3 Years of YSR Congress Party Rule :  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీల్లో అత్యంత కీలకమైనది మద్యనిషేదం.  దశలవారీగా మద్య నిషేధం చేస్తానని వచ్చే ఎన్నికల నాటికి స్టార్ హోటళ్లలో మాత్రమే మద్యం అమ్మేలా చేసి ఓట్లు అడుగుతామని ప్రకటించారు. మరి మూడేళ్లలో సీఎం జగన్ ఆ హామీ దిశగా పయనించారా? ఆ దిశగానే అడుగులు వేస్తున్నారా ? లేక మద్యనిషేధం అనే హామీని అమలు చేయలేమని చెప్పబోతున్నారా ?


దశలవారీ మద్య నిషేధంపై ఏపీ సర్కార్ ప్రణాళిక ! 


దశలవారీగా మద్య నిషేధం అమలు దిశగా రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా నిబంధనలు రూపొందించుకుంది. . వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్రంలో 4,380 మద్యం షాపులు ఉన్నాయి.  ఏటా ఇరవై శాతం దుకాణాలు తగ్గించాలని నిర్ణయించుకుంది. అందులో  భాగంగా తొలి విడతలో 880 షాపులు తగ్గించారు. దీంతో షాపుల సంఖ్య 4,380 నుంచి 3,500కు చేరింది. తర్వాత పలు కారణాలతో ఆ సంఖ్యను 2,934కు కుదించార. ఇప్పటి వరకూ  43 వేల బెల్టు షాపులు రద్దు చేశామని, 4,380 పర్మిట్‌ రూమ్‌లు రద్దు చేశామని, మొత్తం షాపుల్లో 33 శాతం  తగ్గించామని  ప్రభుత్వం చెబుతోంది.  విక్రయ వేళల తగ్గింపు , ధరల పెంపుతో అమ్మకాలు భారీగా తగ్గించామని ప్రకటించింది. 


మరోసారి దుకాణాలు తగ్గించేందుకు వెనుకడుగు !


వాస్తవానికి ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా మరో ఇరవై శాతం దుకాణాలు తగ్గించాల్సి ఉంది. కానీ తగ్గించలేదు.పైగా వాక్ ఇన్ స్టోర్లు ఏర్పాటు చేశారు. పర్యాటక ప్రాంతాల్లో మరిన్ని దుకాణఆలు ఏర్పాటు చేస్తున్నారు.  అయితే షాపులు తగ్గిస్తామని చెప్పి పెంచుతున్నారేమిటన్న అనుమానాలు ప్రజల్లో రాకుండా.. వాటిని పర్యాటక ప్రాంతాల్లో పెడుతున్నారు. దీంతో ప్రభుత్వ చిత్తశుద్ధిపై అనుమానాలు ప్రారంభమయ్యాయి. 


మద్యం ఆదాయంతో పథకాలకు నిధులు !


మద్యం ద్వారా వచ్చే ఆదాయంతోనే అమ్మఒడి పథకాన్ని అమలుచేస్తామని ప్రభుత్వం నేరుగా జీవో జారీ చేసింది. అమ్మఒడితోపాటు డ్వాక్రా మహిళల పాత రుణాల చెల్లింపుల కోసం పెట్టిన ఆసరా, మహిళల కోసం పెట్టిన మరో పథకం చేయూతను కూడా మద్యం ఆదాయంతోనే అమలుచేస్తామని వెల్లడించింది.   తొలుత ఎక్సైజ్‌కు సంక్షేమ పథకాల బాధ్యతను అప్పగించింది. ఆ తర్వాత మద్యం ఆదాయం ఎక్సైజ్‌ ద్వారా ప్రభుత్వానికి కాకుండా, నేరుగా బేవరేజెస్‌ కార్పొరేషన్‌కే వెళ్లేలా సవరణలు చేసింది. 2020లో ప్రభుత్వ మద్యం పాలసీని ప్రవేశపెట్టినప్పుడు ఒకసారి, కరోనా మొదటి దశలో మరోసారి 1,446 షాపులను తగ్గించింది. కానీ ఆ తర్వాత దాదాపు రెండేళ్లయినా మళ్లీ షాపుల సంఖ్య తగ్గించలేదు. అయితే ఈ ఏడాది అయినా మరిన్ని షాపులు తగ్గిస్తారని భావించగా, ఈ సంక్షేమ పథకాలను మద్యానికి ముడిపెట్టడంతో అది కష్టమేనని అర్థమవుతోంది. ఎందుకంటే షాపుల సంఖ్య తగ్గిస్తే అందుకు అనుగుణంగా అమ్మకాలు, ఆదాయం పడిపోతాయి. ఒకవేళ ప్రభుత్వం అందుకు సిద్ధపడి ఉంటే పథకాల నగదుకు ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకునేది. కానీ కీలకమైన పథకాలకు మద్యాన్ని ముడిపెట్టడం అంటే నిషేధం హామీకి తూట్లు పొడిచినట్లేనని విమర్శలు వినిపిస్తున్నాయి. పైగా మద్యం ఆదాయాన్ని పాతికేళ్ల పాటు తనఖా పెట్టి స్టేట్ డెలవప్‌మెంట్ కార్పొరేషన్ కింద ఇప్పటికే అప్పులు తెచ్చారు. 


మద్యంపై భారీ ఆదాయం ! 


ఏపీలో దుకాణాలు, బార్లలో కలిపి మొత్తం సగటున నెలకు రూ.2 వేల కోట్ల మద్యం విక్రయిస్తున్నట్లుగా తెలుస్తోంది. . 2019-20లో ఎక్సైజ్‌ ద్వారా ప్రభుత్వానికి రూ.17,500 కోట్ల ఆదాయం వస్తే, 2020-21లో రూ.17,600 కోట్ల ఆదాయం వచ్చింది. అయితే ఆ  ఏడాదిలోనే మద్యం షాపులు, బార్లు 43 రోజులు పూర్తిగా మూతపడ్డాయి. అయినా ఎక్కువ ఆదాయం వచ్చింది.ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 20 వేల కోట్లకుపైగా ఆదాయాన్ని అంచనా వేస్తున్నారు.  దీంతో మద్య నిషేధం అనే హామీ గాల్లో కలిసిపోయినట్లేనని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం కూడా ఇప్పుడు మద్య నిషేధంగురించి మాట్లాడటం లేదు.