Wayanad Landslides: వయనాడ్‌లో పర్యటించిన రాహుల్, ప్రియాంక - బాధితులకు పరామర్శ
లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఆయనతో పాటు ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు. ఇప్పటి వరకూ ఈ విపత్తు కారణంగా 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. శిథిలాలు తొలగిస్తున్న కొద్ది మృతదేహాలు బయట పడుతున్నాయి.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఇక్కడి పరిస్థితులు చూస్తుంటే గుండె బరువెక్కుతోందని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కష్ట కాలంలో వయనాడ్ ప్రజలకు నేను, ప్రియాంక అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. సహాయక చర్యల్ని దగ్గరుండి పరిశీలిస్తున్నట్టు చెప్పారు రాహుల్. బాధితులందరికీ పునరావాసం కల్పించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నట్టు వివరించారు.
యూడీఎఫ్ కూటమి తరపున అన్ని విధాలుగా సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు రాహుల్ గాంధీ ప్రకటించారు. తరచూ ఇలాంటి విపత్తులు తలెత్తడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని అన్నారు. ఈ ముప్పు నుంచి తప్పించుకోడానికి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.
ముందు చూరల్మలలో ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన రాహుల్, ప్రియాంక..అక్కడి నుంచి మెప్పడిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కి వెళ్లారు. అక్కడే రిలీఫ్ క్యాంప్‌లనూ సందర్శించారు. వీళ్లిద్దరితో పాటు AICC జనరల్ సెక్రటరీ అలప్పుజ ఎపీ కేసీ వేణుగోపాల్ ఉన్నారు.
రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఉదయం 9.30 గంటలకు కన్నూర్ ఎయిర్‌పోర్ట్‌లో దిగారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వయనాడ్‌కి చేరుకున్నారు. నేరుగా చూరల్మల్కి వెళ్లారు. అక్కడి బాధితులతో మాట్లాడి పరామర్శించారు.
2019 లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్ నుంచి ఎంపీగా గెలుపొందారు రాహుల్ గాంధీ. ఈ సారి కూడా విజయం సాధించారు. అటు యూపీలోని రాయ్‌బరేలీ నుంచి కూడా పోటీ చేసి గెలిచారు. ఆ తరవాత వయనాడ్ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ప్రియాంక గాంధీ ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశముంది.
ప్రస్తుత పరిస్థితులపై కేరళ ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతున్నారు. ఇప్పటి వరకూ ఈ విపత్తు కారణంగా 256 మంది ప్రాణాలు కోల్పోయారు. మందక్కై, చూరల్మల, అత్తమల గ్రామాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ విపత్తులో 200 మంది గాయపడినట్టు అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకూ ఆర్మీ వెయ్యి మందిని ప్రభావిత ప్రాంతాల నుంచి సురక్షితంగా వేరే చోటకు తరలించింది. 220 మంది గల్లంతు కాగా వాళ్ల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. మూడు రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.