Srivari Brahmostavas: శ్రీవారికి స్నపన తిరుమంజనం

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు(శనివారం) శ్రీవారి ఆలయంలో జాజి పత్రి, పిస్తా, కర్జూరం-పన్నీరు ఆకు, ఎండు ద్రాక్ష, రోజా పుష్పాల రేకులతో ప్రత్యేకంగా రూపొందించిన మాలలు, కిరీటాలతో స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
రంగనాయకుల మండపంలో ప్రత్యేక వేదికపై ఆశీనులైన శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామికి వేద మంత్రాల నడుమ శాస్త్రోక్తంగా పూజాకార్యక్రమాలు నిర్వహించారు. దాదాపు రెండు గంటల పాటు జరిగిన స్నపన తిరుమంజనంలో వివిధ రకాల మాలలతో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి భక్తులకు కనువిందు చేశారు.

చెన్నైకి చెందిన దాత త్రిలోక్ చందర్ సహకారంతో స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక మాలలు, కిరీటాలు, స్నపన మండపం ఏర్పాటు చేశారు. అదేవిధంగా 20 మంది నైపుణ్యం గల నిపుణులు మూడు రోజుల పాటు శ్రమించి తామర పువ్వు ఆకారంలో మండపాన్ని రూపొందించారు.
స్నపన తిరుమంజనం నిర్వహించే రంగనాయకుల మండపంలో తామర పువ్వు ఆకారంలో వివిధ రకాల సంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్, అపురూపమైన ఉత్తమజాతి పుష్పాలు, ఆస్ట్రేలియా బత్తాయి, ద్రాక్ష గుత్తులతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.
పలు రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేస్తుండగా, ప్రత్యేక మాలలను అలంకరించారు. జాజి పత్రి, పిస్తా, కర్జూరం-పన్నీరు ఆకు, ఎండు ద్రాక్ష, రోజా పువ్వు రేకులతో, మాలలు, వట్టి వేరు, తులసితో తయారు చేసిన మాలలు మలయప్ప స్వామికి అలంకరించారు.
శ్రీవారికి స్నపన తిరుమంజనం