రోమ్ వెళ్తే రోమన్‌లా ఉండాలన్నది సామెత. అలా ఉండటం అంటే..కట్టూ బొట్టు అలా ఉంటే లోకలైజ్ అయిపోవచ్చన్నమాట. దీన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ పక్కాగా పాటిస్తారు. ఆయన ఎక్కడికి వెళ్లినా డ్రెస్సింగ్ స్టైల్‌లో వచ్చే మార్పును బట్టి దాన్ని డిసైడ్ చేయవచ్చు. ప్రతి సందర్భంలోనూ ఆయన డ్రెస్ చేసుకునే తీరుతో  సందేశం కూడా ఉంటుంది. ఉదాహరణకు రిపబ్లిక్ డే రోజు ఆయన డ్రెస్టింగ్ స్టైల్ చూస్తే తేడా స్పష్టంగా కనిపిస్తుంది.


73వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్రమోడీ డ్రెస్సింగ్ స్టైల్ కొత్తగా ఉంది. ఎన్నికల ప్రచారసభల్లో కాకుండా గణతంత్ర దినోత్సవం లాంటి వేడుకల్లో మాత్రం త‌ల‌పాగా, సంప్రదాయ వ‌స్త్రధార‌ణ‌తో కనిపించేవారు.   ఈ గ‌ణ‌తంత్ర వేడుక‌ల్లో మాత్రం త‌ల‌పాగా పెట్టుకోలేదు.  బ్రహ్మక‌మ‌లం చిత్రంతో ఉన్న ఉత్తరాఖండ్ సంప్రదాయ‌ టోపీని ధ‌రించారు.  మెడ‌లో వేసుకునే కండువా కూడా మార్చారు.  మ‌ణిపూర్ సంప్రదాయానికి సంబంధించిన కండువాను ఆయ‌న ధ‌రించారు.  టోపీ ఉత్తరాఖండ్‌ సంప్రదాయానికి చిహ్నం. ఆ టోపీపై బ్రహ్మకమలం గుర్తు ఉంది. అది ఉత్తరాఖండ్ రాష్ట్ర పుష్పం.  కండువా మణిపూర్ సంస్కృతిని ప్రతిబింబిస్తోంది.  ఈ కండువా చేతితో నేసినది. ఇది మణిపూర్‌లోని మేటీ తెగ వినియోగించే ప్రత్యేక వస్త్రం. 


కొద్దిరోజుల్లో  జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరాఖండ్‌, మణిపూర్ రాష్ట్రాలు కూడా ఉన్నాయి.  ఈ సమయంలో ఆ రాష్ట్రాల సంస్కృతికి తగినట్టుగా మోడీ వస్త్రధారణ ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ఇలాంటి సందర్భానుసార డ్రెస్సింగ్ ప్రధాని మోడీకి ఇదే మొదటి సారి కాదు. పలు సందర్భాల్లో ఆయన ఈ తరహా డ్రెస్సింగ్‌ చేసుకుంటూ ఉంటారు. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలప్రజల్ని ఆకట్టుకోవడానికి ఇలా చేస్తారని వచ్చే విమర్శల్ని మోడీ పట్టించుకోరు.


గత ఏడాది మార్చిలో టీకా వేయించుకుంటున్న సమయంలోనూ మోడీ ఇలాంటి ఎలక్షన్ మ్యాచింగ్ సెన్స్ పాటించారన్న విమర్శలు వచ్చాయి.  ప్రధాని మోడీకి మొదటి డోస్ టీకా ఇచ్చిన నర్సును ఆమె సహాయకురాలిని ఎన్నికలు జరుగుతున్న పుదుచ్చేరి, తమిళనాడు రాష్ట్రాల నుంచి ఎంపిక చేశారు. మరో అసిస్టెంట్‌గా కేరళ నర్సును ఎంపిక చేశారు. అదే సమయంలో  మెడలో ప్రధాని మోడీ అసోంకు చెందిన సంప్రదాయ కండువా వేసుకున్నారు. దీంతో అప్పట్లో ఎన్నికలు జరుగుతున్న అన్ని రాష్ట్రాలకు మోడీ న్యాయం చేశారన్న సెటైర్లు వినిపించాయి. ఇప్పుడు కూడా రిపబ్లిక్ డే వేడుకల్లో అన్ని రాష్ట్రాలకు కాకపోయినా మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ప్రజల్ని ఆకట్టుకోగలిగారు.