Bandi Sanjay Comments: బండి సంజయ్.. గల్లీ స్థాయి నుండి ఢిల్లీ స్థాయి వరకు బిజెపిలో ఎదిగిన నేత. మహామహులను కాదని ఢిల్లీ లోని బిజెపి అధిష్టానం ఏరికోరి ఎంపిక చేసుకున్న అధ్యక్షుడు. ఎక్కడ ఎలా ఫైర్ పుట్టించాలనేది బండికి తెలిసినంతగా దాదాపు ఆ పార్టీ రాష్ట్ర నాయకుల్లో ఎవరికీ తెలియదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాంటి బండి సంజయ్ కరీంనగర్ లో చేసిన హాట్ కామెంట్ల పై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈమధ్య కాశీ జ్ఞానవాపి మసీద్ అంశం దేశవ్యాప్తంగా చర్చకు రావడంతో బాటు అక్కడ మసీదులోని తటాకంలో శివలింగం ఉన్నాయనే వార్తలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని పరిస్థితులను కూడా ప్రతిబింబించాలనే ఉద్దేశంతో బండి సంజయ్ కామెంట్ చేసారని అందరూ విశ్లేషిస్తున్నారు.
అయితే ఇక్కడ మరో అంశం కూడా ముడిపడి ఉంది. రాజకీయంగా కరీంనగర్ చాలా ముఖ్యమైన పార్లమెంట్ స్థానం... వచ్చే ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే రెండు స్థానాలను కైవసం చేసుకోవడానికి బీజేపీ పావులు కదుపుతోంది. అయితే గతంలో బీజేపీ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిచిన దాఖలాలు ఎన్నడూ లేవు. ముఖ్యంగా మైనారిటీల ప్రాబల్యం ఉన్న కరీంనగర్ పట్టణంలో వారి ఓట్లు ఎక్కువగా బిజెపికి వ్యతిరేకంగా పడతాయి. ఈ అంశం బండి సంజయ్ కి తెలియనిది కాదు. కొద్దికాలంగా బండి సంజయ్ ఏదైనా అసెంబ్లీ స్థానం నుండి పోటీ పడతారని అందరూ గెస్ చేస్తూ వచ్చారు. ముఖ్యంగా వేములవాడ నియోజకవర్గం నుండి వచ్చే ఎన్నికల్లో బండి సంజయ్ పోటీ చేస్తారంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి .ప్రముఖ శైవక్షేత్రం కావడం, బండి సంజయ్ కు చెందిన కమ్యూనిటీ కి భారీ స్థాయిలో అక్కడ ఓట్ల సంఖ్య ఉండటం కలిసి వచ్చే అంశం అని అంచనాకు వచ్చారు.
కానీ ఇప్పటికే అక్కడ బీజేపీ టికెట్ కి పోటీ తీవ్రంగా ఉంది. మాజీ మహారాష్ట్ర గవర్నర్ సీనియర్ బిజెపి నేత అయిన విద్యాసాగర్రావు తనయుడు డాక్టర్ వికాస్ కి అక్కడ బిజెపి నుండి పోటీ చేయించే ప్రయత్నంలో ఉన్నారు ఆయన తండ్రి సాగర్. మొదట్లోనే ఆటంకం ఎదురయ్యే పరిస్థితులు ఉండడంతో బండి సంజయ్ మనసు మార్చుకున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా దక్షిణాదిన కూడా బిజెపి క్రమక్రమంగా బలపడుతూ ఉండడంతో వచ్చే ఎన్నికల తర్వాత మరోమారు కేంద్రంలో అధికారం చేపడుతుందని విశ్లేషకుల అంచనా. ఇలాంటి సమయంలో మరోసారి కరీంనగర్ నుండి ఎంపీగా ఎన్నికయితే కేంద్రంలో కనీసం సహాయమంత్రి వరకు వెళ్లే అవకాశాలు బండి సంజయ్ లాంటి ఫైర్ బ్రాండ్ నేతకు పుష్కలంగా ఉంటాయి. అందుకే మరోసారి ప్రజలకు చేరువ అయ్యే విధంగా వరుస కార్యక్రమాల్లో హాజరవుతూనే పలు అంశాలపై గట్టిగానే స్పందిస్తున్నారు బండి సంజయ్ .
ఇక కరీంనగర్ లోక్సభ స్థానం నుండి టిఆర్ఎస్ తరఫున పోటీ చేయడానికి గట్టి అభ్యర్థి అంటూ ప్రస్తుతానికి ఎవరూ లేరు .ఒకవేళ సీఎం కేసీఆర్ ఇక్కడ నుండి పోటీ చేస్తే మరింత రసవత్తరంగా మారే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. బిజెపి మరోమారు కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుండి గెలిచే విధంగా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ ప్రభావం ఇక్కడి 13 నియోజకవర్గాల్లో మాత్రమే కాకుండా పక్క జిల్లాల్లోనూ పక్కాగా ఉంటుంది. ఇక ఒక దెబ్బకు రెండు పిట్టలు ఉన్నట్టుగా ఇక్కడనుండి పంపిన మెసేజ్ రాష్ట్రవ్యాప్తంగా రచ్చ చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
వేములవాడ లాంటి హిందూ పుణ్యక్షేత్రం ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికీ దర్గాలు కొనసాగడం పట్ల పలు హిందూ సంఘాలు గతంలో అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఇక కరీంనగర్ పట్టణంలో మెయిన్ రోడ్డుకు ఆనుకుని దర్గా ఉండటం.. గతంలో స్మితా సబర్వాల్ కలెక్టర్గా ఉన్న సమయంలో దాన్ని తొలగించి రోడ్డు విస్తరణకు ప్లాన్ చేయగా జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇలాంటి అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని బండి సంజయ్ కరీంనగర్ సెంటర్ లో ఇలాంటి హాట్ కామెంట్ చేశారని ఒక అంచనాకు వేయవచ్చు. రానున్న రోజుల్లో మెజారిటీ వర్గం నుండి బలమైన మద్దతు దొరికితే ఎంపీగా గెలవడం పెద్ద సమస్య కాదు. అందుకే దీనికి పూర్తిస్థాయిలో ప్రిపేరవుతున్న సంజయ్ ఎన్నికల వేడిని ముందే రగిల్చారని అర్థం అవుతోంది.