Kodali Nani :   వైఎస్ఆర్‌సీపీ అధినేత, సీఎం జగన్ నిర్వహించిన గడప గడపకూ మన ప్రభుత్వం వర్క్ షాప్ సమావేశానికి అందరూ హాజరయ్యారు. కానీ ఇద్దరు మాత్రం హాజరు కాలేదు. వారు కొడాలి నాని, వల్లభనేని వంశీమోహన్. వల్లభనేని వంశీ కొంత కాలంగా ఆరోగ్య సమస్యల కారణంగా బయటకు రావడం లేదు. గన్నవరం నియోజకవర్గంలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్నీ నిర్వహించడం లేదు. మాజీ మంత్రి కొడాలి నాని ఎలాంటి సమావేశాలనూ మిస్ కారు. ఆయన హఠాత్తుగా డుమ్మా కొట్టడం వైసీపీ వర్గాలను ఆశ్చర్యరపరుస్తోంది. ఎన్టీఆర్ వైద్య విశ్వ విద్యాలయానికి ... ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్ఆర్ పేరు పెట్టడం కొడాలి నానికి నచ్చలేదని అందుకే హాజరు కాలేేదమోనని కొంత మంది నేతలు అభిప్రాయం  వ్యక్తం చేస్తున్నారు .


పేరు మార్పుపై పునరాలోచించాలని వంశీ సోషల్ మీడియా స్పందన 


ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరు మార్పుపై వల్లభనేని వంశీ మోహన్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. అసెంబ్లీలో బిల్లు పెట్టిన రోజునే.. ఆయన ట్విట్టర్ ద్వారాతన స్పందన తెలియచేశారు. నిర్ణయాన్ని మళ్లీ పరిశీలించాలన్నారు. అయితే ఆయన అభిప్రాయం వ్యక్తం చేసిన ట్విట్టర్ అకౌంట్ ఆయనదో కాదో అనుమానం కూడా ఉంది. దీనిపై ఆయన నేరుగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఇక కొడాలి నాని అప్పట్నుంచి మీడియా ముందుకు రాలేదు. సైలెంట్‌గానే ఉన్నారు. తాజాగా ఆయన జగన్ మీటింగ్‌కు గైర్హజర్ అయ్యారు. కొడాలి నాని ఎమ్మెల్యేగా మాత్రమే కాకుండా... ప్రాంతీయ సమన్వయకర్తగా కూడా ఉన్నారు. తన పరిధిలోని ఎమ్మెల్యేలు అంతా గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో నిర్వహించేలా చూసుకోవాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. 


కొడాలి నాని కూడా  అదే విషయంలో అసంతృప్తితో ఉన్నారా /


ఎన్టీఆర్ వర్శిటీ పేరు మార్పు అంశంపై కొడాలి నాని అసంతృప్తిగా ఉన్నారని.. సీఎం  జగన్ తీసుకుంటున్న నిర్ణయాలతో తాము ఇబ్బందులు పడుతున్నామని ఆయన సన్నిహితుల దగ్గర వ్యాఖ్యానించినట్లుగా ఇప్పటికే  రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుదోంది. అయితే  కొడాలి నాని వైఎస్ఆర్‌సీపీపై కానీ.. జగన్‌పై కానీ అసంతృప్తి వ్యక్తం చేయలేరని.. ఒక వేళ అలాంటి పరిస్థితి  వచ్చినా ఆయన సర్దుకుపోతారని వైఎస్ఆర్సీపీ వర్గాలు గట్టిగా  చెబుతున్నాయి. ఆయన ఇతర పార్టీల నేతలను క్షమించరానంతగా అసభ్యంగా దూషించారని గుర్తు చేస్తున్నారు. అందుకే నిజంగా అసంతృప్తికి గురైతే.. అసంతృప్తి తగ్గే  వరకూ  దూరంగా ఉంటారని.. మళ్లీ పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ అవుతారని అంటున్నారు. 


కొడాలి అసంతృప్తికి ఏమీ ఉండదని అంటున్న వైఎస్ఆర్‌సీపీ వర్గాలు


కొడాలి నాని .. సీఎం జగన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా సమర్థిస్తూ వస్తున్నారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారని ఎవరూ అనుకోవడం లేదు. చివరికి లక్ష్మిపార్వతి  కూడా సమర్థించినందున.. కొడాలి కూడా వ్యతిరేకించరని.. అంటున్నారు. ప్రజల్లో బావోద్వేగాలు కొంచెం తగ్గే వరకూ ఆయన మౌనంగా ఉండి.. ఆ తర్వాత మళ్లీ యాక్టివ్ అవుతానరి భావిస్తున్నారు. అయితే.. ఈ విషయంలో ఆయనకు మరో చాయిస్ లేదన్న వాదన మాత్రం బలగా వినిపిస్తోంది.