భారత్ X ఇంగ్లాండ్ మధ్య జరుగుతోన్న నాలుగో టెస్టు మొదటి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో డేవిడ్ మలన్ (26), ఓవర్టన్ (1) క్రీజులో ఉన్నారు. అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ 191 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.   






హమ్మయ్య జో రూట్ ఔటయ్యాడు 


ఈ సిరీస్‌లో భీకర ఫామ్‌లో ఉన్న ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ వరుస సెంచరీలతో దూసుకుపోవడం భారత అభిమానుల్లో ఆందోళన కలిగించింది. ఈ నేపథ్యంలో నాలుగో టెస్టులో రూట్ వ్యక్తిగత స్కోరు 21 పరుగుల వద్ద ఉమేశ్ యాదవ్ బౌలింగ్లో ఔటవ్వడంతో భారత అభిమానులు పండగ చేసుకున్నారు. హమ్మయ్య రూట్ ఔటయ్యాడంటూ ఊపిరి పీల్చుకున్నారు. డేవిడ్ మలన్‌తో కలిసి జో రూట్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో వీరిద్దరి భాగస్వామ్యాన్ని ఉమేశ్ యాదవ్ విడదీశాడు. 






138 పరుగుల వెనుక ఇంగ్లాండ్ 


తొలి ఇన్నింగ్స్‌‌లో ఆతిథ్య ఇంగ్లాండ్ ఇంకా 138 పరుగుల వెనుకంజలో ఉంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 191 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.  


బుమ్... బుమ్... బుమ్రా


బుమ్.. బుమ్... బుమ్రా మరోసారి చెలరేగాడు. దీంతో నాలుగో టెస్టు విజయంపై భారత్ కన్నేసింది. బుమ్రాతో పాటు శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్ కళ్లు చెదిరే బంతులతో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించారు. ఇన్నింగ్స్ 4వ ఓవర్లో రెండు, ఆరు బంతులకు ఓపెనర్లు రోరీ బర్న్స్ (5), హసీబ్ హమీద్ (0) ను పెవిలియన్‌కు పంపాడు. దీంతో భారత్‌కు శుభారంభం దక్కింది.  






ఒకే రోజు 13 వికెట్లు 


ఈ రోజు మ్యాచ్లో మొత్తం 13 వికెట్లు పడ్డాయి. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌటైంది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ 3 వికెట్లు కోల్పోయింది. దీంతో మొత్తం నాలుగో టెస్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 13 వికెట్లు బౌలర్ల ఖాతాలో చేరాయి.