూ దాదాపు 27 కి.మీ రోడ్డు నిర్మిస్తారు.
ఇప్పటి ప్రతిపాదన కాదు !
తమిళనాడులోని తిరునెల్వేలిలో ఉన్న ఐఎన్ఎస్ కట్టబొమ్మన్ రాడార్ స్టేషన్ దేశంలోని మొట్ట మొదటిది. 1990 నుంచి అది నావికా దళానికి సేవలందిస్తోంది. రెండో రాడార్ స్టేషన్ ఏర్పాటుకు తెలంగాణ అనువైన ప్రాంతంగా విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ కమాండ్ ఎప్పుడో గుర్తించింది. 2010 నుంచి నావికా దళం ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. పర్యావరణ అనుమతులు, క్లియరెన్స్ లన్నీ వచ్చినప్పటికీ భూముల కేటాయింపు ముందుకు సాగలేదు. 2014లోనే కేంద్ర అటవీ పర్యావరణ శాఖ నేవీ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. అటవీ భూమి అప్పగించేందుకు రూ.133.54 కోట్ల కాంపా నిధులు, భూసంరక్షణ చర్యలకు చేపట్టే పనులకు రూ.18.56 కోట్లను నేవీ చెల్లించింది. ఈ ప్రాజెక్టును రద్దు చేయాలని కోరుతూ దామగూడెం ఫారెస్ట్ ప్రోటెక్షన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం నిర్ణయించిన షరతులకు అనుగుణంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంటే న్యాయపరమైనచిక్కులు కూడా లేవు.
అవాస్తవాల ప్రచారంతోనే ఎక్కువగా దామగుండం రాడార్ స్టేషన్‌ను వ్యతిరేకిస్తున్నారన్న అభిప్రాయం ఉంది. ఇది దేశ రక్షణ వ్యవస్థకు వ్యతిరేకంగా పని చేయడమేనన్న వాదన కూడా వినిపిస్తోంది.