YS Jagan will start Praja Durbar In Tadepalli : వైఎస్ఆర్  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలతో మమేకమయ్యేందుకు సిద్ధమవుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో సమావేశమైన ఆయన పార్టీ ఓటమి సంబంధించి నేతలకు భరోసాను కల్పించే ప్రయత్నం చేశారు. ప్రజలకు మంచి చేశామని, కానీ ఎందుకో ఓడిపోయామంటూ వెల్లడించారు. ప్రజల్లో ఉంటూ ప్రజలకు మంచి చేసే ప్రయత్నం చేయడం ద్వారా మళ్ళీ అధికారాన్ని దక్కించుకుంటామన్న భరోసాను కల్పించారు. ఆ తర్వాత పులివెందులలోనూ జగన్ పర్యటించారు. ఈ క్రమంలోనే టిడిపి నాయకులు దాడిలో తీవ్రంగా గాయపడిన కార్యకర్తలను జగన్ పరామర్శించారు. అనంతరం పులివెందులలో ప్రజల నుంచి  ఫిర్యాదులను స్వీకరించారు. ఇదే క్రమంలో ఈ నెల 15 నుంచి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించేందుకు జగన్ సిద్ధమవుతున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకోసం పార్టీ నాయకులకు జోరుగా ఏర్పాటు చేస్తున్నట్లు చెబుతున్నారు.


ప్రజలను కలిసేందుకు గతంలోనే ఏర్పాటు..


ప్రతిరోజు ప్రజలను కలిసేందుకు జగన్ క్యాంపు కార్యాలయంలో ప్రత్యేకమైన ఏర్పాట్లను ఆ భవన నిర్మాణ సమయంలోనే చేయించుకున్నారు. క్యూ లైన్లలో నిలబడ లేని వారు కూర్చునేందుకు అనుగుణంగా షెడ్లు దాని కింద కుర్చీలు ఏర్పాటు చేయించారు. కానీ, సీఎంగా ఉన్న ఐదేళ్లలో ఒకసారి కూడా ఆయన అక్కడ ప్రజలను కలవలేదు. కనీసం పార్టీ నేతలను కూడా అక్కడి వరకు రానివ్వలేదు. ఈ క్రమంలోనే నేరుగా ప్రజలు తనను కలిసి సమస్యలు చెప్పుకునేందుకు స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తానని సీఎంగా ఉన్నప్పుడు జగన్ చెప్పడం దానికోసం అధికారులు ఏర్పాటు చేయడం తర్వాత ఆయన వాయిదా వేయడం ఇలా ఐదేళ్ల కాలం గడిచిపోయింది. స్పందన, ప్రజా దర్బార్, రచ్చబండ, సచివాలయాల సందర్శన, పల్లెబాట.. ఇలా పేర్లు మారినా ప్రజలను కలిసే కార్యక్రమం మాత్రం కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వీటిలో ఏదో ఒక కార్యక్రమాన్ని చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీనికి ప్రజాదర్బార్ అని పేరును పెట్టబోతున్నట్లు చెబుతున్నారు. 


ప్రజల నుంచి వినతుల స్వీకరణ 


ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే పార్టీ నాయకులు కార్యకర్తలతో మాట్లాడటంతోపాటు వారి నుంచి వినతులను స్వీకరించనున్నారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ నుంచి తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి నుంచి కూడా ఈ సందర్భంగా వినతులను ఆయన స్వీకరించనున్నారు. వారికి పార్టీ పరంగా అవసరమైన సహకారాన్ని అందించనున్నారు. న్యాయపరమైన, ఆర్థిక పరమైన సహకారాన్ని అందించేందుకు అనుగుణంగా చర్యలు తీసుకునేలా ప్రజాదర్బార్ లో జగన్ హామీ ఇవ్వనున్నారు. ఈ ప్రజా దర్బార్ కు కొంత సమయాన్ని జగన్మోహన్ రెడ్డి కేటాయించనున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం పార్టీ కీలక నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజా దర్బార్ నిర్వహణకు సంబంధించిన ఎంత సమయం కేటాయించాలి, ప్రతిరోజు ఎంత మందికి అవకాశం కల్పించాలని అనే దానిపై పార్టీ నాయకులు వర్కౌట్ చేస్తున్నట్లు చెబుతున్నారు. 



ఇప్పటికీ కొందరు నేతల్లో కనిపిస్తున్న అసహనం 


సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా జగన్ ను కలిసేందుకు వస్తున్న నేతలకు ఆయన దర్శన భాగ్యం కలగడం లేదన్న ఆవేదన ఆ పార్టీ నేతల్లో వ్యక్తం అవుతోంది. సీఎంగా ఉన్నప్పుడు ఎలాగో కలిసే అవకాశం కల్పించలేదని, ఇప్పుడు కలిసేందుకు వస్తున్న వెళ్లనీయడం లేదంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు అపాయింట్మెంట్ లేకపోతే ఎవరిని లోపల అనుమతించడం లేదని పలువురు పేర్కొంటున్నారు. లోపలకు పంపిస్తారేమోనని గేటు దగ్గర నిరీక్షించి వెనక్కి వెళ్ళిపోతున్నామంటూ పలువురు నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Also Read: సమీక్షలో పవన్ మైక్ విసిరికొట్టారంటూ వైరల్ వీడియో - అసలు నిజం మాత్రం వేరే