AP Politics :  రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా నిలబడిన ద్రౌపది ముర్ము ఏపీకి వచ్చారు. రాష్ట్రపతి ఎన్నికల్లో నిర్ణయాత్మక శక్తిగా భావించిన వైఎస్ఆర్‌సీపీ ముందుగానే మద్దతు ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ ఒక రోజు ముందుగా మద్దతు ఇచ్చింది. ఆమె ఒకే రోజు రెండు పార్టీలకు చెందిన ఓటర్లతో సమావేశం అయ్యారు. ఇక జనసేన పార్టీ కూడా వ్యతిరేకించలేదు. ఆ పార్టీకి ఓట్లు లేకపోవడంతో  రాష్ట్రపతి అభ్యర్థి కలవలేదనుకోవచ్చు. అయితే ఇప్పుడు అందరికీ వస్తున్న సందేహం ఒక్కటే. ఇంత కీలకమైన ఎన్నికల్లో పోటీ పడి మరీ బీజేపీకి మద్దతిచ్చి ఏం సాధిస్తున్నారు ? రాష్ట్రానికి ఏమైనా ప్రయజనాలు అడిగారా? కనీసం ఓ మాట చెప్పారా? అనే. కానీ ఏ ఒక్క పార్టీ కూడా మేము మద్దతిస్తున్నామనో..మద్దతిస్తామనో చెప్పి మా రాష్ట్రానికి ఫలానా మేలు చేయండి  అని అడిగలేదు. ఈ అంశమే ఇప్పుడు ప్రజల్ని కూడా ఆశ్చర్య పరుస్తోంది. 


వైఎస్ఆర్‌సీపీ మద్దతు కీలకం - ఒక్క డిమాండ్ పెట్టకపోవడంపై విమర్శలు !


వైఎస్ఆర్‌సీపీకి రాష్ట్రపతి ఎన్నిక కోసం ఓట్లు ఉన్న ఎలక్టోరల్ కాలేజీలో ఆరు శాతం ఓట్లు ఉన్నాయి. ఎన్డీఏ అభ్యర్థి విజయం సాధించాలంటే ఆ ఆరు శాతం ఓట్లు కీలకం. ఆ విషయం ఆ పార్టీ నేతలు కూడా ప్రకటించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తమ పార్టీ కీలకమని విజయసాయిరెడ్డి కూడా పలుమార్లు ప్రకటించారు. వారి ప్రకటనలు చూసి చాలా మంది సామాన్యులు ఏపీకి రావాల్సిన వాటి కోసం పట్టుబట్టి మద్దతు ప్రకటిస్తారని అనుకున్నారు. కానీ ఎలాంటి డిమాండ్స్ పెట్టలేదు. ప్రత్యేకహోదాను అడగడానికి ఇదేమంచి తరుణం అని చాలా మంది తటస్థులు కూడా సూచించారు. అయితే ఏపీ పాలకులు మాత్రం పట్టించుకోలేదు. చివరికి తాము మద్దతు అడగకుండానే ప్రకటించారని బీజేపీ నేతలు కూడా విమర్శలు గుప్పించారు. అయితే బీజేపీ హైకమాండ్ తర్వాత తాము మద్దతు అడిగామని ప్రకటించి.. కాస్త ఊరటనిచ్చారు. అయితే గట్టిగా షరతులు పెట్టే  బలమున్నా... వైఎస్ఆర్‌సీపీ నేతలు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఒక్క విజ్ఞప్తి కూడా ఎందుకు చేయలేదో ఎవరికీ అర్థం కాని విషయం. 


చివరి క్షణంలో టీడీపీ మద్దతు - ఆ పార్టీదీ అదే తీరు..! 


తెలుగుదేశం పార్టీకి ముగ్గురు ఎంపీలు, ఇరవై మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఎలక్టోరల్ కాలేజీలో వీరికి ఉన్న ఓట్లు దాదాపు అరశాతమే. ఏ మాత్రం ప్రభావం చూపలేని ఓట్లు. అందుకే తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి గుంభనంగాఉంది. విపక్ష పార్టీల నేతలు నిర్వహిస్తున్న సమావేశాలకు కూడా  ఆ పార్టీకి ఆహ్వానం అందలేదు. అయితే చివరి క్షణంలో సామాజిక న్యాయం పేరు చెప్పి బీజేపీ అభ్యర్థికే మద్దతు తెలిపారు. ఏపీకి ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన ద్రౌపది ముర్ముతో ఆత్మీయ సమావేశం కూడా ఏర్పాటు చేశారు. అయితే రాష్ట్రప్రజలు ఇచ్చిన అరకొర బలంతో అయినా రాష్ట్రం కోసం ఫలానా మేలు చేయమని బీజేపీని అడగలేకపోయారు. నిర్ణయాత్మక శక్తి...  పాలనలో ఉన్న వైఎస్ఆర్‌సీపీనే అడగలేదు. తామెంత అన్నట్లుగా బీజేపీ నేతలు వ్యవహరించారు. 


బీజేపీ గుడ్ లుక్స్‌లో ఉంటే చాలనుకకుంటున్నారా ?


భారతీయ జనతాపార్టీకి ఏపీలో బలం లేదు. అయితే  ఆ పార్టీ  విషయంలో ఏపీలోని ప్రధాన పార్టీలన్నీ అణిగిమణిగి ఉంటున్నాయి. తమ జోలికి రాకపోతే చాలు ఎలాంటి సాయం కావాలన్నా చేస్తామన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి.  తమ రాష్ట్రానికి ఏ మేలు చేసినా చేయకపోయినా పట్టించుకోవడం లేదు. పొత్తులో ఉన్న జనసేన పార్టీది అదే పరిస్థితి. అందుకే ఏపీలో ఏ పార్టీ గెలిచినా బీజేపీ గెలిచినట్లే అని కొంత మంది విశ్లేషకులు సెటైర్లు వేస్తున్నారు.