వినాయక చవితి వేడుకలను ఇళ్లలోనే నిర్వహించుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశించారు. కరోనా జాగ్రత్తలు, ప్రజారోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ఖాళీలను భర్తీ చేసేందుకు 90 రోజుల్లో నియామకాలు పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపై సీఎం జగన్ గురువారం సమీక్షించారు. 


ఆంధ్రప్రదేశ్‌లో అమల్లో ఉన్న రాత్రి కర్ఫ్యూను మరికొంతకాలం పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నైట్ కర్య్ఫూ రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కొనసాగనుంది. వినాయక చవితి ఉత్సవాలను ఇళ్లకే పరిమితం చేయాలని అధికారులను ఆదేశించింది. బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాలు పెట్టవద్దని, నిమజ్జన ఊరేగింపులు కూడా నిర్వహించవద్దని పేర్కొంది. ప్రజారోగ్యం దృష్ట్యా జాగ్రత్తలు తీసుకోక తప్పదని సీఎం జగన్ అన్నారు. కోవిడ్ థర్డ్‌ వేవ్‌ వస్తుందన్న కేంద్ర సంస్థల సమాచారంతో చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం జగన్‌కు ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 2.11 శాతానికి తగ్గినట్లు అధికారులు తెలిపారు. మూడు జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో 3 శాతం కన్నా తక్కువగా పాజిటివిటీ రేటు ఉందన్నారు. 


థర్డ్ వేవ్ కు సంసిద్ధం


సుమారు 10 వేల గ్రామ సచివాలయాల పరిధిలో కరోనా కేసులు లేవని అధికారులు ప్రకటించారు. థర్డ్‌ వేవ్‌ దృష్ట్యా అన్ని రకాలుగా సిద్ధమయ్యామని అధికారులు సీఎం జగన్ కు తెలిపారు. ఇప్పటికే 20,964 ఆక్సిజన్‌ కాన్‌ సన్‌ట్రేటర్లు సిద్ధం చేశామన్నారు. మరో 2493 కూడా సమకూర్చుకుంటున్నట్లు తెలిపారు. 27,311 ఆక్సీజన్‌ డిటైప్‌ సిలెండర్లు సిద్ధం చేశామన్నారు.  సెప్టెంబరు చివరి నాటికి 95  ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ పైపులైన్ల పనులు పూర్తిచేస్తామని వెల్లడించారు. ఇప్పటికి 50 ఆస్పత్రుల్లో పూర్తిచేసినట్లు వివరించారు. 


Also Read: Sharmila Alone : షర్మిల ఒంటరినని ఎందుకన్నారు.. పక్కనే ఉన్నా పలకరించుకోలేదు ఎందుకు..?


బూస్టర్ డోస్ పై ఆరా


నవంబర్‌ చివరి నాటికి 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ సింగిల్‌ డోస్‌ వ్యాక్సినేషన్‌ పూర్తిచేస్తామని అధికారులు సీఎంకు తెలిపారు. వచ్చే ఫిబ్రవరి చివరి నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సినేషన్‌ పూర్తచేసేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. వ్యాక్సిన్‌ అనంతరం కోవిడ్‌ ప్రభావాన్ని తెలుసుకునేందుకు అధ్యయనం చేయాలని సీఎం అధికారులకు సూచించారు. బూస్టర్‌ డోస్‌ కూడా తీసుకోవాలని వస్తున్న సమాచారంతో అనుసరించాల్సిన వ్యూహంపై ఆలోచన చేయాలని సీఎం అధికారులకు సూచించారు. 


భారీగా తగ్గిన యాక్టివ్ కేసులు


ఏపీలో మొత్తం 15,001 గ్రామ, వార్డు సచివాలయాలున్నాయి. వీటిల్లో 9,988 సచివాలయాల పరిధిలో ఒక్క కోవిడ్‌ యాక్టివ్ కేసు లేదని అధికారులు వెల్లడించారు. 2,610 సచివాలయాల్లో ఒకే ఒక్క యాక్టివ్‌ కేసు మాత్రమే ఉందని తెలిపారు. 248 మండలాల్లో నాలుగు కేసులు కన్నా తక్కువగా ఉన్నాయని తెలిపారు. 145 మండలాల్లో 9 లోపు యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 676 మండలాల్లో కేవలం 4 మండలాల్లో 100 ఆపైన కేసులు ఉన్నాయని అధికారులు తెలిపారు. గత వారంతో పోలిస్తే యాక్టివ్‌ కేసుల సంఖ్య తగ్గినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.


Also Read: Weather Updates: రాగల రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం