ప్రముఖ దర్శకుడు శంకర్, రామ్ చరణ్ క్రేజీ కాంబినేషన్‌లో సినిమా వస్తుందంటే.. భారీ అంచనాలే ఉంటాయి. అయితే, ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా ఈ సినిమా ఇంకా మొదలు కాకుండానే వివాదాలతో సావాసం చేస్తోంది. ‘RC 15’గా తెరకెక్కనున్న ఈ చిత్రం కథపై ఇప్పటికే వివాదం నెలకొంది. ఆ కథ తనదేనంటూ సెల్లముత్తు అనే రచయిత భారత సినీ రచయితల సంఘాన్ని ఆశ్రయించాడు. అతను మరెవ్వరో కాదు.. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దగ్గర సహాయకుడిగా పనిచేసిన వ్యకే. అయితే, దర్శకుడు శంకర్ ఈ కథను కార్తీక్ సుబ్బరాజు నుంచే తీసుకున్నాడని తెలిసింది. ఈ నేపథ్యంలో సెల్లముత్తు ఆరోపనలు నిజమేననే సందేహాలు నెలకొన్నాయి. అయితే, ఈ వివాదం ఇంకా చల్లారకుండానే.. మరొకటి రాజుకుంది. 


తెలుగులో రాజమౌళి తరహాలోనే శంకర్ కూడా ఒక సినిమాను ఏళ్ల తరబడి చిత్రీకరిస్తాడు. అది విడుదల కావడానికి కూడా చాలా సమయం పడుతుంది. భారీ చిత్రాలు కావడం, వీఎఫ్ఎక్స్ వర్క్ తదితర కారణాల వల్ల వీరి సినిమాలు చాలా ఆలస్యంగా విడుదలవుతాయి. తాజా శంకర్ తెరకెక్కిస్తున్న ‘భారతీయుడు 2’ సినిమా షూటింగ్ కూడా మందకొడిగా సాగుతోంది. అది ఇంకా పూర్తి కాకుండానే శంకర్.. రామ్ చరణ్‌తో సినిమాకు అంగీకరించడంతో ‘భారతీయుడు 2’ చిత్ర నిర్మాతలకు ఇబ్బందికరంగా మారింది. ముందుగా తమ చిత్రాన్ని పూర్తి చేయాలని శంకర్ మీద ఒత్తిడి తెస్తున్నారు. చివరికి న్యాయ స్థానాన్ని కూడా ఆశ్రయించారని తెలిసింది. 


ఇన్ని వివాదాలు వెంటాడుతున్న తరుణంలో ఈ సినిమా సెట్స్ మీదకు వచ్చేందుకు ఇంకా సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. మొన్నటి వరకు రామ్ చరణ్ కూడా ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్‌లో బిజీగా ఉండటంతో ఈ సినిమా పెద్దగా ఫోకస్ పెట్టలేదు. ప్రస్తుతం చరణ్ డేట్స్ ఖాళీ ఉన్న నేపథ్యంలో వెంటనే షూటింగ్ వెంటనే మొదలు పెట్టాలని ‘RC 15’ నిర్మాతలు కూడా శంకర్ మీద ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. కరోనా ప్రభావం తక్కువగా ఉన్నప్పుడే షూటింగ్ పూర్తి చేసుకోవాలని కంగారు పడుతున్నారు. దీంతో శంకర్ పరిస్థితి అటుఇటూ కాకుండా ఉంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కియరా అద్వానీ మరోసారి చరణ్‌తో జతకట్టేందుకు సిద్ధమవుతోంది. ఇందులో అంజలీ కూడా కీలక పాత్ర పోషించనుంది. 


Also Read: పవర్ స్టార్ @ 50: బాల్యం నుంచి నేటి వరకు.. పవన్ కళ్యాణ్ అరుదైన చిత్రాలు


Also Read: పవన్ కళ్యాణ్ బర్త్‌ డే స్పెషల్.. జనంలో ఉంటాడు.. జనంలా ఉంటాడు, ఇదీ పవర్ స్టారంటే!