అఫ్గానిస్థాన్ ను తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత అక్కడి పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. తాలిబన్ల భయంతో అప్గాన్ వాసులు దేశం దాటి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. మరోవైపు దేశంలో ఆహార సంక్షోభం తీవ్రమవుతుందనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే అఫ్గానిస్థాన్ లో 30శాతానికిపైగా ప్రజలు కనీసం ఒకపూట భోజనం చేస్తున్నారో లేదో తెలియదని ఐక్యరాజ్య సమితి (ఐరాస) చెప్పడం అక్కడి పరిస్థితులకు నిదర్శనం.
అక్టోబర్ తో ఖాళీ..
అఫ్గానిస్థాన్ లో ఉన్న ఆహార నిల్వలు ఈ నెలతోనే పూర్తిగా నిండుకునే ప్రమాదం ఉందని.. అక్టోబర్ నాటికి ఖాళీ అవుతాయని ఐరాస హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు.. అఫ్గాన్ కు సాయం చేసేందుకు ముందుకు రావాలని ఐరాస పిలుపునిచ్చింది.
ఆహారం, వైద్య సదుపాయాలు, అత్యవసర వస్తువులను తక్షణమే అందించేలా చర్యలు చేపట్టాలని ఐరాస సూచించింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చిన్నారుల ఆహారం కోసమే 200 మిలియన్ డాలర్లు అవసరమని అంచనా వేసింది. ఈ మేరకు అఫ్గాన్ ను ఆదుకోవాలని పిలుపునిచ్చింది.
సర్కార్ ఏర్పాటుకు..
మరోవైపు అఫ్గానిస్థాన్ లో ప్రభుత్వ ఏర్పాటు కోసం తాలిబన్లు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అమెరికా దళాలు అఫ్గాన్ ను వీడిన తర్వాత తాలిబన్లు జోరు పెంచారు. అయితే కొత్త ప్రభుత్వం ఎవరి నాయకత్వంలో పనిచేయనుందన్న విషయంపై తాజాగా తాలిబన్లు స్పష్టత ఇచ్చారు. ముల్లా హైబతుల్లా అఖుంద్ జాదా కనుసన్నల్లోనే ప్రధాని మంత్రి లేదా అధ్యక్షుడు ప్రభుత్వాన్ని పాలిస్తారని తాలిబన్లు తెలిపారు.
Also Read: Afghanistan Crisis Update: స్పీడు పెంచిన తాలిబన్లు.. సుప్రీం లీడర్ కనుసన్నల్లోనే పరిపాలన