Telangana:  భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిక్కుల్లో పడినట్లుగా కనిపిస్తోంది. లగుచర్ల గ్రామంలో వికారాబాద్ కలెక్టర్‌పై జరిగిన దాడి వ్యవహారం ఒక్క రోజునే బీఆర్ఎస్ అగ్రనేతల్ని చుట్టుముట్టంది. నేరుగా కలెక్టర్‌పై దాడి చేయడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. నిందితుల్ని రాత్రికి రాత్రి అరెస్టు చేశారు. అసలు నిందితుడు సురేష్ కాల్ డేటాను విశ్లేషించడంతో పోలీసులకు ఓ క్లారిటీ వచ్చింది. ఆయన రెండు రోజుల వ్యవధిలో 42 సార్లు పట్నం నరేందర్ రెడ్డితో మాట్లాడటంతో మొత్తంగా  పోలీసులు స్పష్టత వచ్చారు. ఉదయమే నరేందర్ రెడ్డిని అరెస్టు చేశారు. సాయంత్రానికి రిమాండ్ రిపోర్టులో ఆయనే కేటీఆర్ పేరు చెప్పారని పోలీసులు ప్రకటించారు. దాంతో ఈ వ్యవహారం సంచలనంగా మారుతోంది. 


కేటీఆర్‌ను ఏ-1గా పెడతారా ?


లగుచర్ల దాడి ఘటనలో పట్నం నరేందర్ రెడ్డిని ప్రస్తుతానికి ఏ వన్ గా చేర్చారు. అయితే ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చాలా పెద్ద స్థాయిలో జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ విషయంలో నరేందర్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం మేరకు ఆయన పేరును రిమాండ్ రిపోర్టులో చేర్చారు. ఆధారాల ప్రకారం  చూస్తే.. కలెక్టర్ దాడి ఘటన జరగడానికి ముందు తర్వాత నరేందర్ రెడ్డి  ఆరు సార్లు కేటీఆర్ కు ఫోన్ చేశారని పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. దాడి ఘటనకు ముందు నుంచి దాడి చేసిన తర్వాత పూర్తి స్థాయిలో సురేష్..పట్నం నరేందర్ రెడ్డితో టచ్ లో ఉండటం.. నరేందర్ రెడ్డి కేటీఆర్ తో టచ్ లో ఉండటంతో ఇదంతా ఇంటర్ లింక్డ్ వ్యవహారమని పోలీసులు ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. అందుకే ఎఫ్ఐఆర్‌లో కూడాకేటీఆర్ పేరును చేర్చేందుకు అవకాశాలు ఉన్నట్లుగా భావిస్తున్నారు. 


Also Read: KTR News: పట్నం నరేందర్ రెడ్డి ఫ్యామిలీని పరామర్శించిన కేటీఆర్, కొండగల్ నుంచే రేవంత్ రెడ్డి భరతం పడతామంటూ ఫైర్


ఈ కేసులో అరెస్టుకు గవర్నర్ పర్మషన్ అవసరం లేదు !


ఫార్ములా వన్ ఈ రేసు కేసులో  రూ. 55 కోట్లు విదేశీ సంస్థకు మళ్లించిన వ్యవహారంలో కేటీఆర్ తప్పు చేశారని ఆయనపై విచారణకు అనుమతి కావాలని ఏసీబీ గవర్నర్‌కు విజ్ఞప్తి చేసింది. కానీ పర్మిషన్ రాలేదని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు లగుచర్ల దాడి ఘటనలో కేటీఆర్ పేరును చేర్చారు. ఈ కేసులో ఆయనను అరెస్టు చేయడానికి గవర్నర్ పర్మిషన్ అవసరం లేదు. గత ప్రభుత్వంలో పని చేసి.. ఆ ప్రభుత్వ నిర్ణయాల్లో అవినీతిపై చర్యలు , విచారణ చేయాలంటే గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి. అలాంటి పర్మిషన్ తీసుకోకుండా వైసీపీ ప్రభుత్వం టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవడం వల్ల అనేక సమస్యలు వచ్చాయి. అందుకే ఏసీబీ పర్మిషన్ అడిగింది. కానీ ఇప్పుడు లగుచర్ల ఘటన .. అలాంటిది కాదు. దీనికి కేటీఆర్ పై కేసు పెట్టడానికి ..అరెస్టు చేయడానికి ఎవరి పర్మిషన్ అవసరం లేదు. 


Also Read:  లగచర్ల దాడి ఘటనలో భారీ ట్విస్ట్- రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు, అవసరమైతే చంపేందుకు రెడీ!


ఇక నుంచి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందా ?


తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ ప్రభుత్వం ప్రజాస్వామ్య నిరసనల పట్ల పెద్దగా ఆంక్షలు పెట్టలేదు. తాము ప్రజాస్వామ్యాన్ని తిరిగి తీసుకు వస్తామని రేవంత్ చెప్పారని అదే చేస్తున్నారని అందుకే.. అందరూ స్వచ్చగా తమ అభిప్రాయాలు చెబుతున్నారని చెప్పేవారు. అయితే ఇప్పుడు ఇది దాడులకు దారి తీసింది. రాజకీయ కుట్రలతో ప్రభుత్వాన్ని అస్థిర పర్చడానికి ఇలాంటి స్వేచ్చను వాడుకుంటున్నారని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. అందుకే ఇక ఉపేక్షించరని అంటున్నారు. మొత్తంగా లగచర్ల దాడి ఘటన రాజకీయంగా పెను సంచలనం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.