న్యూయార్క్ నగరాన్ని హరికేన్లు ముంచెత్తుతున్నాయి. న్యూయార్క్ సిటీలో అకస్మాత్తుగా సంభవించిన రికార్డు స్థాయి వర్షం, వరద ధాటికి నగరమంతా చిగురుటాకులా వణికిపోయింది. ఇడా హరికేన్ బీభత్సానికి బుధవారం రాత్రి కనీసం 41 మంది చనిపోయి ఉంటారని స్థానిక పత్రికలు వెల్లడించాయి. నగర వీధులన్నీ నదులను తలపించడం సహా సబ్ వేలు, రైళ్లు ప్రయాణించే భూగర్భ మార్గాలన్నీ నీటితో నిండిపోయాయని అధికారులు వెల్లడించారు. అసలు న్యూయార్క్‌లో ఈ స్థాయిలో వరదను ఎన్నడూ చూడలేదని సబ్ వేలో రెస్టారెంట్ నిర్వహించే ఓ 50 ఏళ్ల వ్యక్తి మీడియాతో అన్నారు. ఈ పరిణామం నమ్మశక్యంగా లేదని, న్యూయార్క్‌ను ఈ స్థాయిలో వరదలు ముంచెత్తడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోందని ఆయన అన్నారు.
మరోవైపు, వరద బీభత్సానికి న్యూయార్క్‌లోని లాగార్డియా, జేఎఫ్‌కే, న్యూఆర్క్ విమానాశ్రయాల నుంచి వందల సంఖ్యలో విమానాలను రద్దు చేశారు. న్యూఆర్క్ విమానాశ్రయంలో అయితే ఏకంగా టెర్మినల్స్ అన్నీ వరద నీటితో నిండిపోయాయి. న్యూయార్క్ చరిత్రలోనే ఇంత దారుణమైన ప్రకృతి విపత్తు సంభవించినందుకు కారణం వాతావరణంలో చోటు చేసుకుంటున్న పెను మార్పులేనని అధికారులు చెబుతున్నారు.
ఆకస్మికంగా సంభవించిన ఈ వరదలు న్యూజెర్సీ, న్యూయార్క్‌లోని మాన్‌హాటన్, ది బ్రోంక్స్, క్వీన్స్ ప్రాంతాల్లోని ప్రధాన రహదారులు మూసుకుపోయేలా చేశాయి. ప్రస్తుతం అక్కడ రవాణా స్తంభించిపోయింది. కార్లన్నీ మునిగిపోయాయి. వరదల్లో చిక్కుకున్న వందలాది మంది ప్రజలను రక్షించడానికి అగ్నిమాపక శాఖను తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.
న్యూయార్క్ వరదలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. న్యూయార్క్ నగరానికి సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. అయితే, ఆయన శుక్రవారం లూసియానా రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇవాళ పర్యటించనున్నారు. అక్కడ హరికేన్ తాకిడికి ఇప్పటికే భవనాలు కుప్పకూలిపోవడమే కాకుండా, లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
న్యూజెర్సీ రాష్ట్రంలోనే కనీసం 23 మంది చనిపోయినట్లుగా ఆ రాష్ట్ర గవర్నర్ ఫిల్ మర్ఫీ విలేకరులకు తెలిపారు. వీరిలో కూడా ఎక్కువ మంది వాహనాల్లో చిక్కుకొని చనిపోయిన వారే అని ఆయన చెప్పారు. న్యూయార్క్ సిటీలో 12 మంది చనిపోయారని, వారిలో 11 మంది బేస్‌మెంట్ల నుంచి బయటికి రాలేక వరద నీటిలో చిక్కుకొని మరణించారని పోలీసులు తెలిపారు.
అత్యవసర హెచ్చరికలు జారీ
న్యూజెర్సీ, పెన్సిల్వేనియాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలగడంతో లక్షల మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెన్సిల్వేనియాలోని జాన్స్‌టౌన్‌లో ఓ జలాశయంలోకి ప్రమాదకరస్థాయిలో నీరు చేరడంతో స్థానికులను ఖాళీ చేయించారు. మరోవైపు, ల్యారీ అనే మరో తుపాను కూడా అంతకంతకూ బలపడుతోందని, శనివారం కల్లా అది ఇడా స్థాయిలో తీవ్రరూపం దాల్చే అవకాశాలున్నాయని అధికారులు హెచ్చరించారు. న్యూయార్క్‌లోని జాతీయ వాతావరణ కేంద్రం వరద ఉద్ధృతి నేపథ్యంలో అత్యవసర హెచ్చరికలను జారీ చేసింది.