Anantapur district Latest News: అనంతపురం జిల్లాలో విషాదం- మట్టి పెళ్లలు విరిగిపడి ముగ్గురు చిన్నారులు మృతి
అనంతపురం జిల్లా కుందుర్పి మండలం మలయనూరు చెరువులో ప్రమాదం జరిగింది. చిన్నారులు ఆడుకుంటున్న టైంలో మట్టిపెళ్లలు విరిగిపడి ముగ్గురు చిన్నారులు చనిపోయారు. ఒకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరారు.
మృతి చెందిన మారుతి, హనీ, జ్యోతి ముగ్గురు పిల్లలు ఒకే కుటుంబానికి చెందినవారు. తండ్రిపేరు విలాస్. వీరు మహారాష్ట్రలోని రాయగడ్ జిల్లాకి చెందినవారు. బాకీ అనే పిల్లాడు ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు.
మహారాష్ట్రకు చెందిన ఎనిమిది కుటుంబాలు మలయనూరు చెరువులో నాలుగు నెలలుగా బొగ్గులు కాల్చుకుంటూ నివాసం ఉంటున్నారు. గురువారం సాయంకాలం వారి పిల్లలు ఆడుకుంటుండగా ప్రమాదం జరిగింది.
ప్రమాదం గురించి తెలుసుకున్న కూలీలకు పని కల్పించిన వ్యక్తి శ్రీకాంత్ రాథోడ్ స్పాట్‌కు చేరుకున్నారు. చిన్నారుల మృతదేహాలను మాయం చేయాలని చూశాడు. స్థానికులు అది చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలాన్ని స్థానిక ఎస్సై జీవి నరేష్ చేరుకునే విచారణ చేపట్టారు.