BRS Left Parties : బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు అంటూ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు చేసిన తర్వాత బీఆర్ఎస్ నేతలు వరుసగా తెర ముందుకు వచ్చారు. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తులు పెట్టుకునేది లేదని తేల్చి చెప్పారు. అయితే  ఇది ఇతర పార్టీల్ని ఆశ్చర్యపరచలేదు కానీ కమ్యూనిస్టు పార్టీలను మాత్రం కాస్త ఆందోళనకు గురి చేస్తోంది. కేసీఆర్ నట్టేట ముంచుతారా అని వారు అనుమానిస్తున్నారు. మునుగోడు ఉపఎన్నికల్లోభేషరతుగా బీఆర్ఎస్‌కు కమ్యానిస్టులు మద్దతు ఇచ్చారు. తర్వాత కూడా తమ  బంధం కలిసి ఉంటుందని ప్రకటించుకున్నారు. ఆ పార్టీ ముఖ్య నేతలు ఎక్కడెక్కడ పోటీ చేయాలో కూడా లెక్కలేసుకున్నారు. కానీ ఇప్పుడు  మాత్రం ఏదో అనుమానం వారిలో పట్టి పీడిస్తోంది. 


బీఆర్ఎస్‌తో పొత్తుపై ఆశలు పెట్టుకున్న కమ్యూనిస్టులు 
 
చాలా కాలంగా చట్ట సభలో సరియైన ప్రాతినిథ్యం లేకుండా చాలా బోరుగా ఫీలవుతోన్న కామ్రేడ్లు ఎన్నికలు తరుముకు వస్తోన్న తెలంగాణాలో అప్రమత్తం అయిపోయారు. పాలక పక్షమైన బి.ఆర్.ఎస్. తో పొత్తు పెట్టుకుని కాసిని సీట్లు సంపాదించి పూర్వ వైభవం పొందాలని కామ్రేడ్లు ఆశపడుతున్నారు.  అయితే ఉమ్మడి ఏపీలో కమ్యూనిస్టు పార్టీలకున్న ప్రాభవం ఇపుడు అంతగా లేదు కాబట్టి వారిని శాసన మండలికి పంపిస్తే సరిపోతుందని బి.ఆర్.ఎస్. అధినేత భావిస్తున్నారట. తెలంగాణాలో ఎన్నికల వాతావరణం వేడెక్కి చాలా కాలమైంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల మూడ్ లోకి వచ్చేసి అందుకు అనుగుణంగా రాజకీయాలు చేసేస్తున్నాయి కూడా.  ఇటీవలి మునుగోడు ఉప ఎన్నికలో బి.ఆర్.ఎస్. కు మద్దతుగా నిలిచిన కమ్యూనిస్టులు వచ్చే ఎన్నికల్లో అదే బి.ఆర్.ఎస్. తో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించాయి.  


కమ్యూనిస్టులతో సీట్ల సర్దుబాటు అంత సులువు కాదు !


కమ్యూనిస్టు పార్టీలు బలంగా ఉన్నది నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో. అలాగే కొందరు ముఖ్య నేతలు ఉన్న ఇతర జిల్లాల్లోనూ సీట్లు అడగొచ్చు. అసెంబ్లీ స్థానాల్లో కేసీఆర్ ఇతర పార్టీలకు సీట్లు కేటాయిస్తారా అన్నది చర్చనీయాంశంగానే  మారింది. కనీసం రెండు పార్టీలకు కలిసి ఐదు స్థానాలైనా కల్పిస్తే.. సర్దుకుపోయే అవకాశం ఉంటుంది. కానీ ఆ స్థానాలు ఖమ్మం, నల్లగొండ జిల్లాలోనే ఉంటాయి. ఆ జిల్లాలో బీఆర్ఎస్ లో పోటీ అధికంగా ఉంది. సీట్లు కేటాయించకపోతే పొత్తుల వల్ల ప్రయోజనం ఉండదు. కమ్యూనిస్టు పార్టీలతో ఒక్క తెంలగాణలో మాత్రమే కాకుండా.. దేశవ్యాప్తంగా నడవాలని కేసీఆర్ అనుకుంటున్నారు. అందుకే వారికి పార్లమెంట్ లేదా ఎమ్మెల్సీ, రాజ్యసభ సీట్లు ఇస్తామని చెప్పి కవర్ చేసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. 


కేసీఆర్ సీట్లివ్వకపోతే కమ్యూనిస్టుల పరిస్థితేమిటి ? 
 
ఉమ్మడి ఏపీలో కమ్యూనిస్టు పార్టీలు గరిష్టంగా 34 స్థానాల్లో గెలిచాయి. అపుడు ఎన్టీయార్ ప్రభంజనంలో టిడిపితో పొత్తు పెట్టుకున్న కమ్యూనిస్టు పార్టీలు 37 స్థానాల్లో పోటీ చేసి కేవలం మూడు చోట్లే ఓటమి చెందాయి. రాష్ట్ర శాసన సభలో ఉభయ కమ్యూనిస్టుల చివరి ఘన వైభవం అదే. ఆ తర్వాత 1999లో రెండు పార్టీలూ కలిసి ఆరు చోట్లే గెలిచాయి. 2004 ఎన్నికల్లో సిపిఐ 12 చోట్ల పోటీ చేసి ఆరు చోట్ల గెలిచింది. సీపీఎం 14 స్థానాల్లో పోటీ చేసి 9 స్థానాలు సొంతం చేసుకుంది. ఈ ఎన్నికల్లో కమ్యూనిస్టులు వై.ఎస్.ఆర్. ప్రభంజనంలోని కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు. 2009 ఎన్నికల్లో టి.ఆర్.ఎస్, టిడిపి, కమ్యూనిస్టులు కలిసి మహాకూటమి కట్టారు.ఈ ఎన్నికల్లో సిపిఐ నాలుగు చోట్ల సిపిఎం ఒక్క చోట గెలిచాయి. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ ఎన్నికల్లో సిపిఐ, సిపిఎం చెరో సీటుతో సరిపుచ్చుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో అయితే కమ్యూనిస్టులు అసలు బోణీ కొట్టలేకపోయారు. 2018లో తెలంగాణాకు జరిగిన ఎన్నికల్లో కమ్యూనిస్టులు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయారు. ఆ తర్వాత 2019లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కామ్రేడ్లు అడ్రస్ గల్లంతు చేసుకున్నారు. అందుకే వచ్చే తెలంగాణా ఎన్నికల్లో ఎలాగోలాగా ప్రాతినిధ్యం ఉండాలని ప్రయత్నిస్తున్నారు.  అయితే కమ్యూనిస్టులతో పొత్తులకు ఎవరూ సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు. బి.ఆర్.ఎస్. పొత్తుకు సై అన్నా సీట్ల విషయంలో కేసీయార్ కు వేరే ఆలోచనలు ఉండటంతో  వారిలో టెన్షన్ ప్రారంభమయింది.