‘చిన్నారి పెళ్లి కూతురు’ (బాలికా వధు) సీరియల్‌లో కలెక్టర్‌గా, ఆనంది భర్తగా ఆకట్టుకున్న నటుడు సిద్ధార్థ్ శుక్లా మరణం బాలీవుడ్‌ను విషాదంలో ముంచేసిన సంగతి తెలిసిందే. ఆ సీరియల్‌లో ఆనంది పాత్ర పోషించిన ప్రత్యూష బెనర్జీ కూడా చనిపోయింది. 2016లో ముంబయిలోని తన ఫ్లాట్‌లో ఆత్మహత్య చేసుకుంది. ఆ ఘటన చోటుచేసుకున్న ఐదేళ్లకే శుక్లా కూడా చనిపోవడం బాధాకరం. 2020లో ప్రసారమైన ‘బిగ్ బాస్’ 13 సీజనల్‌లో ఎంతోమంది అభిమానుల గుండెలను గెలుచుకుని విజేతగా నిలిచాడు. దీంతో ఆయన మరణ వార్తను అభిమానులు నమ్మలేకపోతున్నారు. 


అయితే.. శుక్లా నిజంగానే గుండె నొప్పితో మరణించారా? లేదా ఆత్మహత్య అనేది తెలియాల్సి ఉంది. ప్రాథమిక విచారణ ప్రకారం వైద్యులు శుక్లా గుండె పోటుతోనే చనిపోయినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలను పరిశీలిస్తే పోలీసులకు కొన్ని సందేహాలు కలిగాయి. ముంబయిలో నివసిస్తున్న శుక్లా బుధవారం రాత్రి నిద్రపోయే ముందు కొన్ని మాత్రలు వేసుకుని నిద్రపోయారని, తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో గుండెలో ఏదో గాబరగా ఉందని చెప్పడంతో తల్లి మంచి నీళ్లు ఇచ్చింది. దీంతో శుక్లా మళ్లీ నిద్రలోకి జారుకున్నారు. ఉదయం తల్లి నిద్రలేపేందుకు ప్రయత్నించారు. ఎంత ప్రయత్నించినా చలనం లేకపోవడంతో ఆమె తన కుమార్తెకు ఫోన్ చేశారు. దీంతో ఆమె డాక్టర్‌తో వచ్చింది. వైద్యుడి సూచనతో వెంటనే శుక్లాను 9.40 గంటల సమయంలో హాస్పిటల్‌కు తరలించారు. 10.15 గంటలకు శుక్లా చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. అయితే, శుక్లా శరీరంపై ఎక్కడా గాయాలు కాలేదని తెలిపారు.  


ఈ ఘటనపై ముంబయి పోలీస్ డీసీపీ స్పందిస్తూ.. ‘‘పోస్ట్ మార్టం నివేదిక కోసం వేచి చూస్తున్నాం. అవి లభించేవరకు ఏ విషయం నిర్ధరించలేం. కుటుంబికులు ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయలేదు. హాస్పిటల్‌కు వచ్చే సరికే శుక్లా చనిపోయి ఉన్నారు’’ అని తెలిపారు. అయితే, సిద్ధార్థ్ మానసిక ఒత్తిడికి లోనయ్యాడని, అందుకే ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చనే వదంతులు వినిపిస్తున్నాయి.  


సిద్ధార్థ్‌ 2004లో ‘షో‌బిజ్’ ద్వారా మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టారు. 2005లో టర్కీలో జరిగిన మోడలింగ్ పోటీల్లో కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత పలు వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ 2008లో టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టారు. సోనీలో ప్రసారమయ్యే ‘బాబుల్ కా అంగాన్ చూటే నా’ సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు పరిచమయ్యారు. ఆ తర్వాత ‘లవ్ యు జిందగీ’, ‘పవిత్ర పునియా’ సీరియల్స్ ద్వారా మరింత గుర్తింపు పొందారు. 


Also Read: చిన్న వయసులోనే గుండెపోటు.. ప్రమాదంలో భారత యువత, కారణాలు ఇవే..


2012లో ‘బాలికా వధు’ (చిన్నారి పెళ్లికూతురు) సీరియల్‌లో కలెక్టర్ శివరాజ్ శేఖర్ పాత్రలో కనిపించారు. ఆ సీరియల్ సూపర్ హిట్ కావడంతో శుక్లాకు అభిమానులు పెరిగారు. ఈ సీరియల్‌లో ఆయన నటనకు పలు అవార్డులు కూడా దక్కాయి. దీంతో పలు రియాలిటీ షోల్లో కూడా శుక్లా పాల్గోని తన టాలెంట్ చూపించారు. శుక్లా క్రేజ్.. బిగ్‌ బాస్ వైపు అడుగులు వేయించింది. 2020లో ప్రసారమైన ‘బిగ్‌ బాస్’ సీజన్ 13 ద్వారా సిద్ధార్థ్ శుక్లా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. అందులో అతడి వ్యక్తిత్వాన్ని చూసి ప్రేక్షకులు విజేతగా నిలిపారు. ఆల్ట్ బాలాజీ, మ్యాక్స్ ప్లేయర్‌ తదితర ఓటీటీల్లో ప్రసారమవుతున్న వెబ్ సీరిస్‌ల్లో కూడా శుక్లా నటిస్తున్నారు. ‘బిగ్‌ బాస్’ సీజన్ 14లో వీకెండ్ వార్‌లో సల్మాన్‌కు బదులు హోస్ట్‌గా కూడా శుక్లా ఆకట్టుకున్నారు. 


Also Read: గుండె నొప్పితో ‘బిగ్ బాస్’ విన్నర్ మృతి.. ‘చిన్నారి పెళ్లి కూతురు’ కలెక్టర్‌కు కన్నీటి వీడ్కోలు!