3 Years of YSR Congress Party Rule :  ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించారు. ప్రతి రెండు వేల మందికి ఓ గ్రామ, వార్డు సచివాలయం ఉంటుంది. ఆ పరిధిలో ప్రజలకు అన్ని రకాల సేవలు చేస్తుంది. అధికారాలన్నీ ఆ గ్రామ సచివాలయ సిబ్బందికి ఉంటాయి. మరి పంచాయతీలు ఏం చేస్తాయి ?. ఈ ప్రశ్న మొదటి నుంచీ వస్తోంది. చివరికి కోర్టుకు కూడా ఇదే సందేహం వచ్చింది. కానీ సమాధానం మాత్రం దొరకలేదు. సీఎం జగన్ పాలన మూడేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సచివాలయ వ్యవస్థ.. పంచాయతీలను నిర్వీర్యం చేయడం లేదని ప్రభుత్వం క్లారిటీ ఇస్తుందా ? 


పంచాయతీ అధికారాలు గ్రామ సచివాలయాలకు !
 
సచివాలయ వ్యవస్థ ఏర్పడిప్పుడే గ్రామ పంచాయతీలు నిర్వీర్యమైపోతాయన్న ఆందోళన గ్రామాల్లో కనిపించింది.   పంచాయతీరాజ్‌ వ్యవస్ధ అమల్లో ఉండగా.. పంచాయతీల్ని కాదని సచివాలయాల్ని ఏర్పాటు చేస్తూ జగన్ సర్కార్‌ తీసుకున్న నిర్ణయంపై నిపుణుల్లో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.  రాష్ట్రంలో సమాంతర వ్యవస్ధ ఏర్పాటు ఎందుకని అనేక మంది ప్రశ్నించారు. అయితే ప్రభుత్వం పథకాల అమలు కోసం సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేశామని ప్రకటించిం. కానీ  పంచాయతీలతోనే అమలు చేయించ వచ్చు కదా అని ప్రశ్నలు సహజంగానే వవచ్చాయి. 


జీవో నెంబర్ 2ను సస్పెండ్ చేసిన హైకోర్టు !



సర్పంచ్‌ల అధికారాల్ని వీఆర్వోలకు కట్టబెడుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీసుకోవడం కూడా వివాదాస్పదమయింది. సచివాలయాల ద్వారానే గ్రామాల్లో పాలన సాగుతోంది. అయితే ఇప్పటివరకు సచివాలయాల పర్యవేక్షణ బాధ్యత పంచాయితీరాజ్ పరిధిలో వుండగా ఇటీవల జీవో నెంబర్ 2 ద్వారా రెవెన్యూ శాఖకు బదలాయించారు. దీంతో వాలంటీర్లతో పాటు మిగతా సచివాలయ సిబ్బంది రెవెన్యూ వ్యవస్థలోకి బదలాయించడం ద్వారా సర్పంచ్ ల అధికారాలను కత్తిరించింది ప్రభుత్వం.  దీనిపై కోర్టుల్లో కేసులు పడ్డాయి. హైకోర్టు ఆ జీవోను సస్పెండ్ చేసింది. 
 


అధికారాలన్నీ గ్రామ సచివాలయానికే !


పంచాయతీరాజ్‌ వ్యవస్థలో గ్రామ పంచాయతీ పాలన సెక్రటరీ, ఈవోపీఆర్‌డీ, డీఎల్‌పీవో, డీపీవో స్థాయిల్లో ఉంటుంది. ప్రస్తుతం సంక్షేమ పథకాలు, ఇతర పౌర సేవలన్నీ సచివాలయానికి దఖలైపోయాయి. అభివృద్ధి పనులు మాత్రమే ఉంటాయి. దీనిపై గ్రామ స్థాయిలో సర్పంచ్‌ పాలకవర్గం అజమాయిషీ కూడా ఉంటుంది. ఇక వీరి బాధ్యతలు, అధికారాలు అంతంత మాత్రమే. సర్పంచ్‌కు కూడా సచివాలయం మీద పెత్తనం ఉండే అవకాశం లేదు. సర్పంచ్‌లూ నామమాత్రమేసర్పంచుల అధికారం కూడా నామమాత్రం అవుతుందనే ప్రచారం ఉంది. సంక్షేమ, పౌర సేవలకు కేంద్రంగా మారిన సచివాలయం మీద వారికి పెత్తనం లేదు. అది రెవెన్యూ పరిధిలో ఉండడంతో రిక్వెస్ట్‌ చేయగలరేకానీ పర్యవేక్షణ చేయలేరు. పైగా ప్రజలు నేరుగా వచ్చి దరఖాస్తు పెట్టుకుంటే సచివాలయం నుంచి ఏ పథకమైనా అమలవుతుంది. ఈ పరిస్థితుల్లో ప్రజలు కూడా సర్పంచులను పట్టించుకునే అవకాశం లేకుండా పోయింది. 


గ్రామ స్వరాజ్యం కోసమేనంటున్న ప్రభుత్వం !
 
గ్రామ, వార్డు సచివాలయాలు గ్రామ స్వరాజ్యంలో భాగమని ప్రభుత్వం చెబుతోంది. పాలనా సౌలభ్యం కోసం ఏర్పాటు చేసినవి మాత్రమేనని కోర్టు కొట్టి వేసిన జీవోను మళ్లీ లోపాలు దిద్దుకుని రిలీజ్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే గాంధీజీ చెప్పే గ్రామ స్వరాజ్యం పంచాయతీలకు పూర్తి స్థాయిలో అధికారాలు ఇచ్చినప్పుడే వస్తుందని ఇతరపార్టీలు గుర్తు చేస్తున్నాయి. రాష్ట్రానికి ప్రభుత్వ ఎలాగో.. గ్రామాలకు పంచాయతీలు అలాగే ప్రభుత్వమని .. ఏదైనా స్థానిక ప్రభుత్వాల ద్వారానే జరగాలి కానీ ఇలా ప్రత్యామ్నాయ వ్యవస్థ ఏర్పాటు చేయడం ఏమిటన్న వాదన ఎక్కువగా వినిపిస్తోంది. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం  తాము మహాత్ముడి అడుగుజాడల్లోనే గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేశామని ప్రకటిస్తోంది.