పంజాబ్ రాజకీయాలు కాక మీద ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ హాట్ ఫేవరేట్లలో ఒకరైన మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఇప్పుడు కుటుంబ వివాదంలో ఇరుక్కున్నారు. ఆయన సోదరి సుమన్ టుర్ అమెరికా నుంచి ఆన్‌లైన్ ప్రెస్‌మీట్ పెట్టి తీవ్ర ఆరోపణలు చేశారు. సిద్ధూ డబ్బుకోసం అమ్మనే వదిలేశాడు.. ఆమె అనాథలా చనిపోయిందని ఆమె కన్నీరు పెట్టుకున్నారు. సిద్ధూ డబ్బు మనిషిఅని.. డబ్బుల కోసమే తమతో సంబంధాలు తెంచుకున్నారని ఆమె ఆరోపించారు.
తమ తల్లి నాలుగు నెలల పాటు ఆసుపత్రిలో ఉందని కానీ సిద్ధూ అసలు పట్టించుకోలేదన్నారు. ఇది అసత్య ఆరోపణలు కావు.. సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయని కొన్ని పత్రాలను మీడియా సమావేశంలో ప్రదర్శించారు. కేవలం ఆస్తుల కోసం తమతో సంబంధాలను తెంచుకున్న క్రూరమైన వ్యక్తిగా సిద్ధూ అని ఆమె సుమన్ టుర్ మండిపడ్డారు. అయితే ఆ ఘటన జరిగింది ఇప్పుడు కాదని 1989లోనని తెలిపారు. తమ తండ్రి చనిపోయిన తర్వాత.. తల్లిని దిక్కులేని స్థితిలో వదిలేశారని.. 1989లో ఒక అనాథ మహిళగా ఢిల్లీ రైల్వేస్టేషన్లో చనిపోయిందన్నారు.
ఇటీవల తాను ఇండియా కు వచ్చి సిద్ధూను కలిసేందుకు ఇంటికి వెళ్లానని కనీసం తలుపులు కూడా తీయలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం 70 ఏళ్ల వయసున్న తనను సిద్ధూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. నిపోయిన నా తల్లికి న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నానని సుమన్ టుర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సిద్ధూ సోదరి చేసిన ఆరోపణలు పంజాబ్ కాంగ్రెస్‌లో హీట్‌ను పుట్టిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఆరోపణలతో పెద్ద రాజకీయ దుమారం చెలరేగుతోంది.
ఈ ఆరోపణలపై నవజ్యోతిసింగ్ సిద్ధూ ఇంత వరకూ స్పందించలేదు. అయితే గతంలో ఆయన తన తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారని మీడియా సంస్థలకు చెప్పారు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నందున తనను దెబ్బతీయడానికి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన భావిస్తున్నారు.