గత కొంతకాలం నుంచి తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేస్తున్నారు. బీఆర్ఎస్ అని జాతీయ పార్టీ స్థాపించి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతారని గులాబీ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు సీఎం కేసీఆర్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ఇటీవల వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ జాతీయ పార్టీని బీజేపీ వ్యతిరేకిస్తుండగా.. పలు రాష్ట్రాల్లో మద్దతు కోసం ఆయన పర్యటనలు చేస్తున్నారు. తాజాగా కేసీఆర్‌కు సీపీఎం పార్టీ నుంచి మద్దతు లభించింది. కేసీఆర్‌కు జాతీయ పార్టీ పెట్టుకొనే హక్కు ఉన్నదని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చెప్పారు. కేసీఆర్‌ జాతీయ పార్టీ ఏర్పాటుకు తాము ఎందుకు మద్దతు తెలుపుతున్నారో సైతం వెల్లడించారు.


ప్రగతిశీల, లౌకిక, ప్రజాస్వామ్య పార్టీలతో కలిసి పనిచేస్తాం..
హైదరాబాద్‌లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ మతోన్మాద, అరాచక పాలనకు వ్యతిరేకంగా పోరాడే ప్రగతిశీల, లౌకిక, ప్రజాస్వామ్య పార్టీలతో కలిసి పనిచేయడానికి తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. ఈడీతో భయపెట్టి, బెదిరించి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూలదోస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) లేకుంటే దేశంలో బీజేపీనే లేదని ఎద్దేవా చేశారు. దేశంలో రాజ్యాంగ, ప్రజాస్వామ్య, లౌకికవాద, ప్రజాహక్కుల పరిరక్షణ కోసం బీజేపీని ఓడించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. .   


బీజేపీ ప్రభుత్వాలే కూలిపోయేవి..
కేంద్ర ప్రభుత్వం ఈడీని అడ్డు పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతోందని, అసలు ఈడీ లేకుంటే పలు రాష్ర్టాల్లో బీజేపీ ప్రభుత్వాలే కూలిపోతాయని సీతారాం ఏచూరి జోస్యం చెప్పారు. పలు రాష్ట్రాల్లో ఈడీ సోదాలు జరుగుతున్నాయని, అయితే  ఈడీ ఇంకా తమ దాకా రాలేదని, వచ్చినా ఆశ్చర్యపోయేదేమీ లేదన్నారు. 1948లో ఆరెస్సెస్‌ను నిషేధించిన అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ను బీజేపీ తమ మనిషిగా ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. కేంద్రంలోని బీజేపీతో పోరాడేందుకు కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టాలనుకోవడం సరైన నిర్ణయం అన్నారు. మతోన్మాద శక్తులతో పోరాడేందుకు అలాంటి నిర్ణయాలను తామెప్పుడూ స్వాగతిస్తామని చెప్పారు. 


తెలంగాణ సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తున్న బీజేపీ
బీజేపీ నేతలు తెలంగాణ సాయుధ పోరాటాన్ని హిందూ - ముస్లిం ఘర్షణగా వక్రీకరించి, ప్రజల్లో మతోన్మాద బీజాలు నాటేందుకు ప్రయత్నిస్తున్నారని సీతారాం ఏచూరి ఆగ్రహం ఆరోపించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో మూడు వేల గ్రామాలు, 16 వేల చదరపు కిలోమీటర్ల భూమి నిజాం సర్కారు నుంచి విముక్తి చెందాయనన్నారు. ఈ పోరాట ఫలితంగా పేదలకు 10 లక్షల ఎకరాల భూ పంపిణీ జరిగిందన్నారు.  కమ్యూనిస్టులు హైదరాబాద్‌ సంస్థానాన్ని ఆక్రమిస్తారనే భయంతో, నిజాం నవాబు లొంగిపోయారని చెప్పారు. 1950 మార్చి 27 నాటికి 4,482 మంది కమ్యూనిస్టులు జైళ్లలో ఉంటే, 57 మంది రజాకార్లు మాత్రమే జైళ్లలో ఉన్నారని తెలిపారు. మతోన్మాదాన్ని ప్రేరేపిస్తూ, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీనే తమ మొదటి శత్రువని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.