3 Years of YSR Congress Party Rule : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మొట్ట మొదటి ప్రయారిటీ నవరత్నాలు. తర్వాతే ఉద్యోగుల జీతాలు, అభివృద్ది, ఇతర పనులకు బిల్లుల చెల్లింపులు..ఇతర ఖర్చులు. ఈ విషయంలో ప్రభుత్వం కూడా ఎలాంటి మొహమాటం లేకుండానే చెబుతోంది. కానీ ప్రజలకు డబ్బుల పంపిణీ చేస్తే సరిపోదని.. దానికి తగ్గట్లుగా సంపద సృష్టించాలని.. అభివృద్ధి పనులు జరగాలని నిపుణులు చెబుతూ ఉంటారు. సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో ఉంటేనే సంక్షోభం రాకుండా ఉంటుందని అంటూ ఉంటారు. అయితే మూడేళ్ల పాలనలో ఏపీ ప్రభుత్వం ఈ బ్యాలెన్స్ పాటించిందా ? సంక్షేమంతో పాటు అభివృద్ధికీ ప్రాధాన్యత ఇచ్చిందా ? రాష్ట్ర ప్రజల సంపద.. రాష్ట్ర సంపద పెరిగిందా ?
 
సంపద సృష్టించే పెట్టుబడి  వ్యయాన్ని పరమితం చేసిన ఏపీ ప్రభుత్వం !


ప్రభుత్వం సంపద సృష్టిస్తేనే జీడీపీ పెరుగుతుంది. పోలవరం సహా రాష్ట్రంలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తే రైతులకు కావాల్సినన్ని నీళ్లు అందుతాయి. పరిశ్రమలకు నీటి కొరత తీరుతుంది. ఈ నీరు అందుబాటులో ఉండటం వల్ల పంటలు పండుతాయి. పరిశ్రమలు వస్తాయి. వీటి ద్వారా ప్రజల ఆదాయం అమాంతం పెరుగుతుంది. అంటే.. జీడీపీ పెరుగుతుంది. అదే అసలైన అభివృద్ధి. అదే అసలైన సంపద సృష్టి. ఒక్క పోలవరం మాత్రమే కాదు.. రోడ్లపై పెట్టినా కూడా అది సంపద సృష్టే. కానీ ఏపీ ప్రభుత్వం గత మూడేళ్లలో ఇలాంటి అభివృద్ధి పనులకు వెచ్చించింది చాలా తక్కువ. మూడేళ్లలో రూ. లక్షా నలభై వేల కోట్లను ప్రజల ఖాతాల్లో వేశామని ప్రభుత్వం చెబుతోంది. అయితే అంతే స్థాయిలో తాము పెట్టుబడి వ్యయం చేశామని.. అభివృద్ధికి .. సంపద సృష్టికి ఖర్చు పెట్టామని మాత్రం చెప్పడం లేదు. 


అభివృద్ధి పేరుతో అప్పులు చేసినా సంక్షేమం కోసమే బదిలీ ! 


ప్రజలకు నేరుగా లబ్ది కలిగించే ప్రయత్నాలకే పెద్ద పీట వేశారు . అయితే అవి ప్రజల ఆదాయాన్ని పెంచాయా అంటే.. సరైన సమాధానం లేదు. పలు మల్టీనేషనల్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు. కానీ ఎంత వరకూ ప్రజల జీవితాల్ని మార్చే ప్రయత్నం చేశారో స్పష్టత లేదు.  ఆదాయ వనరులు ఇంత పరిమితంగా ఉన్న రాష్ట్రానికి… కావాల్సింది సంపద సృష్టించే పాలన. కానీ ఎదురుగా కనిపిస్తున్న సంపద సృష్టి మార్గాలైన పోలవరం, అమరావతి వంటి వాటిని పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి  పీపీఏల రద్దు నుంచి అమరావతి తో పాటు .. ఇతర నిర్ణయాల వల్ల.. విదేశీ పెట్టుబడిదారులెవ్వరూ ఏపీ వైపు చూసే పరిస్థితి లేకుండా పోయింది. మొత్తం ఇండియాకు వస్తున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో అరశాతం కూడా ఏపీకి రావడం లేదు. వివిధ కార్పొరేషన్లతో పాటు అభివృద్ది పేరుతో చేస్తున్న రుణాలు కూడా సంక్షేమానికే బదిలీ అయిపోతున్నాయి. ఫలితంగా అప్పులు పెరిగిపోతున్నాయి.. వాటినీ తీర్చేందుకు ఆస్తులు మాత్రం పెరగని పరిస్థితి.  


కనీస మూలధన వ్యయం చేయడం లేదు ! 


బడ్జెట్ అంచనాల ప్రకారం గత  ఆర్థిక సంవత్సం మూలధన వ్యయం రూ. 30,571.53 కోట్లు చేయాల్సి ఉంది. కానీ వాటిలో సగం కూడా ఖర్చు పెట్టలేదు. జనవరి నెలాఖరుకు రూ. 12 వేల కోట్లకుపైగా ఖర్చు పెట్టినట్లుగా లెక్కలు చూపించినప్పటికీ .. ఆ తర్వాత మూడు నెలల్లో ఎంత ఖర్చు పెట్టారో కాగ్ కూడా సర్టిఫై చేయలేదు. అయితే అప్పులు చేస్తే ఖచ్చితంగా మూలధనం వ్యయం చేయాలనే నిబంధన కేంద్రం పెట్టింది. అలా చేయకపోతే.. రుణ పరిమితిలో కోత విధిస్తుంది. ఇలా రుణ పరిమితో కేంద్రం కోత విధించింది. అయితే కేంద్రంతో సంప్రదింపులు ద్వారా రాష్ట్ర ఆ పరిమితిని ఎలాగోలా పొడిగించుకుని అప్పులు తెచ్చుకుంది. 


సంక్షేమం, అభివృద్ధి మధ్య సమతౌల్యం లోపిస్తే సంక్షోభమేనని ఆందోళన !


పూర్తిగా సంక్షేమానికి కేటాయించి.. పూర్తిగా అభివృద్ధికే ప్రాధాన్యం ఇచ్చినా సంక్షోభ పరిస్థితులు ఏర్పడతాయి. అభివృద్ధి జరగకపోతే.. ఆర్థిక కార్యకలాపాలు తగ్గిపోతాయి. దాని వల్ల ప్రభుత్వానికి కూడా ఆదాయం తగ్గిపోతుంది. అభివృద్ధి కోసం ప్రభుత్వం చేసే ఖర్చులో వివిధ పన్నుల ద్వారా 30 శాతం మళ్లీ ప్రభుత్వానికే తిరిగి వస్తుందని అంచనా. అలా వచ్చినా సంపద సృష్టి జరుగుతుంది. కానీ నగదు పంపిణీ వల్ల తిరిగి వచ్చేదేమీ ఉండదు. పైగా సంపద సృష్టి కూడా జరగదు. అందుకే మూడేళ్ల పాలనలో ఏపీ ప్రభుత్వం సంక్షేమంపై మాత్రమే దృష్టి పెట్టారు.. అభివృద్ధిని పట్టించుకోలేదు. అందుకే ఏపీ ప్రభుత్వం సంక్షోభం దిశగా వెళ్తుందన్న  ఆందోళన ఎక్కువ మందిలో కనిపిస్తోంది.