YS Sharmila Hunger Strike: ఈటల గడ్డపై వైఎస్ షర్మిల.. ఆ గ్రామంలో ఒకరోజు నిరాహార దీక్ష..
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (వైఎస్ఆర్‌టీపీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిరుద్యోగ పోరాట దీక్ష కొనసాగుతోంది. ప్రతి వారం ఆమె ఒక్కో చోట చేస్తున్న నిరుద్యోగ పోరాట దీక్షలో భాగంగా నిరుద్యోగులకు మద్దతుగా ఇవాళ కూడా ఒకరోజు నిరాహార దీక్ష చేస్తున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమంగళవారం (ఆగస్టు10న) కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం సిరిసేడు గ్రామంలో ఒకరోజు నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇటీవల ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకున్న మహ్మద్ షబ్బీర్ కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. అతడి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ఓదార్చారు.
చనిపోయిన యువకుడు షబ్బీర్ ఇంట్లో కాసేపు ఉన్న షర్మిల అతని తల్లిదండ్రులతో మాట్లాడారు. షబ్బీర్ విద్యార్హతలకు సంబంధించిన ధ్రువ పత్రాలను పరిశీలించారు.
ఉద్యోగ నోటిఫికేషన్ రాకపోవడంతో షబ్బీర్ అనే యువకుడు రైలు కిందపడి గత వారం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. తన వయసు పరిమితి కూడా దాటిపోవడంతో ఏం చేయాలో పాలుపోక ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్ నోట్ రాసి చనిపోయాడు.
షబ్బీర్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం షర్మిల ఆ గ్రామంలోనే నిరుద్యోగ దీక్ష చేపట్టారు. ఈ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు షర్మిల దీక్ష కొనసాగనుంది.
ప్రతి మంగళవారం షర్మిల నిరుద్యోగులకు మద్దతుగా ఒకరోజు నిరాహార దీక్ష చేయడం సాధారణమే అయినా, ఈ సారి ఆమె ఈటల ప్రాతినిథ్యం వహించే హుజూరాబాద్ నియోజకవర్గంలో దీక్ష చేస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈటల రాజేందర్, టీఆర్ఎస్ మధ్య హోరా హోరీ మాటల పోరు అక్కడ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో హుజూరాబాద్‌లో షర్మిల దీక్ష చేస్తున్నారు.
అయితే, హుజూరాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేయబోమని షర్మిల గతంలోనే ప్రకటించారు. అసలు హుజూరాబాద్ ఎన్నికల వల్ల ఉపయోగం ఏముందని షర్మిల ఓ సందర్భంలో ప్రశ్నించారు.