మహిళా రిజర్వేషన్ బిల్లుపై  ప్రధానమంత్రి మోదీకి తెలంగాణ సీఎం కేసీఆర్ రాసిన లేఖపై తెలంగాణ బీజేపీ కౌంటర్ ఇచ్చింది. ఫామ్‌హౌస్ ప్లానింగ్, ఫామ్‌హౌస్‌ రియాల్టీ అంటూ లెక్కలతో వివరించేప్రయత్నం చేసింది. అసెంబ్లీ, పార్లమెంట్‌ సభ్యుల్లో 33 శాతం మహిళలు ఉండాలని ఫామ్‌హౌస్‌ ప్లానింగ్‌లో ఉందని కానీ రియాల్టీలో అది చాలా దూరంగా ఉందంటూ ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేసింది. 


వంద మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఉంటే అందులో మహిళా ఎమ్మెల్యేలు 5 శాతం మందేనని... అంటే ఇక్కడ ఐదు శాతమే ఉన్నారని బీజేపీ విమర్సించింది. బీఆర్‌ఎస్‌ ఎంపీలు 16 మంది ఉంటే అందులో ఒక్కరంటే ఒక్కరే మహిలా ఎంపీ ఉన్నారని అంటే ఇక్కడ 6.25 శాతమేనంటూ గుర్తు చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు కలుపుకున్నా 33 శాతం కావడం లేదని వ్యంగ్యంగా స్పందించింది బీజేపీ. అందుకే కేసీఆర్‌ది మోసపూరిత రాజకీయం అంటూ విమర్శలు చేసింది. 


పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలతో చర్చించిన సీఎం కేసీఆర్ బీసీ, మహిళా రిజర్వేషన్ల అంశంపై గట్టిగా పట్టుపట్టాలని నిర్ణయించారు. ఈ భేటీ అనంతరం ప్రధానమంత్రి మోదీకి కేసీఆర్ లేఖ రాశారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును.. మహిళా రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలని కోరారు. చట్ట సభల్లో 33 శాతం బీసీ రిజర్వేషన్ కల్పించాలని, మహిళలకు 33శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ప్రధానికి రాసిన లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు. 18 నుంచి జరిగే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో 2 బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. బీసీ అభ్యున్నతి, మహిళా సంక్షేమానికి బీఆర్ఎస్ కట్టుబడి ఉందని, వారి హక్కుల రక్షణకు బీఆర్ఎస్ తన గళాన్ని వినిపిస్తూనే ఉంటుందని కేసీఆర్ అన్నారు.






పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.  కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన బకాయిలు, విభజన చట్టంలో ఇచ్చిన హామీలు, కేంద్రం తెచ్చే బిల్లులు తదితర అంశాలపై పార్టీ వైఖరి, అనుసరించాల్సిన వ్యూహంపై చ‌ర్చిస్తున్నారు. పార్టీ పార్లమెంటరీ నేత కే కేశవరావు, లోక్‌సభా పక్షనేత నామా నాగేశ్వర్‌రావు సహా ఎంపీలందరూ ఈ సమావేశంలో పాల్గొన్నారు.


దేశం పేరును ఇండియాగా కాకుండా భారత్‌గా మారుస్తామంటూ జీ-20 సమావేశాల సందర్భంగా చెప్పకనే మోదీ ప్రభుత్వం చెప్పింది. ఇది పార్లమెంటులో చర్చకు వస్తే ఏం చేయాలి..? అన్నది బీఆర్‌ఎస్‌కు సమస్యగా ఉన్నది. దీనిపై ఇప్పటికే అన్ని పార్టీలూ తమ తమ వైఖరులను స్పష్టం చేశాయి. కేంద్ర వైఖరికి అనుకూలంగానో, వ్యతిరేకంగానో తమ తమ అభిప్రాయాలను వెల్లడించాయి. కానీ బీఆర్‌ఎస్‌ మాత్రం ఇప్పటికీ తన వైఖరిని స్పష్టం చేయలేదు.