Nara Lokesh Padayatra: సంక్రాంతి తర్వాత నుంచి టీడీపీ యువ నేత నారా లోకేష్ పాదయాత్ర చేపట్టేందుకు సిద్ధం అవుతున్నారు. వచ్చే నెల రెండో తేదీ నుంచి గాంధీ జయంతి నాడు పాదయాత్ర ప్రారంభిస్తారని అందరూ భావించారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో అధినేత చంద్రబాబు కూడా పాదయాత్ర అదే రోజున ప్రారంభించి సుదీర్ఘంగా నిర్వహించారు. ఇందుకు కొనసాగింపుగా అదే రోజున యాత్ర చేపట్టాలని భావించినా.. ఇప్పుడు ఆ నిర్ణయం మారింది. ఇందుకోసం ముహూర్తాన్ని కూడా ఖరారు చేశారు. చిత్తూరు జిల్లా నుంచి ఇచ్చాపురం వరకు 450 రోజుల పాటు సుదీర్ఘంగా సాగనున్నట్లు సమాచారం. 


ముందస్తు ఎన్నికలు ఉండవని.. షెడ్యూల్ ముందుకు జరిపారు..!


కొద్ది నెలల క్రితం సీఎం జగన్ ముందుస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని టీడీపీ ముఖ్య నేతలు అంచనా వేశారు. ఈ క్రమంలోనే అందుకు అనుగుణంగా కార్యాచరణపై కసరత్తు చేశారు. అయితే సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం కనిపించకపోవడంతో... షెడ్యూల్ సంక్రాంతి తర్వాతకు మార్చినట్లు తెలుస్తోంది. జనవరిలో పాదయాత్రను ప్రారంభించి ఎన్నికల ప్రచారంతో నారా లోకేష్ భావిస్తున్నారు. దీంతో.. సుదీర్ఘ పాదయాత్రకు నిర్ణయం చేశారు. మొత్తం 450 రోజులపాటుగా చిత్తూరు టు శ్రీకాకుళం వరకు ఈ పాదయాత్ర సాగేలా రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. ఇందు కోసం 2023 జనవరిలో ప్రారంభించి.. 2024 మార్చిలో ముగించేలా ఆలోచన చేస్తున్నారు. ఇందు కోసం తన తండ్రి నియోజకవర్గం కుప్పం నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 


కుప్పం టు ఇచ్ఛాపురం.. 


జనవరి 26వ తేదీ పాదయాత్ర ప్రారంభించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. కుప్పం టు శ్రీకాకుళం వరకు పాదయాత్ర సాగేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పాదయాత్రలో భాగంగా టీడీపీ గురి పెట్టిన ప్రధాన నియోజకవర్గాల్లో ఎక్కువ సమయం ఉంటూ.. పరిస్థితులపై అధ్యయనం, మార్పులు, సూచనలకు వీలుగా షెడ్యూల్ ఖరారు చేస్తున్నారు. చంద్రబాబు పార్లమెంటరీ జిల్లాల పర్యటన ప్రారంభించినా.. మధ్యలో విరామం ఇచ్చారు. లోకేష్ పాదయాత్ర చేస్తూ... వచ్చే ఎన్నికలే టార్గెట్ గా ప్రభుత్వ వ్యతిరేకత పైన ప్రచారం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇదే సమయంలో గతంలో ప్రస్తుతం సీఎం జగన్ చేసిన పాదయాత్రల రికార్డులపైన గురి పెట్టినట్లుగా తెలుస్తోంది. జగన్ ప్రతిపక్ష హోదాలో నాడు 13 జిల్లాల్లో పాదయాత్ర చేశారు. మొత్తం 134 నియోజకవర్గాల్లో 341 రోజుల పాటు 3, 648 కిలో మీటర్ల మేర పాదయాత్ర రికార్డు క్రియేట్ చేశారు. ఇడుపుల పాయలో వైఎస్సార్ ఘాట్ నుంచి ప్రారంభించి 2019 ఎన్నికలకు ముందు ఇచ్ఛాపురంలో ముగించారు. 


కొద్ది రోజుల విశ్రాంతి తర్వాత ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. ఇప్పుడు లోకేష్ తన పాదయాత్రలో 450 రోజుల పాటు.. వారంలో ఏడు రోజులు కొనసాగేలా సాధ్యమైన మేర దాదాపు అన్ని నియోజకవర్గాలను టచ్ చేసేలా కార్యాచరణ సిద్ధం అవుతోంది. 2024 ఫిబ్రవరి చివర లేదా మార్చి తొలి వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉందని టీడీపీ అంచనా వేస్తోంది. క్షేత్ర స్థాయితో పార్టీ పరిస్థితులను అంచనా వేయడంతో పాటు.. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకునే ఏర్పాటు చేస్తున్నారు.