CWC Meeting : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు, రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు హైదరాబాద్ నుంచి సమరశంఖం పూరిస్తున్నారు. రెండు రోజుల పాటు సీడబ్ల్యూసీ సమావేశాలు, భారీ బహిరంగసభతో దేశం మొత్తం తమ వైపు చూసుకునేలా చేయాలనుకుంటున్నారు. ఇందు కోసం కీలక నిర్ణయాలు , ప్రకటల కోసం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం అవుతోంది. బహిరంగసభతో బలప్రదర్శన కూడా చేయబోతున్నారు.
కీలకంగా సీడబ్ల్యూసీ సమావేశం
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తొలి సమావేశం హైదరాబాద్ లో జరగనుంది. ఈ సందర్భంగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు , 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికలకు(Lokh sabha Elections) వ్యూహరచనపై పార్టీ చర్చించనుంది. గెలుపే లక్ష్యంగా అందరూ కలిసి కట్టుగా పని చేయాలనే సందేశాన్ని క్యాడర్ కి అందించనుంది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతం అయిన తర్వాత భారత్ జోడో యాత్ర 2.0ని చేపట్టడంపై కూడా కమిటీ చర్చలు జరిపే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో 39 మంది సాధారణ సభ్యులు ఉన్నారు. వీరు శనివారం మొదటి సమావేశాన్ని నిర్వహిస్తారు. ఆదివారం అన్ని రాష్ట్రాల పీసీసీ నేతలు, సీఎల్పీ తదితరులతో సమావేశం నిర్వహించనున్నారు.
తెలంగాణలో గెలుపు టార్గెట్
సీడబ్ల్యూసీ మీటింగ్ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేతలంతా హైదరాబాద్ కి తరలి రానున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కు పాజిటీవ్ వాతావరణం ఉందని దానిని సద్వినియోగం చేసుకోవాలని అనుకుంటున్నారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 17న జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ ఆధ్వర్యంలో "మెగా ర్యాలీ" నిర్వహించనున్నారు. అదే సమయంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం ఐదు గ్యారంటీ హామీలను కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రకటించనున్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం రాష్ట్రాలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు, 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ను ఢీకొట్టాలనే వ్యూహంపై ఈ భేటీలో స్పష్టత వస్తుంది.
ఇప్పటికే తెలంగాణలో ప్రత్యేక వయ్ూహాల అమలు
ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల ప్రక్రియ పూర్తిగా అధిష్టానం కన్నుసన్నల్లోనే కొనసాగుతున్నది. తెలంగాణ రాష్ట్రానికి గత రెండు నెలల్లో ఢిల్లీ నుంచి 30 మంది దూతలు వచ్చారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావు ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్ చౌదరి, మన్సుర్‌అలీ ఖాన్, ప.ి విశ్వనాథ్…ఇక్కడే మకాం వేశారు. గాంధీభవన్ నుంచి ఠాక్రే పర్యవేక్షణ చేస్తుండగా, మిగతా ముగ్గురు మాత్రం జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఆయా జిల్లాల్లో నిర్మాణం, పార్టీ బలోపేతం, అంతర్గత విభేదాలు తదితర అంశాలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. పార్టీ దృష్టికి వస్తున్న సమస్యలను హైకమాండ్‌కు నివేదిస్తున్నారు. రాష్ట్రంలోని 17పార్లమెంట్ నియోజకవర్గాలకు ఒక ఇంచార్జితోపాటు వారందరికీ కన్వీనర్‌గా దీపదాస్ మున్షీని, కో కన్వీనర్‌గా మీనాక్షి నటరాజన్‌ను పార్టీ నియమించింది. ఎక్కడ ఏ సమస్య వచ్చినా స్థానిక నేతలతో సమన్వయం చేసుకుంటూ దాన్ని పరిష్కరిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
భారీ ఎత్తున విజయభేరి సభ
17న నిర్వహించబోయే విజయభేరి సభను విజయవంతం చేసేందుకు క్షేత్రస్థాయి నుంచి సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీకి ఊపు తెచ్చేలా ప్రయత్నిస్తున్నారు. సభకు భారీ జనసమీకరణ చేపట్టడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఇక తిరుగులేదనే సంకేతాలు ఇచ్చేందుకు నాయకత్వం ప్రయత్నిస్తున్నది. మరోవైపు మ్యానిఫెస్టో కమిటీ, కమ్యూనికేషన్ కమిటీ, శిక్షణ తరగతుల కమిటీ, బీసీ డిక్లరేషన్ కమిటీ…ఇలా రకరకాల కమిటీ సమావేశాలతో గాంధీభవన్ బిజీబిజీగా మారింది. కర్నాటక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇప్పటికే అమలు చేస్తున్న కాంగ్రెస్…ఇక్కడ కూడా అదే మాదిరిగా హామీలిచ్చి అమలయ్యేలా రాహుల్‌గాంధీ భరోసా కల్పించనున్నారు.