BRS MLA Arikepudi Gandhi Joined In Congress: తెలంగాణలో (Telangana) బీఆర్ఎస్‌కు (BRS) వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు హస్తం పార్టీలో చేరగా.. తాజాగా ఆ పార్టీ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ (Arikepudi Gandhi) శనివారం కాంగ్రెస్‌లో చేరారు. జూబ్లీహిల్స్‌లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. గాంధీతో పాటు ఆయన అనుచరులు, పలువురు కార్పొరేటర్లు హస్తం తీర్థం పుచ్చుకున్నారు. వీరిలో శేరిలింగంపల్లి కార్పొరేటర్ నాగేందర్ యాదవ్, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాధ్ రెడ్డి, హైదర్‌నగర్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ఇప్పటివరకూ హస్తం పార్టీలో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 9కి చేరింది.
ఇప్పటికే రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాస్ గౌడ్, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్‌లో చేరారు.
'అభివృద్ధి కోసమే'
నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ఎమ్మెల్యే గాంధీ తెలిపారు. అభివృద్ధిపై సీఎం రేవంత్ తనకు హామీ ఇచ్చారని.. అందుకే కార్యకర్తలు, శ్రేయోభిలాషుల సూచనతోనే పార్టీ మారుతున్నట్లు చెప్పారు.