Tips for Competitive Exams: కాంపిటేటివ్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఈ టిప్స్ పాటించండి..
మీరు పోటీ ప్రవేశ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా? ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేది మీ లక్ష్యమా? ఏపీపీఎస్సీ, టీఎస్‌పీఎస్సీ, రైల్వే, బ్యాంకు, పోస్టల్, యూపీఎస్సీ, ఎస్ఎస్‌సీ.. ఇలాంటి వాటిలో కొలువు కొట్టాలనేది మీ కలా? ఎగ్జామ్ ఏదైనా సరైన ప్రణాళికతో చదివితే మీరు విజయం సాధించినట్లే. మరి కాంపిటేటివ్ పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవ్వాలి?
మొదట మనం ఏ పరీక్షకు దరఖాస్తు చేసుకుంటున్నామో దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. పరీక్ష గురించిన సిలబస్, కాన్సెప్ట్‌లను అర్థం చేసుకోవాలి. సిలబస్‌లో పేర్కొన్న అంశాల ఆధారంగా చదవాల్సిన సబ్జెక్టులను ఎంచుకోవాలి.
సబ్జెక్టులను ఎంచుకున్నాక అప్లికేషన్‌లో పేర్కొన్న సిలబస్‌ని తెలుసుకోండి. ఏ విభాగానికి ఎన్ని మార్కులు కేటాయించారనే దాని ఆధారంగా సిలబస్‌ను విభజించుకోండి. ఈ కంటెంట్‌ని అధ్యాయాలు, యూనిట్లుగా విభజించి టైంటేబుల్ వేసుకోండి. వెయిటేజీ ఆధారంగా ప్రాధాన్యత ఇచ్చి.. పక్కా ప్రణాళికతో చదవడం ప్రారంభించండి. ఒక్కసారి నోటిఫికేషన్ వెలువడ్డాక ప్రతి క్షణం విలువైనదే. కాబట్టి సమయం వృధా చేయకుండా పరీక్షలకు సిద్దమవ్వండి.
ప్రస్తుతం ఎక్కువ శాతం కాంపిటేటివ్ పరీక్షలు కంప్యూటర్ ఆధారితంగా జరుగుతాయి. కొన్ని ఆఫ్‌లైన్ విధానంలోనూ ఉంటున్నాయి. ఎంచుకున్న పరీక్షను బట్టి ముందస్తు ప్రాక్టిస్ అవసరం. పరీక్షల సమయంలో మాక్ ఎగ్జామ్స్ నిర్వహించే వెబ్‌సైట్లు కూడా ఉంటాయి. కుదిరితే మాక్ ఎగ్జామ్స్‌కు అటెండ్ అవ్వండి. ఒకటి రెండు సార్లు ప్రాక్టిస్ చేయడం వల్ల మీకు సమయపాలన అలవాటు అవుతుంది.
పరీక్ష రాసేటప్పుడు సమయ పాలన చాలా ముఖ్యం. మీకు బాగా వచ్చిన అంశాలను త్వరగా పూర్తి చేసి.. కష్టమైన అంశాలకు ఎక్కువ సమయం కేటాయించడం ద్వారా ఫలితం ఉంటుంది. మనం ఎంత బాగా పరీక్షలకు ప్రిపేర్ అయినా సమయం చాలకపోవడంతో ఫెయిలైన సందర్భాలు ఉంటాయి. కాబట్టి సరైన ప్రణాళికతో పరీక్షలకు హాజరవ్వండి.
పరీక్షలకు ప్రిపేర్ అయ్యే సమయంలో కొన్ని ఆటంకాలు రావడం సహజం. టీవీ, సినిమాలు, క్రికెట్, సెల్ ఫోన్లు, సోషల్ మీడియా వంటి వాటి వల్ల మైండ్ డిస్టర్బ్అవుతుంటుంది. మన మెదడును డిస్ట్రాక్ చేసే విషయాల జోలికి వెళ్లకండి. సాధ్యమైనంత వరకు ప్రిపరేషన్ పై దృష్టి సారించాలి.
పరీక్షలకు సన్నద్ధమయ్యే సమయంలో ఆరోగ్యం గురించి కూడా శ్రద్ధ వహించాలి. పరీక్షల కోసం నిద్ర పోకుండా చదవడం వంటివి చేయకూడదు. నిద్రలేమి వల్ల మానసిక సమస్యలు, చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది పరీక్షలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి పరీక్షల సమయంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ సరైన నిద్రకు ప్రాధాన్యం ఇవ్వండి.
ఏ ఉద్యోగానికైనా ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం. మీరు సాధించగలరనే నమ్మకంతో పరీక్షలకు సన్నద్ధం అవ్వండి. కొందరికి ఒకే ప్రయత్నంలో ఉద్యోగం రావచ్చు.. మరికొందరికి ఇంకాస్త సమయం పట్టవచ్చు. దేనినైనా సింపుల్‌గా తీసుకోండి. ప్రిపరేషన్‌పై మాత్రమే దృష్టి సారించండి. సాధ్యమైనంత వరకు నెగిటివ్ విషయాలకు దూరంగా ఉండండి. ఆత్యస్థైర్యంతో ముందుకు సాగండి.