అన్ని రంగాల్లో వెనుకబడిన అదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటామని టీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వంలో మంచిర్యాల మొదటి స్థానంలో ఉందని ఆయన తెలిపారు.  మంచిర్యాల జిల్లాను రాష్ట్రమంతా ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఇక్కడ కాంగ్రెస్ కు 60 నుండి 70 లక్షల సభ్యత్వం చేయవచ్చన్నారు. దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభను ఇంద్రవెళ్లిలో విజవంతంగా నిర్వహించామని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. తెలంగాణలో  కేసీఆర్ నిర్భంధ కాండకు కొనసాగిస్తున్నారని ఆరోపించారు. హుజురాబాద్ ఎన్నికలు ఇద్దరు వ్యక్తుల పంపకాల తేడాతో వచ్చిన ఎన్నికలు అని ఆరోపించారు. 


డబుల్ బెడ్ రూమ్, నిరుద్యోగ భృతి ఎక్కడ..?


హుజురాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి కొంత నష్టం జరిగిన మాట వాస్తవమేనని రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజారిటీ వస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ అవినీతి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. 2018లో అక్రమంగా సంపాదించిన డబ్బుతో అధికారంలోకి వచ్చారని విమర్శించారు. కేసీఆర్ తనపై నమ్మకం లేక రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ ను తెచ్చుకున్నారన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ మాటలు నమ్మడం లేదని పీకేను తెచ్చుకున్నారని ఆరోపించారు. రైతు రుణమాఫీ, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, నిరుద్యోగ భృతి, బీడీ కార్మికులకు పెన్షన్, జర్నలిస్టులకు ఇండ్లు,  ఆరోగ్య భద్రత కార్డులను ఇస్తామని మోసం చేశారని విమర్శించారు. ప్రభుత్వంపై నమ్మకంలేక నిరుద్యోగి సాగర్ రైల్ కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడని రేవంత్ రెడ్డి అన్నారు.  



నాగోబా ఆలయాన్ని సందర్శించిన రేవంత్ రెడ్డి


ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్ నాగోబా ఆలయాన్ని శనివారం అర్ధరాత్రి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క సందర్శించి పూజలు చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచం గర్వించదగ్గ విధంగా ఉంటాయన్నారు.  ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సభను విజయవంతం చేసిన గిరిజనులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆదివాసీలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.


Also Read: నిరుద్యోగులవి ఆత్మహత్యలు కాదు.. ప్రభుత్వ హత్యలే, సీఎం కేసీఆర్‌పై కేసు నమోదు చేయాలి: బండి సంజయ్