దిల్లీలోని కేసీ కరియప్ప మైదానంలో నిర్వహించిన నేషనల్ క్యాడెట్ కార్ప్స్(ఎన్‌సీసీ) ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎన్‌సీసీని బలోపేతం చేయడం వల్ల గత రెండేళ్లలో లక్షకు పైగా కొత్త జవాన్లు సరిహద్దుల్లో రక్షణగా నిలిచారన్నారు.
మన దేశ ఆడబిడ్డలు ఎంతోమంది ఇప్పుడు సైనిక పాఠశాలలో చేరుతున్నారు. ఆర్మీలో మహిళలకు మరింత బాధ్యతలు అప్పగిస్తున్నాం. వాయుసేనలో చేరిన ఎంతో మంది మహిళలు నేడు పైలెట్లుగా యుద్ధ విమానాలను నడుపుతున్నారు. ఇది దేశంలో ప్రస్తుతం మనం చూస్తోన్న మార్పు. రానున్న రోజుల్లో మరింత మంది విద్యార్థినులు ఎన్‌సీసీలో చేరేలా మనం చూడాలి. యువత దృఢ సంకల్పం, మద్దతుతో దేశ భవిష్యత్తునే మార్చగలం. కానీ మాదక ద్రవ్యాలు ఎంతోమంది యువత జీవితాలను నాశనం చేస్తున్నాయి. దానిపైన కూడా మనం పోరాడాలి. - ప్రధాని నరేంద్ర మోదీ
నయా లుక్..
అంతకుముందు మోదీ.. ఎన్‌సీసీ క్యాడెట్ల గౌరవవందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మోదీ ధరించిన కళ్లజోడు, తలపాగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పంజాబ్ ఎన్నికలు దగ్గర పడటం వల్లే సిక్కుల తలపాగాను మోదీ ధరించినట్లు తెలుస్తోంది.
73వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని డ్రెస్సింగ్ స్టైల్ కొత్తగా ఉంది. ఎన్నికల ప్రచారసభల్లో కాకుండా గణతంత్ర దినోత్సవం లాంటి వేడుకల్లో మాత్రం తలపాగా, సంప్రదాయ వస్త్రధారణతో కనిపించేవారు. ఈ గణతంత్ర వేడుకల్లో మాత్రం తలపాగా పెట్టుకోలేదు. బ్రహ్మకమలం చిత్రంతో ఉన్న ఉత్తరాఖండ్ సంప్రదాయ టోపీని ధరించారు. మెడలో వేసుకునే కండువా కూడా మార్చారు. మణిపూర్ సంప్రదాయానికి సంబంధించిన కండువాను ఆయన ధరించారు.
టోపీ ఉత్తరాఖండ్ సంప్రదాయానికి చిహ్నం. ఆ టోపీపై బ్రహ్మకమలం గుర్తు ఉంది. అది ఉత్తరాఖండ్ రాష్ట్ర పుష్పం. కండువా మణిపూర్ సంస్కృతిని ప్రతిబింబిస్తోంది. ఈ కండువా చేతితో నేసినది. ఇది మణిపూర్‌లోని మేటీ తెగ వినియోగించే ప్రత్యేక వస్త్రం.