వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12వ వర్థంతి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సారి ఆసక్తి రేకెత్తించింది. వర్థంతి సందర్భంగా ఆయనతో అనుబంధాన్ని  ఆయనకు ఆత్మీయులైన వారందరూ గుర్తు చేసుకున్నారు. అయితే ఇదే సందర్భంగా ఆయన సతీమణి వైఎస్ విజయలక్ష్మి ఏర్పాటు చేసిన సమావేశానికి మాత్రం వారెవరూ హాజరు కాలేదు. రాజకీయాలకు అతీతమైన సంస్మరణ అని చెప్పినప్పటికీ రాజకీయ కారణాలతోనే దాదాపుగా అందరూ డుమ్మా కొట్టారు. హాజరైన ఒకరిద్దరు కూడా రాజకీయ కారణాలతోనే హాజరయ్యారు. వైఎస్ సంస్మరణను ఎందుకింత రాజకీయం అయింది..? ఆయనతో ఆత్మీయంగా ఉన్న వారెవరూ ఆత్మీయ సమావేశానికి ఎందుకు రాలేదు..? రాజకీయేతర సమావేశం అని అందర్నీ పిలిచి రాజకీయం చేయాలని వైఎస్ విజయలక్ష్మి అనుకున్నారా..?


Also Read : కోమటిరెడ్డిపై కాంగ్రెస్ హైకమాండ్ చర్యలు తీసుకుంటుందా ?


వైఎస్‌కు అత్యంత ఆప్తులూ డుమ్మానే..!


హైదరాబాద్‌లోని ప్రముఖ స్టార్ హోటల్ల్లో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ సంస్మరణ సభకు వైఎస్ హయాంలో ప్రయోజనాలు పొందిన రాజకీయ నేతలు, ఇతర వర్గాలకు చెందిన 350 మంది వరకూ ప్రముఖుల్ని ఆహ్వానించారు. వారిలో రాజకీయ నేతలే ఎక్కువ. రాష్ట్ర విభజనకు ముందు వైఎస్ సీఎంగా చేసినందున రెండు రాష్ట్రాల్లోనూ ప్రతి జిల్లాలోనూ ఆయనకు అత్యంత సన్నిహితులైన నేతలు ఉన్నారు. వైఎస్ మరణం తర్వాత అంతా చెల్లాచెదురైపోయారు. తమకు రాజకీయ  భవిష్యత్ ఎక్కడ ఉంటుందో అక్కడ చేరిపోయారు. చాలా కొద్ది మంది మాత్రమే కాంగ్రెస్‌లో ఉన్నారు. అయితే కాంగ్రెస్‌తో వైఎస్ కుటుంబం బంధం తెంచుకుంది. అదే సమయంలో  వైఎస్ కుటుంబంలోనూ విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలూ ఆ సమావేశానికి హాజరు కాలేకపోయారు. అంటే కాంగ్రెస్‌లో ఉన్న నేతలూ హాజరు కాలేదు. ఇతర పార్టీల్లో ఉన్న నేతలూ హాజరు కాలేదు. చివరికి సొంత కుటుంబ సభ్యుడు పెట్టిన పార్టీలో చేరిన నేతలూ హాజరు కాలేదు. దీంతో సంస్మరణ సభ వెలవెలబోయింది.


రాజకీయ కారణాల వల్లే దూరంగా ఉన్న నేతలు..!


నిజానికి రాజకీయాలకు అతీతమైన సభగా ప్రకటించారు. కానీ రాజకీయ నేతలకు మాత్రం నమ్మశక్యం అనిపించలేదు. వైఎస్‌కు నివాళి అని చెప్పినప్పటికీ అక్కడకు వెళ్లిన తర్వాత రాజకీయ ప్రసంగాలు చేస్తే ప్రస్తుతం తాము ఉన్న పార్టీలో తమకు ఎదురుగాలి వీస్తుందని.. తమ తమ అధినాయకత్వాలు తమపై అపనమ్మకం పెంచుకుంటాయన్న అభిప్రాయంతో ఎక్కువ మంది నేతలు సమావేశానికి దూరమయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలదీ అదే పరిస్థితి. తమ పార్టీ మూల  పురుషుడిగా భావించే వైఎస్ఆర్ సంస్మరణ కార్యక్రమానికి ఆయన కుమారుడు జగనే దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంతో తాము వెళ్తే తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయన్న కారణంగా మిగిలిన వారూ ఆగిపోయారు. వారెవరకూ వైఎస్‌పై అభిమానం లేక కాదు. రాజకీయ కారణాల ఆటంకాల వల్లే వారు ఆగిపోయారు.


Also Read : ఏపీలో ఇళ్లలోనే వినాయక చవితి


ఇతర రంగాలకు చెందిన కొద్ది మంది హాజరు..!


తెలుగు రాష్ట్రాల నుంచి ఉండవల్లి అరుణ్ కుమార్, కేవీపీ రామచంద్రరావు, రఘురవీరారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, కూనశ్రీశైలం గౌడ్ మాత్రమే హాజరైన వారిలో గుర్తించుకోదగ్గ నేతలు. వీరిలో తెలంగాణకు చెందిన ముగ్గురు నేతలు కాకుండా ఏపీ నేతలు ముగ్గురూ క్రియాశీలక రాజకీయాల్లో లేరు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరు వెనుక కూడా రాజకీయ కారణాలే ఉన్నాయి. వైఎస్ పాలనలో మేళ్లు పొందిన ఇతర రంగాలకు చెందిన వారు హాజరయ్యారు. వారికి రాజకీయాలతో సంబంధం లేదు. అప్పటి వైఎస్ ప్రభుత్వ విధానాల కారణంగా.. పదవుల పరంగా సాయం పొందిన వారు విజయలక్ష్మి ఆహ్వానాన్ని మన్నించారు. అందరూ వచ్చారు. తమ శక్తి మేరకు వైఎస్‌ను స్మరించుకున్నారు.  సినీ నటలూ రాలేదు. కృష్ణ వీడియో సందేశం, మోహన్ బాబు ఆడియో సందేశం మాత్రమే పంపారు. వైఎస్ఆర్‌తో గొప్ప అనుబంధం ఉన్న చిరంజీవి, నాగార్జున వస్తారని అనుకున్నారు. కానీ వారూ హాజరు కాలేదు.


షర్మిల పార్టీ కోసమే సమావేశం..!


అయితే సమావేశం జరిగిన తీరు.. అందులో వైఎస్ విజయలక్ష్మి చేసిన ప్రసంగం... చేసిన విజ్ఞప్తులను చూస్తే పక్కా రాజకీయ సమావేశం అని సులువుగానే అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డను ఆదరించాలని.. ఆమెకు అందరూ అండగా ఉండాలన్న సందేశంతోనే ఈ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వచ్చినట్లయితే.. ఇతర రాజకీయ నాయకులు నిజంగానే రాజకీయంగా ఇబ్బందిపడి ఉండేవారన్న అభిప్రాయాలున్నాయి. మొత్తానికి రాజకీయ ఎజెండా లేదని చెప్పి ఏర్పాటు చేసిన సంస్మరణ కార్యక్రమం పూర్తిగా రాజకీయంగా మారిపోయింది. వైఎస్ చర్మిష్మాను ఇప్పటికీ రాజకీయ ఎదుగుదలకు వాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారన్న విశ్లేషణలు రావడానికి ఈ సభ కారణం అవుతోంది. 


 


Also Read : వర్షానికి మునిగిన న్యూయార్క్