మాదక ద్రవ్యాల కేసులో చోటుచేసుకున్న లావాదేవీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 31న దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో ఆరంభమైన ఈ విచారణ.. సెప్టెంబరు 22తో ముగుస్తుంది. గురువారం నటి, నిర్మాత చార్మిను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. మరికొన్ని గంటలపాటు ఈ విచారణ కొనసాగునుంది. విచారణలో భాగంగా చార్మి, ఆమె ప్రొడక్షన్ హౌస్‌కు సంబంధించిన బ్యాంకు లావాదేవీలను అధికారులను ప్రశ్నిస్తున్నారు. 


నటి రకూల్ ప్రీత్ సింగ్‌ను కూడా ఈడీ విచారించనుంది. ఈ సందర్భంగా సెప్టెంబరు 6న హాజరు కావాలని నోటీసులు పంపింది. అయితే, రకుల్ వరుస షూటింగ్‌లతో బిజీగా ఉండటం వల్ల విచారణకు హాజరు కాలేనని, కొంత గడువు కావాలని ఈడీని కోరింది. తనకు మరో డేట్ కేటాయించాలని కోరుతు లేఖ రాసింది. రకుల్ ప్రీత్ సింగ్ లేఖపై ఈడీ స్పందించింది. ఎట్టి పరిస్థితుల్లో కేటాయించిన తేదీలోనే విచారణకు హాజరు కావాలని ఈడీ సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. ఒకవేళ గైర్హాజరైతే మాత్రం ఈడీ చర్యలు తీసుకొనే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఇదివరకు ఎక్సైజ్ అధికారులు జరిపిన విచారణలో రకుల్ పేరు లేకపోవడం గమనార్హం.  


ఈ కేసుకు డ్రగ్స్ వినియోగంతో సంబంధం లేదు. కేవలం వాటిని కొనుగోలు చేయడానికి జరిగిన లావాదేవీలు గురించే విచారణ జరగనుంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ సెక్షన్ 3, 4 కింద కేసులు నమోదయ్యాయి. విచారణలో అక్రమ లావాదేవీలు గుర్తిస్తే ఆ మేరకు అదనపు కేసులు కూడా నమోదు చేసే అవకాశం ఉంది. విచారణలో భాగంగా ఈడీ పూరీ జగన్నాథ్ ఆరేళ్ల ట్రాన్సాక్షన్స్ కావాలని కోరింది. ఈ సందర్భంగా పూరీ తన మూడు అకౌంట్లలో 2015 - 2021 మధ్య జరిగిన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ వివరాలను ఈడీకి అందించినట్లు సమాచారం. ఈ కేసుతో సంబంధం ఉన్న మిగతా సినీ ప్రముఖుల ఖాతాలను కూడా ఈడీ తనిఖీ చేయనుంది. 


మాదక ద్రవ్యాల తరలింపుపై తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు గతంలో మొత్తం 62 మందిని ప్రశ్నించారు. ఇప్పుడు ఈడీ కూడా అందర్నీ ప్రశ్నించే అవకాశం ఉంది. ఇప్పటికే పాత నేరస్తుల్ని ప్రశ్నించి వివరాలు రాబట్టారు. మరో వైపు ఈడీ వర్గాలు చాలా సీరియస్‌గా దర్యాప్తు చేస్తున్నట్లుగా సంకేతాలు అందుతున్నాయి. డ్రగ్స్ ఎలా తెప్పించేవారు..?  డబ్బులు ఎలా చెల్లించారు..? అన్న వాటిపై పూర్తి సమాచారం ఈడీ అధికారులు సేకరించారని.. ఆ ఆధారల ప్రకారమే సినీ ప్రముఖులను ప్రశ్నించనున్నట్లుగా తెలుస్తోంది.  


Also Read: పవర్ స్టార్ @ 50: బాల్యం నుంచి నేటి వరకు.. పవన్ కళ్యాణ్ అరుదైన చిత్రాలు


Also Read: పవన్ కళ్యాణ్ బర్త్‌ డే స్పెషల్.. జనంలో ఉంటాడు.. జనంలా ఉంటాడు, ఇదీ పవర్ స్టారంటే!