Raj Tarun Vs Lavanya: నటుడు రాజ్‌తరుణ్‌ ప్రేమ కేసులో లావణ్య పెట్టిన మెసేజ్‌ సంచలనంగా మారుతోంది. చచ్చిపోతున్నానంటూ ఓవైపు లాయర్‌కు మెసేజ్ చేసిన ఆమె... అడ్వకేట్‌, ఏబీపీ దేశం, డయల్‌ 112కు ఫోన్ చేసి ఇదే విషయం చెప్పారు. తన చావుకు రాజ్‌తరుణ్, మాల్వీ ఫ్యామిలీయే కారణమని చెప్పారు. 


నటుడు రాజ్‌తరుణ్‌ లావణ్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పుడు లావణ్య పెట్టిన మెసేజ్ అందర్నీ షాక్‌కి గురి చేస్తోంది. తాను చచ్చిపోతున్నానంటూ లాయర్‌, పోలీసులకు ఒకేసారి సమాచారం ఇచ్చిన లావణ్య టెన్షన్ పెట్టారు. ముందు లాయర్‌తో కేసు విషయంలో చాటింగ్ చేస్తూ తాను వెళ్లిపోతున్నానంటూ మెసేజ్ చేశారు.


రాజ్‌తరుణ్ లేకుండా తాను జీవించలేనని మెసేజ్ చేసిన లావణ్య ఈ లోకం నుంచి వెళ్లిపోతున్నానంటూ చెప్పుకొచ్చారు. ఆ మెసేజ్ చూసిన లాయర్ షాక్ అయి వెంటనేపోలీసులు సమాచారం ఇచ్చారు. ఇంతలో డయల్ 112 నుంచి కూడా నార్సింగ్ పోలీసులకు మరో సమాచారం వచ్చింది.


ఏబీపీ దేశం రిపోర్టర్‌కి లావణ్య మెసేజ్


తన మెసేజ్‌లో లావణ్య ఏం చెప్పారంటే..."నేను రాజ్ తరుణ్ భార్య లావణ్యని. నన్ను క్షమించండి. నా కోసం ఉన్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నేనూ ఏంటో తెలిసిన జనం నన్ను తప్పు అన్నారు. తెలియని మనుషులు నాకోసం సహాయం చేశారు. రాజ్ లేని జీవితం నేను ఉండలేను. బ్రతకలేను. ఈ ప్రపపంచంలో నేను ఉండలేను. నేను అన్నీ కోల్పోయాను. నేను వ్యవస్థను నమ్మాను కానీ నేను విఫలమయ్యాను. నేను మోసపోయాను. మైండ్ గేమ్‌లు, గాసిప్స్‌తో విసిగిపోయారు. నేను ఇందులో గెలవకపోవచ్చు కానీ నేను ఇప్పటికీ దేవుణ్ణి నమ్ముతాను నాకు ఇలా చేసిన వ్యక్తులను కచ్చితంగా దేవుడు చూస్తాడు. మస్తాన్ కేసు తర్వాత ప్రతిదీ ప్లాన్ ప్రకారంతో నాతో ఆడారు. నేను మాల్వీ మల్హోత్రాని అభ్యర్థించి, వేడుకున్న పట్టించుకోలేదు. మాకూ తిన్నడానికీ తిండి లేదూ అని అడుక్కుంది అంటూ ఎంజాయ్ చేస్తున్నారు. 


రాజ్ పేరెంట్స్ కూడా ఒక ముఖ్య కారణం. రాజ్ మారిపోయాడు. అతను నా చావు కోరుకున్నాడు. నా చావుకు మాల్వీ మల్హోత్రా ప్రధాన కారణం. నా కుటుంబ సభ్యులకు, దిలీప్ కల్యాణ్‌కి మీడియాకు నా హృదయపూర్వక క్షమాపణలు. నన్ను క్షమించండి. అంటూ ఏబీపీ దేశం రిపోర్టర్‌ శేషుకు లావణ్య మెసేజ్ చేశారు. 


డయల్ 112కు ఫోన్ చేసిన లావణ్య... తాను చనిపోతున్నట్టు చెప్పారు. రాజ్‌తరుణ్ లేని జీవితాన్ని ఊహించుకోలేనని అన్నారు. తన చావుకు రాజ్‌తరుణ్‌ ఫ్యామిలీతోపాటు హిరోయిన్ మాల్వీ మల్హోత్రా ఫ్యామిలీ కారణమని పోలీసులకు చెప్పారు. ఈ సమాచారంతో పోలీసులు పరుగులు పెట్టారు. 


వారించిన ఏబీపీ దేశం


ఏబీపీ దేశం రిపోర్టర్ శేషుతో లావణ్యతో మాట్లాడి వారించారు. కచ్చితంగా న్యాయం జరుగుతుందని ఎలాంటి అఘాయిత్యాలు చేసుకోవద్దని సూచించారు. చాటింగ్‌లో కూడా ఇదే మెసేజ్‌ను కన్వే చేశారు. అదే టైంలో పోలీసులు కూడా లావణ్య ఇంటికి వచ్చి ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చారు. 




వారం నుంచి ట్విస్టులే ట్విస్టులు 


గత వారం పది రోజుల నుంచి రాజ్‌తరుణ్, లావణ్య కేసు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారిపోయింది. సీక్రెట్‌గా పెళ్లి చేసుకొని పదేళ్లు తాము కాపురం చేశామని... తనకు అబార్షన్ కూడా అయిందని రాజ్‌తరుణ్‌పై లావణ్య కేసు పెట్టింది. వారిద్దరి మధ్య జరిగిన చాటింగ్, ఫొటోలు, ఇతర ఆధారాలను పోలీసులకు ఇచ్చారు. 


లావణ్య ఇచ్చిన ఆధారాలతో నార్సింగ్ పోలీసులు రాజ్‌తరుణ్‌పై కేసు పెట్టారు. రాజ్‌ తరుణ్‌తోపాటు నటి మాల్వీ మల్హోత్రాసహా ఆమె సోదరుడిపై ఐపీసీ 420,493,506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశశారు. ఇందులో ఏ1గా రాజ్‌ తరుణ్‌ ఉంటే... ఏ2గా మాల్వీ మల్హోత్రా, ఏ3గా ఆమె సోదరుడు మయాంక్‌ని చేర్చారు పోలీసులు. 


అబార్షన్ చేయించాడని ఆరోపణ


ప్రేమ పేరుతో రాజ్‌ తరుణ్‌ తనని మోసం చేశాడని కోకాపేటకు చెందిన లావణ్య జులై 5న నార్సింగ్‌ పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. హీరోయిన్‌ మాల్వీ మోజులో పడి తనని మోసం చేస్తున్నాడని వదిలించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించింది లావణ్య. పదేళ్లు తనతో రిలేషన్‌షిప్‌లో ఉండి మాల్వీ కోసం ఇప్పుడు దూరం పెడుతున్నాడని ఆరోపించింది. 


మొదట సరైన ఆధారాలు చూపించలేదని పోలీసులు కేసు నమోదు చేయలేదు. జులై పదిన ఆధారాలతో వచ్చి మరోసారి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. తనతో సహజీవనం చేసుకోవడమే కాకుండా 2014లో రహస్యంగా పెళ్లి చేసుకున్నామని... అబార్షన్ కూడా చేయించినట్టు లావణ్య పోలీసులకు చెప్పారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రాజ్‌తరుణ్‌కు భారీగా నగదు కూడా ఇచ్చినట్టు పోలీసులకు వెల్లడించింది. దానికి సంబంధించిన సాక్ష్యాలను సమర్పించింది.