పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా బీజేపీని ( TS BJP ) బలోపేతం చేయాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ( Bandi Sanjay )  నిర్ణయించుకున్నారు. మార్చి 3 నుండి 13 వరకు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా విస్త్రతస్థాయి సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒక్కో రోజు ఒక్కో పార్లమెంట్ ( Parlament Segments ) సెగ్మెంట్ పరిధిలో నియోజకవర్గస్థాయి విస్త్రత సమావేశం నిర్వహిస్తారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితిని వివరిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, కేంద్ర ప్రభుత్వ విజయాలపై చర్చిస్తారు. పార్టీ సంస్థాగత బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలతోపాటు మీడియా, సోషల్ మీడియా ప్రాధాన్యత, స్థానిక సమస్యలు, భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ వంటి అంశాలపై లోతుగా చర్చించనున్నారు. ఆయా పార్లమెంట్ సెగ్మెంట్ లో చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణపై యాక్షన్ ప్లాన్ ( Action Plan ) ను రూపొందిస్తారు.
 


తొలి దశలో 10 పార్లమెంట్ నియోజకవర్గాల సెగ్మెంట్లలో సదస్సులు నిర్వహిస్తారు.  మార్చి 14 నుండి పార్లమెంట్ బడ్జెట్ ( Parlament Budget meetings ) సమావేశాలు ప్రారంభం కానుండటంతో బండి సంజయ్ ఆ సమావేశాల్లో పాల్గొనాల్సి ఉంది. అయితే శని, ఆదివారాలు పార్లమెంట్ సమావేశాలు జరిగే అవకాశం లేనందున ఆయా రోజుల్లో రాష్ట్రంలోని మిగిలిన 7 ఎంపీ సెగ్మెంట్లలో సదస్సులు నిర్వహిస్తారు. మొత్తంగా మార్చి నెలాఖరు లేదా ఏప్రిల్ తొలి వారం నాటికి రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో విస్త్రతస్థాయి సమావేశాలను పూర్తి చేయాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం ప్రణాళిక రూపొందించింది.ఒక్కో పార్లమెంట్ సెగ్మెంట్ లో జరిగే సమావేశానికి దాదాపు 3 వేల మంది నాయకులను ఆహ్వానించాలని భావిస్తున్నారు. 


ఈ సమావేశానికి ఏయే స్థాయి నాయకులను ఆహ్వానించాలనే అంశంపై రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే కసరత్తు చేస్తోంది. బూత్ కమిటీ అధ్యక్షులు మొదలు మండల కార్యవర్గం, జిల్లా పదాదికారులతోపాటు వివిధ మోర్చాల నాయకులతోసహా ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని నాయకులందరినీ ఈ సమావేశానికి ఆహ్వానించనున్నారు. తొలి దశలో కరీంనగర్,  నిజామాబాద్, ఆదిలాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్ గిరి, మహబూబ్ నగర్, మెదక్, వరంగల్, భువనగిరి, ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గాల్లో విస్త్రత స్థాయి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. మిగిలిన నియోజకవర్గాల సమావేశాలను పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తరువాత శని, ఆదివారల్లో నిర్వహించేలా పార్టీ రాష్ట్ర నాయకత్వం ప్రణాళికను సిద్ధ చేస్తోంది.  


కేసీఆర్ ప్రభుత్వం ( KCR Governament )  పట్ల ప్రజా వ్యతిరేకత తీవ్రంగా పెల్లుబీకుతున్న నేపథ్యంలో ఆ వాతావరణాన్ని బీజేపీకి అనుకూలంగా మార్చుకునేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించడంతోపాటు వివిధ అంశాలపై భారీ ఎత్తున ఉద్యమాలు చేసేదిశగా క్షేత్ర స్థాయిలో  పార్టీ శ్రేణులనూ పూర్తిగా సమాయత్తపర్చడమే ఈ పార్లమెంట్ నియోజకవర్గాల విస్త్రత స్థాయి సమావేశాల ప్రధాన ఉద్దేశమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.