Pawan Kalyan: దేశానికి సేవ చేయాలని ఆ పాఠాల వల్లే ఆసక్తి పెరిగింది - పవన్ కళ్యాణ్
పాఠశాలలు, ప్రభుత్వ ఆస్తుల కబ్జాకు పాల్పడే వ్యక్తులపై గూండా యాక్ట్ కింద కేసులు పెడతామని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హెచ్చరించారు. కడప జిల్లాలో పాఠశాలల ఆక్రమణలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవిద్యార్ధులకు సరైన చదువు ఇవ్వకపోతే సమాజం అభివృద్ధి చెందదని.. అందుకే స్కూళ్లు, విద్యార్ధుల సమస్యల పరిష్కారం పట్ల కూటమి ప్రభుత్వం (AP Government) చిత్తశుద్ధితో ఉందన్నారు పవన్ కళ్యాణ్. ప్రభుత్వం వద్ద నిధులు లేకున్నా మనసు పెద్దదని, తమ దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి దారులు వెతుకుతున్నామని డిప్యూటీ సీఎం పవన్ చెప్పారు. కడప నగరంలోని మద్రాస్ రోడ్డులోని మున్సిపల్ కార్పోరేషన్ హైస్కూల్లో శనివారం నాడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు.
మున్సిపల్ కార్పోరేషన్ పాఠశాల విద్యార్ధులతో పవన్ కళ్యాణ్ ముఖాముఖి సమావేశం అయ్యారు. స్కూల్ వంటశాల నవీకరణకు నిధుల కొరత ఉందని జిల్లా కలెక్టర్ ద్వారా తెలుసుకుని, అందుకు అయ్యే ఖర్చు మొత్తం తన సొంత ట్రస్ట్ నుంచి అందజేస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. అనంతరం సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. విద్యార్ధుల భవిష్యత్తును ముందుకు తీసుకువెళ్లడమే లక్ష్యంగా ఈ రోజు ఒకేసారి 44 వేల పాఠశాలల్లో కోటి మంది విద్యార్ధులు, తల్లిదండ్రులు పాల్గొనేలా సీఎం చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ ప్రభుత్వం ఏర్పాటు చేశామన్నారు.
రాష్ట్రంలోనే అత్యధిక గ్రంథాలయాలతో వెలసిల్లిన ప్రాంతం కడప అని.. అందుకే ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమావేశానికి తాను ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నానని పవన్ కళ్యాణ్ తెలిపారు. కడప చదువుల గడ్డ అని.. అన్నమయ్య, వేమన, కవయిత్రి మొల్ల, పుట్టపర్తి నారాయణాచార్యులు, కేవీరెడ్డి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, తరిమెల నాగిరెడ్డి, వంటి మహనీయులు పుట్టిన నేల ఇది అన్నారు.
రాయలసీమ అంటే వెనుకబాటు కాదని, అవకాశాలను ముందుండి నడిపించే ప్రాంతం అన్నారు పవన్ కళ్యాణ్. ప్రభుత్వ పాఠశాలలు బలపడాలి. ప్రభుత్వ పాఠశాలు కార్పోరేట్ స్కూల్స్ తో సమంగా అభివృద్ధి చెందాలన్నారు. నిధులను సద్వినియోగం చేసుకుంటే కార్పోరేట్ స్కూల్స్ కి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను ముందుకు తీసుకువెళ్లవచ్చు అన్నారు పవన్ కళ్యాణ్. తల్లిదండ్రులు సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తే వాటిని తీర్చే బాధ్యతను ప్రభుత్వం స్వీకరిస్తుందని భరోసా ఇచ్చారు.
నా తల్లిదండ్రులు నాకు విలువలు నేర్పారు డ్రగ్స్ వ్యాప్తి విద్యార్ధుల భద్రతపై ప్రభావం చూపుతోందని, సోషల్ మీడియా విస్తృతి కూడా విద్యార్ధులపై ప్రభావం చూపుతోందని పవన్ కళ్యాణ్ అన్నారు. తన తల్లిదండ్రులు చదువుకున్నది తక్కువే అయినా తనకు విలువలు నేర్పారని చెప్పారు. విద్యార్ధుల భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వం మెరుగ్గా పని చేస్తుందని, పిల్లలు సోషల్ మీడియా తక్కువగా వాడేలా చూసే బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. స్మార్ట్ ఫోన్ ను చదువు కోసమా, లేక చెడు మార్గాల కోసం వాడుతున్నారా అనేది గమనిస్తుండాలని సూచించారు.
కర్నూలు జిల్లాలో సుగాలి ప్రీతి అనే విద్యార్ధిని స్కూలుకు వెళ్లి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ఏళ్లు గడుస్తున్నా దోషులకు శిక్ష పడలేదు, అందుకే కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక సుగాలి ప్రతి కేసు విచారణ వేగవంతం చేశామన్నారు పవన్ కళ్యాణ్. ప్రతి స్కూల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుపై సీఎం చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. తమ బిడ్డలు, పరిసర ప్రాంతాల్లో పరిస్థితుల పట్ల తల్లిదండ్రులు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. మీ బిడ్డలకు యోగి వేమన సంస్కారం నేర్పాలని తల్లిదండ్రులకు సూచించారు.
టీచర్లకు అత్యధిక వేతనం ఇచ్చే రోజు రావాలి విద్యార్ధులు బాగా చదువుకోవాలంటూ మంచి దేహధారుడ్యంతో ఉండాలి. విద్యార్ధులకు సరైన పోషకాలు అందించడంపై అధ్యయనం చేస్తాం. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే విధంగా ఏపీ కేబినెట్ లో చర్చిస్తామన్నారు పవన్ కళ్యాణ్. నా టీచర్ చెప్పిన పాఠాల వల్లే దేశానికి సేవ చేయాలన్న తనలో ఆసక్తి పెరిగిందని తెలిపారు. దేశంలో అత్యధిక వేతనం టీచర్లకు వచ్చే రోజు రావాలని కోరుకున్నారు.
టీచర్లే నిజమైన హీరోలు నా టీచర్లు నా హీరోలు. హీరోలు సినిమాల్లో మాత్రమే ఉండరు. నిజమైన హీరోలు మన కళ్ల ముందే టీచర్ల రూపంలో ఉంటారని పవన్ కళ్యాణ్ అన్నారు. కడప మున్సిపల్ స్కూల్ విద్యార్ధినికి జాతీయ స్థాయిలో బ్రాంజ్ మెడల్ గెలిచే స్థాయికి తీసుకువెళ్లిన టీచర్ నిజమైన హీరో అన్నారు.
2014 - 2019 మధ్య ఉద్దానం సమస్యను బయటకు తీసుకువస్తే ఆనాటి సీఎం చంద్రబాబు రూ. 61 కోట్లతో ఉద్దానం ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లారని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. పులివెందుల తాగునీటి ప్రాజెక్టుకు రూ. 45 కోట్లు ఇచ్చాం. నీటి సమస్య తీర్చి కడప ప్రజలను ఆదుకుంటామని మాటిచ్చారు.
కడప, రాయలసీమ తెగింపు ఉన్న బలమైన నేల. గత వైసీపీ ప్రభుత్వ పాఠశాలల విలీనం నిర్ణయం కారణంగా ఆడబిడ్డలు స్కూల్స్ కి వెళ్లలేకపోతున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇక్కడ విద్యార్ధులు ఇక్కడే చదువుకుని, ఇక్కడే ఉద్యోగాలు చేయాలన్నారు. ఏమైనా సమస్యలు వస్తే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి మేము కృషి చేస్తాం అన్నారు.