Internal Differences in AP BJP Leaders: ఏపీ భారతీయ జనతాపార్టీలో అంతర్గత కుమ్ములాటలు మరోసారి తెరపైకి వచ్చాయి.. గతంలో నెల్లూరు సమావేశం కేంద్రంగా బట్టబయలైన విభేదాలు చల్లార్చిన పార్టీ పెద్దలు త్వరలోనే రాజమండ్రిలో జరిగే సమావేశంలో పరిశీలిస్తాం.. అని ఆనాడు చక్కబెట్టగా ఆరోజూ రాగానే పలువురు అసంతృప్తితో రగిలిపోతున్న నాయకులు రాజమండ్రికి రెక్కలు కట్టుకుని వాలిపోయారు. కేంద్రమంత్రి, ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ మురళీధరన్ కు ఫిర్యాదులు వెల్లువెత్తినట్లు తెలుస్తోంది. అయితే ఈ సమావేశం ముగిశాక మాత్రం ఆయన ఏ మాట మాట్లాడకుండా వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే కేంద్రమంత్రి, ఏపీ వ్యవహారాల ఇంచార్జ్ రాజమండ్రి వస్తే ఆ సమయంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రం కడప పర్యటనలో ఉండిపోయారు.
ఏపీ అధ్యక్షుడు వీర్రాజుపై పెరుగుతోన్న వ్యతిరేక స్వరం
AP BJP President Somu Veerraju: ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై రోజు రోజుకూ వ్యతిరేక వర్గం స్వరం పెంచుకుంటూ వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే పార్టీ ముఖ్యనేత కన్నా లక్ష్మీనారాయణ పార్టీని వీడి తెలుగుదేశంలో చేరారు. ఇదిలా ఉంటే కన్నా వెన్నంటి ఉన్న పార్టీలోని నాయకులు తమ స్వరాన్ని బాగా పెంచుతున్నారు. పార్టీ సీనియర్ నాయకుడు దారా సాంబయ్య పార్టీలో దళితులకు, మైనార్టీలకు ఏ మాత్రం ప్రాముఖ్యం ఇవ్వడం లేదని ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లా నూతన కమిటీ నియామకంతో అసంతృప్తి జ్వాలలు మరింత పెరిగాయి. ఇక్కడ ఏకపక్ష ధోరణిలో పదవులు జరిగాయని, ఈ నేపథ్యంలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అడబాల రామకృష్ణారావు తన పదవికి రాజినామా చేశారు. ఇదిలా ఉంటే ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే కాక అటు కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ప్రస్తుతం బీజేపీ నాయకత్వం రెండు వర్గాలుగా చీలి అంతర్గత పోరు తారాస్థాయికి చేరిందన్న మాటలు వినిపిస్తున్నాయి.
కొన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ..
రాజమండ్రిలో పార్టీ సమావేశం నిర్వహించిన ఏపీ వ్యవహారాల ఇంచార్జి మురళీధరన్‌కు అనేక ఫిర్యాదులు పార్టీ శ్రేణుల నుంచి వెల్లువెత్తినట్లు తెలుస్తోంది. ఇతర జిల్లాల నుంచి కూడా రాజమండ్రికి పలువురు నేతలు వచ్చి రాష్ట్ర నాయకత్వంపై అనేక ఆరోపణలు చేస్తూ ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. ఇదంతా ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపైనే అనేక ఆరోపణలు చేస్తూ వచ్చిన ఫిర్యాదులు అని తెలుస్తోంది. అయితే వీర్రాజుకు మద్దతుగా మరికొంత మంది నాయకులు వచ్చి మురళీధరన్‌కు పలు ఆర్జీలు సమర్పించారు.
కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి..
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక కార్యక్రమాలను కూడా ప్రజలకు వివరించాలని కేంద్ర విదేశాంగ, పార్లమెంటరీ వ్యవహారాలశాఖ సహాయ మంత్రి మురళీధరన్ సూచించారు. జిల్లా కోర్ కమిటీ, పదాధికారులు, అసెంబ్లీ కన్వీనర్లు, తదితర విభాగాల నాయకులతో సమావేశం నిర్వహించిన ఆయన పార్టీని గ్రామాల్లోని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేసేందుకు కృషి చేయాలని సూచించారు.