Ap Congress News: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి ( Sharmila Reddy) దూకుడు పెంచారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత వరుసగా జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఉత్తరాంధ్ర (Uttarandhra) జిల్లాల నుంచి పార్టీ జిల్లా స్థాయిలో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా విరామం లేకుండా జిల్లాల్లో పర్యటిస్తున్నారు. తాజాగా కడప (Kadapa) జిల్లాలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొననున్నారు. అనంతపురంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం ముగిసిన తర్వాత...ఇడుపులపాయకు చేరుకున్నారు. పార్టీ సమావేశం ముగిసిన తర్వాత వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డితో భేటీ కానున్నట్లు తెలుస్తోంది.
అనంతపురం జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో జగన్ పై విమర్శలు ఎక్కు పెట్టారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల కోసం కొట్లాడటానికి వైఎస్సార్ బిడ్డ అడుగు పెట్టిందన్నారు. బీజేపీకి బానిసలుగా మారిన జగన్ కి ,బాబుకి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించిన షర్మిలా రెడ్డి, ఆంధ్ర ప్రజల హక్కులను తాకట్టు పెట్టినందుకు ఓటు వేయాలా ? అని నిలదీశారు. ఆంధ్ర ప్రజల కోసం కొట్లాడుతుంటే తనపై దాడులు చేస్తున్నారని...తనపై ఎన్ని దాడులు చేసినా భరిస్తానన్నారు.
వైఎస్సార్ హయాంలో 22 లక్షల ఎకరాల్లో వేరుశెనగ పంట సాగయ్యేదన్నారు షర్మిలారెడ్డి. వేరుశెనగ పంట పండక పోతే డబ్బులు పండిస్తామన్నారని...వైఎస్సార్ హయాంలో క్రాప్ ఇన్సూరెన్స్ ఉండేదన్నారు. దీంతో రైతులకు భరోసా ఉండేందని...ప్రస్తుతం 3 లక్షల ఎకరాల్లో కూడా పంట వేయడం లేదన్నారు. బీమా లేకపోవడంతో రైతులు సాహసం చేయడం లేదన్న షర్మిలారెడ్డి...దీనికి కారణం జగన్ ఆన్న ప్రభుత్వమేనని విమర్శించారు. వైఎస్సార్ హయాంలో వ్యవసాయంపై సబ్సిడీ ఉండేదని...అన్ని రకాల పరికరాలు సబ్సిడీపై వచ్చేవని, ఇప్పుడు సబ్సిడీ అనే పథకమే లేదన్నారు.