టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీ పెద్ద ఆశ్చర్యం కలిగించలేదని వైసీపీ మంత్రులు లైట్ తీసుకున్నారు. ప్రజాస్వామ్య  పరిరక్షణపై  చంద్రబాబు, పవన్ చర్చించలేదని, టీడీపీని ఎలా రక్షించాలి అనే అంశంపై చర్చ జరిగిందిని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.
డ్రామా క్రియేట్ చేసుకుంటున్నారు.. అంబటి
పవన్, చంద్రబాబు సమావేశాన్ని ఒక  పవిత్రమైన కలయికగా చిత్రీకరిస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.పెద్ద డ్రామా క్రియేట్ చేస్తున్నారని, పవన్ -  బాబు  కలిస్తే బీజేపీ  ఆశ్చర్యపోవాలి. ఎందుకంటే పవన్ మాతోనే  ఉన్నారు అని బీజేపీ చెబుతోందన్న విషయాన్ని అంబటి గుర్తు చేశారు. కందుకూరు గుంటూరు  తొక్కిసలాట ఘటనకు బాధ్యత ప్రభుత్వం వహించాలా అని ప్రశ్నించారు. జీఓ 1  ని తప్పు పట్టడం దుర్మార్గ ఆలోచనగా అభివర్ణించారు.పేద  ప్రజలకు ఎన్ని  సంక్షేమ కార్యక్రమాలు చేసినా, ఉచితంగా ఇంకా ఇస్తామంటే వెళ్ళరా అని ప్రశ్నించారు. దీనికి ప్రభుత్వ పథకాలు అందకపోవడానికి సంబంధం లేదన్నారు. పవన్ కు అసలు సంస్కారం లేదని, బీజేపీతో పొత్తులో ఉండి బాబుతో లవ్ లో ఉన్నాడని ఎద్దేవా చేశారు. జిఓ నెంబర్ 1 ను  వెనక్కి  తీసుకుంటారని  కలలు  కనొద్దన్నారు. జిఓ 1 ప్రకారం మీటింగ్ లు పెట్టుకోవచ్చుని వివరించారు.
మంత్రి ఆదిమూలపు సురేష్...
పవన్ - చంద్రబాబు భేటీపై రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ కూడా స్పందించారు. చంద్రబాబు - పవన్ ల కలయిక ఇప్పుడు కొత్తేమీ కాదని, ఎన్నికలప్పుడు ఎవరితో పొత్తుకైనా చంద్రబాబు సిద్ధమని పేర్కొన్నారు. గతంలో మహాకూటమి అంటూ అన్ని పార్టీలతో కలవలేదా అని ప్రశ్నించారు. పవన్ ఇప్పటికైనా ముసుగు తొలగించి అసలు విషయం బయట పెట్టాలన్నారు. త్వరలో పవన్ కళ్యాణ్ టీడీపీ కండువా కప్పుకుంటారేమో అని అనుమానం వ్యక్తం చేశారు. పవనేమో ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడుగుతుంటే, చంద్రబాబు చివరి ఛాన్స్ కావాలని అడుగుతున్నాడని మంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలు మాత్రం జగనన్న ఒన్స్ మోర్ అని మళ్ళీ సీఎంగా చేస్తామంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెడుతూ లబ్ధిపొందాలని టీడీపీ, జనసేన చూస్తున్నాయని, జగనన్న మాత్రం కులాలు, ప్రాంతాలు, మతాలకు అతీతంగా అభివృద్ధి చేసుకుంటూ అందరి మన్ననలు పొందుతున్నారని  తెలిపారు.
ముసుగును తొలగించారు - మంత్రి కొట్టు
పవన్, చంద్రబాబు సమావేశంపై మంత్రి కొట్టు సత్యనారాయణ వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి దత్తపుత్రుడు అంటే ఇంత పొడుగున కోపం వచ్చేదని, అయితే ఇప్పుడు పవన్ స్వయంగా చంద్రబాబు ఇంటికి వెళ్లటంతో వాళ్ళ ముసుగు తొలిగిపోయిందని చెప్పారు. పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు జనసేన కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారని, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడేమో అని జనసేన కార్యకర్తలు పని చేస్తుంటే పవన్..  చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం కోసం పనిచేస్తున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ ఒక అవకాశవాదమని, చంద్రబాబు అధికారంలోకి వస్తే తనకు ఆర్థిక లబ్ది చేకూరుతుందని జనసేన పార్టీని, కార్యకర్తలను తాకట్టు పెట్టేస్తున్నారని అన్నారు. జీవో నెం 1 వల్ల వచ్చిన నష్టం ఏమిటని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ రణస్థలం యువశక్తి సభకి, బాలయ్య, చిరంజీవి సినిమాల ప్రీ రిలీజ్ సభలకు పోలీసులు అనుమతులు ఇవ్వలేదా అని ప్రశ్నించారు. జీవో నెం 1 వద్దు అన్నాడంటే పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజల ప్రాణాలను లెక్కచేయనట్లే అవుతుందని చెప్పారు. ప్రజారాజ్యం పార్టీని దెబ్బతీసిన వాళ్ళని వదలను అంటూ చంద్రబాబుతో, ఎలా కుమ్మక్కయావ్ అని పవన్ ను ప్రశ్నించారు. సినిమా డైలాగ్ లు మీటింగ్ వరకేనని, నిజ జీవితంలో అవి కుదరవన్నారు.