BJP Telangana : దక్షిణాదిన తాము అధికారం చేపట్టే రెండో రాష్ట్రం బీజేపీ అని ఆ పార్టీ అగ్రనాయకత్వం గట్టి నమ్మకంతో ఉంది. తెలంగాణలో ఇప్పుడిప్పుడే పట్టు చిక్కుతోంది. అందుకే విజయం దక్కేవరకు ప్రయత్నించాలి. అది ఎలాగైనా సరే. విజయానికి అడ్డ దారులుండవన్న నానుడిని బీజేపీ చక్కగా వంటబట్టించుకుంది.  అనుకున్నది సాధించాల్సిందే .. ఇది బీజేపీ ధోరణి. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే ఫార్మూలాని ఫాలో అయ్యింది.. అనుకున్నది సాధించింది. ఇప్పుడు దీన్ని సౌత్‌ లోనూ షురూ చేయబోతోందా ? అంటే అవుననే సంకేతాలే ఎక్కువగా కనిపిస్తున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు.


అప్రతిహతంగా సాగుతున్న బీజేపీ జైత్రయాత్ర!


2014లో ప్రారంభమైన బీజేపీ హవా ఆ తర్వాత జరిగిన మినీ పార్లమెంటు ఎన్నికల్లో కాస్తంత దెబ్బతింది. తిరిగి కాంగ్రెస్‌ పుంజుకోవడం స్టార్ట్‌ అయ్యింది. అప్పుడు మోదీ-అమిత్‌ షాల ఆలోచనలకు కార్యరూపం మొదలైందంటున్నారు రాజకీయవిశ్లేషకులు. ఆయారాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు, కాంగ్రెస్‌ పార్టీల్లో చీలికలు తెప్పించడం, తిరుగుబాటు లేవదీయడం వంటివి స్టార్ట్‌ చేశారు. అభివృద్ధికి అడ్డుతగులుతూ పాలనను కుంటుపడేలా చేశారన్న విమర్శలు ఉన్నాయి. వాటి ఫలితంగానే చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ కి ఆదరణ ఉన్నా గెలవలేకపోయిందన్న వాదనలున్నాయి. అప్పటి నుంచి మొదలైన ఈ అధికార దండయాత్ర రానురాను ఉగ్రరూపంగా మారిందంటున్నారు.


పునాదులు లేని చోట్ల అధికార పార్టీగా ఎదిగిన బీజేపీ ! 


కమలం కనిపించని ఊర్లు, రాష్ట్రాల్లో ఇప్పుడు ఆ పార్టీ హవా కనిపిస్తోంది. ప్రాంతీయ పార్టీలకు అడ్డా,కాంగ్రెస్‌ కి కంచుకోటగా ఉన్న ప్రాంతాలు, హేమాహేమీలైన నేతలంతా కాషాయం కప్పేసుకున్నారు. ఫలితంగా ఒకప్పుడు బలహీనంగా ఉన్న బీజేపీ ఇప్పుడు బలమైన పార్టీగా మారింది. చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ ని చరిత్రలో కలిపేసేందుకు మరెంతోకాలం లేదన్న మాటలు రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇదే ఫార్మూలాని దక్షిణాదిన కూడా అమలు పర్చింది. కర్నాటకలో వ్యూహం ఫలించింది. హస్తం నుంచి పవర్ కమలం చేతికి వచ్చింది. ఇప్పుడు తెలంగాణలోనూ అదే ప్లాన్‌ కంటిన్యూ చేయబోతోందా అంటే కాస్తంత డిఫరెంట్ గా బీజేపీ వ్యూహం కనిపిస్తోంది. 


అసెంబ్లీ ఎన్నికల్లో బలం చూపించే వ్యూహం ! 


ముందుగా అసెంబ్లీ ఎన్నికల్లో బలాన్ని చూపించాలని ఉవ్విళ్లూరుతోందట. ఎన్నికల్లో గెలుపు టార్గెట్ కాదు  వచ్చే ఎన్నికల్లో కాకపోతే ఆపై వచ్చే ఎన్నికల్లో పక్కా అన్న ధీమాతో ప్రణాళిక రచిస్తోందని చెబుతున్నారు.  ముందస్తు ఎన్నికలే వస్తే ఈసారి బలమైన ప్రతిపక్షంగా నిలవాలన్నది బీజేపీ ముందస్తు ప్లాన్‌. అంటే ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ రాకుండా చేయాలన్నదే ఆలోచనట.   సిఎం కెసిఆర్‌ కుటుంబపాలనపై కసిగా ఉండి, అవకాశం లేక ఎదురుచూస్తున్న వాళ్లని ఆదరించే పనిలో ఉందట బీజేపీ. ఇప్పటికే కవిత, కెటిఆర్‌, హరీశ్‌ రావులపై గెలవగల దమ్మునోళ్లను రెడీ చేసుకుందట. ముందస్తు అని ప్రకటించగానే అభ్యర్థుల పేర్లను ప్రకటించి ప్రచారాన్ని కూడా ముందుగానే స్టార్ట్‌ చేసే ఆలోచనలో ఉందట. అన్నీ అనుకూలిస్తే..కాదు అనుకూలించేలా చేసి రానున్న ఎన్నికల్లో కారుని కదలనివ్వకుండా చేసి కాషాయం పవర్‌ ఏంటో చూపించబోతున్నారని రాజకీయవర్గాల్లో వినిపిస్తున్న మాట.