AP BJP Prajaporu : భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్‌లోనూ బలీయమైన శక్తిగా ఎదిగేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. దేశంలో బీజేపీకి తిరుగులేదని వస్తున్న విశ్లేషణలు,  దేశంలో బీజేపీ హైకమాండ్ ఇంకా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టని రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో నేతలు తమదైన ముద్ర వేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రెండు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రంలో  జాతీయ పార్టీ ఉనికి కష్టమే. కానీ బీజేపీ ఈ మైనస్‌ను సైతం ప్లస్‌గా చేసుకోవాలనుకుంటోంది.  ప్రభుత్వంపై పోరాటంతో ప్రజల్లోకి వెళ్తోంది. ప్రజాపోరు సభలతో దాదాపుగా రాష్ట్రంలో  ప్రతి కూడలిలో ఓ సభ నిర్వహించి తమ విధానాలను ప్రజల ముందు ఉంచబోతోంది. ఈ సారి సీనియర్ల మార్గదర్శకత్వంతో యువనాయకత్వమే ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూండటంతో బీజేపీలో భవిష్యత్ వ్యూహాలకు లభిస్తున్న ప్రాధాన్యంగా అంచనా వేసుకోవచ్చు 


నేటి నుంచి బీజేపీ ప్రజాపోరు సభలు !
 
ప్రజలను జాగృతం చేసి 2024 ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అధికారం రావడమే ఈ ప్రజా పోరు ప్రధాన లక్ష్యంగా బీజేపీ ఐదు వేల సభలను  నిర్వహిస్తోంది. సోమవారం రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విజయవాడలో లాంఛనంగా సభలను ప్రారంభిస్తారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో సునీల్ దేవధర్ , సత్యకుమార్ , జీవీఎల్ నరసింహారావు, విష్ణుకుమార్ రాజు, ఆదినారాయణ రెడ్డి, టీజీ వెంకటేష్, సుజనా చౌదరి వంటి నేతలు వీటిని ప్రారంభిస్తారు. 26 జిల్లాలో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సభలు ప్రారంభమవుతాయి. అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు నిరంతరంగా ప్రతిరోజు సభలు జరుగుతాయి.  కేంద్ర మంత్రులు జాతీయ నేతలు సైతం పలు చోట్ల పాల్గొననున్నారు. 


రాష్ట్ర ప్రజలకు దగ్గరయ్యేందుకు వినూత్న కార్యక్రమం !


రాజకీయ పార్టీలు ఒకటి రెండు సభలు పెట్టాలంటే కష్టం... అలాంటిది బీజేపీ ఐదు వేల సభలు పెట్టాలనుకోవడం సాహసమే. అయితే బహింగసభల్లా హంగూ ఆర్భాటలతో కాకుండా ... కీలకమైన ప్రాంతాల్లో సభలు పెట్టి.. అక్కడి ప్రజలు మాత్రమే వచ్చేలా చూసుకుని వారికి తమ పార్టీ విధి విధానాలు, డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల ప్రయోజనాలు, దేశాభివృద్ధికి కేంద్రం చేస్తున్న కృషి, నరేంద్రమోదీ నాయకత్వం గురించి వివరించడంతో పాటు ఏపీలో ప్రాంతీయ పార్టీల వల్ల జరుగుతున్న నష్టాన్ని.. ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న రాజ్యాంగ వ్యతిరేక పాలన గురించి వివరిస్తారు. ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తారు. బీజేపీ పై అనేక విషయాల్లో జరుగుతున్న వ్యతిరేక ప్రచారం ఉన్న రాజకీయాల్నీ ప్రజలకు తెలియ చెబుతారు. 


ఏపీ  బీజేపీకి ఆశలు రేపుతున్న యువ నాయకత్వం !


సీనియర్ల నాయకత్వంలో బీజేపీ ఇప్పటి వరకూ అనుకున్నంత స్థాయిలో బలపడలేదు. ఇంకా చెప్పాలంటే కొన్ని కారణాలతో బలహీనపడింది. అందుకే ఈ సారి జాతీయ నాయకత్వం మరింత కొత్తగా ఆలోచించింది .యువ నాయకత్వాన్ని తెరపైకి తెస్తోంది. అందులో భాగంగా ఇటీవల యువ నాయకులే ఎక్కువగా పార్టీ కార్యక్రమాలు లీడ్ తీసుకుంటున్నారు. ఉద్యోగాల భర్తీ డిమాండ్‌తో నిర్వహించిన సంఘర్షణ యాత్రతో పాటు ప్రస్తుతం ప్రజాపోరు సభల బాధ్యతను ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డికి అప్పగించారు. నిరంతరం పార్టీ కోసం శ్రమించే విష్ణువర్ధన్ రెడ్డి ఈ విషయంలో మరింతగా తన నాయకత్వ పటిమను చూపిస్తున్నారు. సభలను సక్సెస్ చేయడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. 


బీజేపీ పుంజుకోవడం కష్టమే కానీ అసాధ్యం కాదు !


రాజకీయాల్లో ఏదీ అసాధ్యం కాదు. ఏదైా సాధ్యమే. అయితే వ్యూహాం లేకుండా ఏదీ రాదు. ఇంత కాలం  ఏపీ బీజేపీ విషయంలో  జాతీయ నాయకత్వం చూసిన తీరు వేరు.. ఇప్పుడు చూస్తున్న తీరు వేరు. అందుకే బీజేపీకి ఇప్పుడు పుంజకోవడానికి మంచి అవకాశం ఉంది. యువనాయకత్వం ఫుల్ ఫోర్స్‌గా పని చేస్తోంది. అందుకే ఏపీ  బీజేపీ.. ఇప్పుడు ఆశలు పెంచుకుంటోంది. ఎంత కష్టపడినా ఏముందిలే అని నిరాశలో ఉండే క్యాడర్ ఉండే.. పూర్తి స్థాయిలో యాక్టివేట్ అవుతుంది. ఈ ఊపును కొనసాగించగలిగితే.... బీజేపీకి ఏపీలోనూ తెలంగాణ తరహాలో మంచి రోజులు రావొచ్చు.