JP Nadda on Tribal Woman Incident: 


రాజస్థాన్‌లోని ప్రతాప్‌ గఢ్‌ జిల్లాలో గిరిజన మహిళను వివస్త్రను చేసి ఊరేగించిన ఘటనపై భారతీయ జనతా పార్టీ (BJP)  తీవ్రంగా స్పందించింది. రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. రాష్ట్రంలో పూర్తిగా శాంతి భద్రతలు కరవుయ్యాయని, అసలు పాలన పూర్తిగా ఆబ్సెంట్‌ అని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. మహిళను వివస్త్రను చేసి ఊరేగించిన వీడియో తనను షాక్‌కు గురిచేసిందన్నారు. అశోక్‌ గహ్లోత్‌ ప్రభుత్వం, మంత్రులు రాష్ట్రంలో ఫ్యాక్షన్‌ గొడవలు సెటిల్‌ చేయడంలోనే, దిల్లీలో ఓ రాజవంశాన్ని బుజ్జగించే పనుల్లో బిజీగా ఉన్నారని ఆయన దుయ్యబట్టారు. ఇక మహిళల భద్రత గురించి ఎవ్వరూ పట్టించుకోవడం లేదని, పూర్తి నిర్లక్ష్యంగా ఉంటున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై నడ్డా విమర్శలు చేస్తూ సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫాం ఎక్స్‌ (ట్విట్టర్‌) లో పోస్ట్‌ చేశారు. ప్రతి రోజు మహిళలపై నేరాలు జరుగుతున్న సంఘటనలు బయటకు వస్తున్నాయని నడ్డా పేర్కొన్నారు. 


ఈరోజు రాజస్థాన్‌ మరోసారి సిగ్గుపడాల్సిన రోజు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీపీ జోషి అన్నారు. ప్రతాప్‌ గఢ్‌ జిల్లాలోని ధరియావాడ తాలూకా పహాడ గ్రామ పంచాయతీలో మహిళ పట్ల జరిగిన దారుణ ఘటన గురించి సోషల్‌ మీడియాలో వచ్చే వరకు అడ్మినిస్ట్రేషన్‌కు తెలియకపోవడం దారుణమని విమర్శించారు. మహిళలపై నేరాలు, అత్యాచారాలలో రాజస్థాన్‌ ఎందుకు నెంబర్‌ 1 గా ఉంటోందని ఆయన ప్రశ్నించారు.  


ప్రతాప్‌గఢ్‌ జిల్లాలోని ధరియావాడ తాలూకాలో ఓ గిరిజన మహిళను భర్త, అత్తమామలే వివస్త్రను చేసి ఊరేగించిన వీడియో సంచలనంగా మారింది. వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందనే ఆరోపణలతో అత్తింటి వారు ఇలాంటి అమానవీయ ఘటనకు పాల్పడ్డారు. అత్తింటి వారు ఆమెను కిడ్నాప్‌ చేసి వారి గ్రామానికి తీసుకొచ్చి మరీ వివస్త్రను చేసి ఊరేగించారు. అంతేకాకుండా దారుణంగా వీడియో తీశారు. ఆమె దయనీయ స్థితిలో వేడుకుంటున్నా పట్టించుకోలేదు. ఈ వీడియో వైరల్‌గా మారడంతో రాజస్థాన్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీంతో ప్రభుత్వం ఈ ఇష్యూను సీరియస్‌గా తీసుకుంది. ఇప్పటికే దీనిపై పూర్తి విచారణ చేపట్టాలని డీజీపీని ఆదేశించింది. ఆరు బృందాలతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను అరెస్ట్‌ చేసి ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ద్వారా విచారణ చేస్తామని సీఎం అశోక్‌ వెల్లడించారు. ఘటనపై మాజీ సీఎం వసుంధర రాజే కూడా తీవ్రంగా స్పందించారు. రాజస్థాన్‌ పరువు పోతోందంటూ ఆవేదన వ్యక్తంచేశారు.