వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (వైఎస్ఆర్‌టీపీ) విస్తరణ, భవిష్యత్ కార్యాచరణలో భాగంగా కీలక అడుగులు పడనున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగేందుకు పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దృష్టి సారించారు. దీనిలో భాగంగా ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బృందంతో భేటీ అయ్యారు. లోటస్‌పాండ్‌లోని నివాసంలో షర్మిలతో ప్రశాంత్ కిషోర్ బృందం భేటీ అయింది. అక్టోబర్ 20 నుంచి పాదయాత్ర చేపట్టనున్నట్లు షర్మిల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాదయాత్ర రూట్ మ్యాప్ సహా భవిష్యత్ కార్యాచరణపై ప్రశాంత్ కిషోర్ టీంతో చర్చించినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 3వ తేదీన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని కోస్గిలో బీసీ గౌరవ సభ నిర్వహిస్తున్నట్లు వైఎస్ఆర్‌టీపీ ముఖ్య నేతలు ప్రకటించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో సైతం నిరుద్యోగుల తరఫున నామినేషన్లు వేయాలని వైఎస్ఆర్‌టీపీ నిర్ణయించింది. దీని కోసం ఒక కమిటీని సైతం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
Also Read: తెలంగాణలో కొత్తగా 245 పాజిటివ్ కేసులు.. జీహెచ్ఎంసీలో 73 మందికి కరోనా
చేవెళ్ల టు చేవెళ్ల .. అక్టోబర్ 20 నుంచి యాత్ర..
షర్మిల అక్టోబర్ 20 నుంచి తెలంగాణలో పాదయాత్ర ప్రారంభించాలని నిర్ణయించినట్లు షర్మిల ఇటీవల ప్రకటించారు. ఈ పాదయాత్రకు ప్రజాప్రస్థానం అని పేరు పెట్టినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 90 నియోజకవర్గాల్లో ఈ యాత్ర సాగుతుందని షర్మిల వెల్లడించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి తన పాదయాత్రను ప్రారంభించిన చేవెళ్ల నుంచే షర్మిల కూడా ప్రజాప్రస్థానం యాత్రను ప్రారంభిస్తారు. అలాగే యాత్రను చేవెళ్లతోనే ముగిస్తారు. గ్రేటర్ పరిధి మినహా మిగతా అన్ని ఉమ్మడి జిల్లాల్లో షర్మిల పాదయాత్ర చేస్తారు.
మా మధ్య తగాదాలు వాస్తవమే..
జగన్, షర్మిల మధ్య విభేదాలు ఉన్నాయని ఇటీవల పుకార్లు వెల్లువెత్తాయి. షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడంతో ఈ వాదనలు మరింత బలపడ్డాయి. దీనిపై ఇటు షర్మిల కానీ అటు జగన్ కానీ ఎక్కడా వివరణ ఇవ్వలేదు. దీంతో ఎవరికి నచ్చినట్లు వారు కథనాలు అల్లుకున్నారు. చాలా కాలం తర్వాత షర్మిల తన కుటుంబంలో ఉన్న విభేదాలపై నోరు విప్పారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు విషయాలను వెల్లడించారు. వైఎస్ కుటుంబంలో విభేదాలు ఉన్న మాట వాస్తవమేనని, కానీ అవి కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారం అయ్యేవేవని షర్మిల వ్యాఖ్యానించారు. తమ మధ్య ఆస్తుల వివాదాలు కూడా ఉన్నాయని స్పష్టం చేశారు.
Also Read: తెలంగాణకు లక్ష కోవిడ్ టెస్ట్ కిట్లు.. మ్యాప్‌మైజెనోమ్, జైమో విరాళం..