In Pics: కొత్త సచివాలయ నిర్మాణం ఎంత పూర్తయిందో చూడండి.. సందర్శించిన సీఎం కేసీఆర్
హైదరాబాద్‌లో కొత్తగా నిర్మిస్తున్న తెలంగాణ సచివాలయం నిర్మాణ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం (ఆగస్టు 7) పరిశీలించారు. నిర్మాణ సైట్లో దాదాపు 3 గంటల పాటు అధికారులు, కాంట్రాక్టర్లతో కలిసి కేసీఆర్ కాలినడకన సందర్శించారు. సచివాలయ భవన సముదాయానికి సంబంధించి ఇప్పటి వరకు ఒక అంతస్తు వరకు శ్లాబ్ పనులు పూర్తయ్యాయి. రెండో అంతస్తు శ్లాబ్ పనులు దాదాపు 60 శాతం వరకూ పూర్తయ్యాయి.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅయితే, నిర్మాణ పనులు ఎప్పటికి పూర్తవుతాయని అధికారులు, ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులు, ఇంజినీర్లతో పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. సచివాలయ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని, నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు.
సెక్రటేరియట్ ముందు, చుట్టుపక్కల నుంచి వర్షపు నీరు పోవడానికి అనువైన విధంగా వరద నీటి డ్రైనేజీ వ్యవస్థను నిర్మించాలని అన్నారు. విశాలమైన పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా, ఎక్కడికక్కడ నీరు తరలిపోయేలా ఉండాలని అన్నారు. కాంక్రీట్ నిర్మాణపనులు పూర్తయ్యేలోపే ముందస్తు వ్యూహంతో అవసరమైన సామాగ్రిని అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.
సచివాలయం ముఖ ద్వారాన్ని, బయటి గేటు నిర్మాణాలను, వాటికి అమర్చవలసిన గ్రిల్స్ తదితర అంశాలను, సీఎం కేసీఆర్ స్వయంగా పరిశీలించి సూచనలు చేశారు. ప్రహరీ గోడలకు అమర్చాల్సిన లాంప్ పోస్టుల గురించి సూచనలిచ్చారు. విశాలంగా నిర్మిస్తున్న కారిడార్ ప్రాంతాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం, సీఎస్ సహా మంత్రుల కార్యాలయాలు, ఇతర సిబ్బంది, సాధారణ పరిపాలన అధికారుల కార్యాలయాల నిర్మాణ వివరాలను కూడా సీఎం అడిగి తెలుసుకున్నారు.
సచివాలయ నిర్మాణంలో గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం పనులు పూర్తయిన నేపథ్యంలో, ప్రత్యేక చర్యలు చేపట్టి పై అంతస్తుల పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. అందుకోసం ఏం చేయాలో చేపట్టాలో చర్చించి ఆ దిశగా కార్యాచరణ ప్రారంభించాలని సీఎం కేసీఆర్ సూచించారు.
పార్కింగ్ వ్యవస్థ గురించి కూడా సీఎం ఆరా తీశారు. కార్లు, టూ వీలర్స్, బస్సులు తదితర వాహనాల పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. హెలీప్యాడ్ నిర్మాణం గురించి తెలుసుకున్నారు. దివ్యాంగులు, వయో వృద్ధులు తదితర సందర్శకులు, సెక్రటేరియట్‌కు వచ్చే వీఐపీల కోసం తీసుకోవాల్సిన ప్రత్యేక చర్యలను సీఎం వివరించారు. అవసరమైన వారి కోసం బ్యాటరీతో నడిచే వాహనాలను ఏర్పాటు చేయాలని అన్నారు. సందర్శనలో కేసీఆర్ వెంట, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు సి.లక్ష్మారెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి, మైనంపల్లి హన్మంతరావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ సోమేశ్ కుమార్ తదితరులు ఉన్నారు.