Harishrao Comments On CM Revanth Reddy: రాష్ట్రంలో వంద రోజుల్లో హామీలన్నీ నెరవేరుస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం.. 300 రోజులైనా అవి అమలు చేయడంలో విఫలమైందని మాజీ మంత్రి హరీష్‌రావు (Harishrao) మండిపడ్డారు. ఆ పార్టీది నెరవేర్చని హామీల కథ అని.. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కేవలం తెలంగాణనే కాదని, మొత్తం దేశాన్నే తప్పుదోవ పట్టించడం సిగ్గుచేటని ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో 1.61 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తే.. రేవంత్ దుష్ప్రచారం చేయడం దురదృష్టకరమని అన్నారు. సీఎం భర్తీ చేసినట్లు చెబుతున్న 50 వేల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు ఇచ్చి, పరీక్షలు నిర్వహించి, ధ్రువపత్రాల పరిశీలన చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా.? అని నిలదీశారు. 'ఎన్నికల కోడ్ కారణంగా పెండింగ్‌లో ఉన్న నియామక పత్రాలను మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల ఇస్తామని ఇప్పటికీ నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం వాస్తవం కాదా.?. డిసెంబర్ 9 లోపే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి సగం మందికి కూడా చేయనిది నిజం కాదా.?' అని నిలదీశారు.






'అవి వాస్తవాలు కాదా.?'


'పింఛను రూ.4 వేలకు పెంచుతామని హామీ ఇచ్చి 11 నెలలైనా అమలు చేయకపోవడం వాస్తవం కాదా.?. 18 ఏళ్లు పైబడిన మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని హామీ ఇచ్చి ఇంకా అమలు చేయలేదు. విద్యా  భరోసా కింద ఒక్కో విద్యార్థికి రూ.5 లక్షలు ఇస్తామని ఇంకా నెరవేర్చలేదు. అన్ని పంటలకూ బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు కేవలం ప్రీమియం బియ్యం రకాలకు మాత్రమే పరిమితమయ్యారు. కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు తులం బంగారం హామీ ఇంకా నెరవేర్చలేదు. విద్యార్థినులకు ఎలక్ట్రిక్ వాహనాలు ఇస్తామన్న హామీని నెరవేర్చలేదు.' అని హరీశ్ రావు మండిపడ్డారు.


'దుష్ప్రచారం మానుకోవాలి'


బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన అద్భుతమైన స్కీములను స్కాములని దుష్ప్రచారం చేసిన వారి ఇకనైనా తీరు మార్చుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గత పదేళ్లలో తెలంగాణలో రూ.వేల కోట్ల అభివృద్ధి జరిగిందని కేంద్రం ప్రకటించిన లెక్కలను చూసైనా బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. రాష్ట్రంలో పంటల దిగుబడిలోనే కాదు, పశు సంపదలోనూ గత పదేళ్లు పండగేనని చెప్పారు. కులవృత్తులకూ కేసీఆర్ కొండంత అండగా నిలవడం వల్లే పశు సంపదలోనూ గణనీయ వృద్ధి సాదించిందని తెలిపారు. తెలంగాణలో డిమాండ్‌కు తగ్గట్టుగా ఇక్కడే మాంసం, పౌల్ట్రీ ఉత్పత్తులు పెంచే ప్రయత్నం చేశామన్నారు.




Also Read: Revanth To Modi: మోడీగారూ మీరు చెప్పేవన్నీ అబద్దాలే ఇవిగో నిజాలు - తెలంగాణ సీఎం రేవంత్ రిప్లై వైరల్