Palnadu News: మాచర్లలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఆదివారం నాడు మాచర్ల టీడీపీ ఇంచార్జ్ జులకంటి బ్రహ్మారెడ్డి మరో 23 మంది నాయకులు మాచర్ల పోలీస్టేషన్ కు వెళ్తున్న క్రమంలో పల్నాడు ఉద్రిక్తతంగా మారింది. పల్నాడులో ఎప్పుడు ఏం జరుగుతోందో అన్న ఉత్కంఠ అన్ని రాజకీయ పార్టీలలో‌ నెలకొంది. మాచర్లలో టీడీపీ నాయకులు పోలీస్ స్టేషన్ కు అయ్యే సందర్భాల్లో అధికార పార్టీ శ్రేణులు దాడులకు తెగబడతారేమో అన్న భయం మాచర్ల‌ ప్రజలను వెంటాడుతోంది. ఇప్పటికీ  ఈ నెల 15 వరకు మాచర్ల పట్టణంలో 144 సెక్షన్ అమలులో‌ ఉంది.


అసలేం జరిగిందంటే..?


గత నెల (డిసెంబర్) 16వ తేదీన మాచర్లలో‌ 'ఇదేమి ఖర్మ ఈ రాష్ట్రానికి' పేరిట టీడీపీ నియోజకవర్గం ఇంచార్జ్ జూలకంటి  బ్రహ్మారెడ్డి  కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలోనే వివాదం చోటు చేసుకుంది. టీడీపీ కార్యకర్తలతో కలసి‌ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నుంచి కాన్వెంట్ సెంటర్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. అయితే  కాన్వెంట్ సెంటర్ లో‌ కొందరు వైసీపీ కార్యకర్తలు టీడీపీ వర్గం పై రాళ్ళ దాడి‌ చేయడంతో ఒక్కసారిగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. టీడీపీ కార్యకర్తలు సైతం వైసీపీ నాయకుల పై దాడి చేశారు. వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ బ్రహ్మారెడ్డి ని మాచర్ల నుంచి‌ పంపించేశారు. ఆ తర్వాత ‌అధికార వైసీపీ అభిమానులు టీడీపీ నాయకులపై దాడులకు తెగబడ్డారు.


టీడీపీ అభిమానులను, సానుభూతిపరులను అధికార వైసీపీ కార్యకర్తలు, సానుభూతిపరులు టార్గెట్ చేశారు. టీడీపీ నాయకుల వాహనాలను తగుల‌పెట్టారు. వారి ఇళ్ళకు వెళ్లి విధ్వంసానికి పాల్పడ్డారు. మాచర్లలోని జులకంటి బ్రహ్మారెడ్డి క్యాంప్ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. కార్యాలయానికి నిప్పు పెట్టారు. ఈ విధ్వంసం యథేచ్ఛగా జరిగింది. ఆ సమయంలో పోలీసులు చేతులు ఎత్తేశారు. తర్వాత అదనపు బలగాలు మాచర్లకు చేరుకున్నాయి. పరిస్థితులను అదుపులో తెచ్చేందుకు ప్రయత్నించారు. అల్లర్లకు కారణమైన వారిని ఉపేక్షించేది లేదని పల్నాడు ఎస్పీ తెలిపారు. విధ్వంసానికి కారణమైన టీడీపీ, వైసీపీ నాయకులపై కేసులు నమోదయ్యాయి. అయితే అల్లర్లకు కారణమైన వైసీపీ వారిపై బెయిలబుల్‌ సెక్షన్లు, బాధిత టీడీపీ నాయకులపై నాన్ బెయిలబుల్ సెలక్షన్లు నమోదు చేశారని టీడీపీ పార్టీ‌ నాయకులు ఆరోపించారు. టీడీపీ మాచర్ల నియోజకవర్గం ఇంచార్జ్ జులకంటి బ్రహ్మారెడ్డి ని ఏ1 గా పేర్కొంటూ 36 మంది పై కేసులు నమోదు చేసారు పోలీసులు...


అజ్ఞాతంలోకి జులకంటి:


పది మందిని అరెస్టు ‌చేసి ‌రిమాండ్ కు తరలించారు.. కేసులు నమోదయిన తర్వాత జులకంటి అజ్ఞాతం లోకి‌ వెళ్ళారు. 24 మంది ముందస్తు బెయిల్‌ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఒక్కరికి మినహా 23 మందికి షరతులతో కూడిన ముందస్తు  బెయిల్‌ మంజూరు చేసింది న్యాయస్థానం. బెయిల్‌ పొందిన 23 మంది ప్రతి ఆదివారం మాచర్ల పోలీస్టేషన్ లో‌‌ సంతకాలు  చేయాలి. అయితే సంతకాలు చేసేందుకు  మాచర్ల వెళ్ళే సందర్బంలో దాడులు జరుగుతాయని తగిన భద్రత‌‌ కల్పించాలని పల్నాడు జిల్లా ఇంచార్జ్ ‌జీవీ అంజనీలు ఎస్పీకీ లేఖ కూడా రాశారు.


మొదటి సారిగా న్యాయస్థానం నిబంధనలకు లోబడి జులకంటి మరో 22 మంది మాచర్ల పోలీస్టేషన్ కు బయలు  దేరారు. గుంటూరులోని  జులకంటి నివాసం నుంచి 23 మంది బస్సులో బయలు దేరారు. వీరికి పూర్తి భద్రత‌ ఇస్తున్నట్లు పల్నాడు ఎస్పీ ప్రకటించారు. మాచర్లలో‌ అదనపు పోలీసు‌ బలగాలతో భద్రత‌ ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాలలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. గస్తీని పెంచారు. గుంటూరు నుంచి పల్నాడు  జిల్లా లోకి టీడీపీ నాయకుల‌ బస్సు సత్తెనపల్లిలోకి ఎంటర్ అయిన వెంటనే  డీఎస్పీ బస్సులో‌ చేరుకొని వారికి రక్షణ కల్పించే బాద్యత‌ చేపట్టారు. జులకంటిని ఫాలో‌ అవుతున్న వాహన శ్రేణిని పరిశీలించారు. జులకంటి బ్రహ్మారెడ్డి వాహనాలతో పాటు పోలీసు ‌వాహనాలు మాచర్ల వరకు వారికి రక్షణ కల్పించేందుకు కదిలాయి. అయితే టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు శాంతి యుతంగా ఉండమని తెలిపామన్నారు జూలకంటి. నియోజకవర్గంలో గొడవలు లేకుండా శాంతి యుతంగా ఉండాలని తాము ‌కోరుకుంటున్నామని అయితే  వైసీపీ నాయకులు రెచ్చగొట్టి విధ్వంసాలకు దిగితే ప్రతి ఘటన తప్పదని జులకంటి బ్రహ్మారెడ్డి హెచ్చరించారు.