Prakash Goud Met CM Revanth Reddy | రాజేంద్రనగర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఆదివారం నాడు మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం రేవంత్ నివాసానికి వెళ్లిన ప్రకాష్ గౌడ్ (Prakash Goud).. దాదాపు అరగంట పాటు పలు అంశాలపై చర్చించారు. ఇటీవల మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి(Revanth Reddy)ని కలవడం రాజకీయంగా దుమారం రేపడం తెలిసిందే. ఈ క్రమంలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పార్టీ తాజాగా సీఎం రేవంత్ నివాసానికి వెళ్లి భేటీ అయ్యారు. దాంతో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరారని ప్రచారం జరిగింది. నేడు చేరకపోయినా, కాంగ్రెస్ లో చేరికకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చర్చించారని.. త్వరలోనే హస్తం గూటికి చేరతారని కొన్ని మీడియాలతో పాటు సోషల్ మీడియా ప్లాట్ ఫాంలోనూ జోరుగా ప్రచారం జరిగింది.
కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వస్తున్న వార్తలు అవాస్తవం
తాను కాంగ్రెస్ పార్టీలో చేరారంటూ వస్తున్న వార్తలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ స్పందించారు. తాను కాంగ్రెస్ లో చేరలేదని, అవన్నీ వదంతులేనని కొట్టిపారేవారు. తన నియోజకవర్గం సమస్యలను సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. రాజేంద్రనగర్, శంషాబాద్ మండలం కొత్వాల్ గూడ, బహదూర్ గూడా, ఘన్సిమియా గూడా గ్రామాలలో ఉన్న భూ సంబంధ సమస్యలు పరిష్కారం చూపాలని సీఎంను కోరినట్లు వెల్లడించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం అభివృద్ధికి ప్రతేక నిధులు మంజూరు చేయాలని కోరినట్లు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తెలిపారు. తన వినతిపై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని, అంతేకానీ ఇందులో ఎలాంటి రాజకీయ ఉదేశ్యం లేదన్నారు. నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం తాను వెళ్లి సీఎంతో భేటీ కాగా, పార్టీ మారారంటూ తనపై దుష్ప్రచారం జరిగిందంటూ మండిపడ్డారు.