మణిపుర్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతోన్న వేళ తమ అభ్యర్థుల జాబితాను భారతీయ జనతా పార్టీ విడుదల చేసింది. మొత్తం 60 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. సీఎం బిరేన్ సింగ్.. హెయిన్‌గాంగ్ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు.






2017 ఎన్నికల్లో 21 సీట్లు సాధించిన భాజపా స్థానిక పార్టీలైన ఎన్‌పీపీ, ఎన్‌పీఎఫ్ సాయంతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే కాంగ్రెస్ 28 సీట్లతో సింగిల్‌ లార్జెస్ట్ పార్టీగా అవతరించినప్పటికీ అధికారానికి దూరమైంది. 


60 అసెంబ్లీ స్థానాలున్న మణిపుర్‌కు రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 27, మార్చి 3న పోలింగ్ జరగనుంది. మార్చి 10 ఓట్ల  లెక్కింపు, ఫలితాలు వెలువడతాయి. 


ఒపీనియన్ పోల్స్‌లో..


ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఏబీపీ-సీఓటర్ ఇటీవల సర్వే చేసింది. తాజా ఒపీనియన్ పోల్స్ ప్రకారం మణిపుర్‌లో కాంగ్రెస్-భాజపా మధ్య తీవ్ర పోటీ నెలకొనే అవకాశం ఉందని తేలింది.


మణిపుర్‌లో కాషాయ పార్టీ కాంగ్రెస్ మధ్య తీవ్రమైన పోటీ ఉండనుంది.  ఈ ఎన్నికల్లో హంగ్ వచ్చే అవకాశమే ఎక్కువ కనిపిస్తోంది. ఏబీపీ-సీఓటర్ సర్వే ప్రకారం భాజపా 23-27 స్థానాల్లో గెలిచే అవకాశం ఉండగా కాంగ్రెస్ 22-26 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. నాగా ఎథినిక్ పార్టీ ఎన్‌పీఎఫ్ 2-6 స్థానాలు గెలుపొందే అవకాశం ఉంది.


ఇదే సవాల్..


ఈశాన్య రాష్ట్రాల్లో ప్రధాన సమస్యగా ఉన్న సైన్యానికి ప్రత్యేక అధికారాల చట్టం..  మణిపుర్‌‌ రాజకీయాల్లో ఎప్పటినుంచో కీలకపాత్ర పోషిస్తోంది. నాగాలాండ్‌లో ఇటీవల ఆర్మీ.. ఉగ్రవాదులుగా పొరపడి సాధారణ పౌరులను కాల్చిచంపిన ఘటన మణిపుర్‌ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.


 

నాగాలాండ్‌లో భద్రతా బలగాల చేతిలో ఎటువంటి కారణం లేకుండా 14 మంది నాగా పౌరులు మరణించిన తర్వాత ఈశాన్య ప్రాంతంలో పరిస్థితి మారిపోయింది. భారత సైన్యంతో పాటు కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ప్రత్యేక బలగాల  చట్టాన్ని ఉపసంహరించుకోవాలని ఈశాన్య రాష్ట్రాలన్నీ ఏకగ్రీవంగా డిమాండ్ చేస్తున్నాయి. నిజానికి ఇది ఎంత పెద్ద సమస్యగా మారిందంటే మణిపుర్‌ కూడా దాని ప్రభావానికి భిన్నంగా ఏమీ లేదు. 


Also Read: Covid Update: దేశంలో తగ్గిన కరోనా కేసులు.. పెరిగిన మరణాలు.. ఒక్కరోజులో 893 మంది మృతి


Also Read: Canada PM Justin: అజ్ఞాతంలోకి ఆ దేశ ప్రధాని.. వ్యాక్సిన్ వ్యతిరేక ఆందోళనలతో కెనడా ఉక్కిరిబిక్కిరి