అఫ్గాన్ లో అమెరికా ఎగ్జిట్ తర్వాత తాలిబన్లు ప్రభుత్వ ఏర్పాటులో నిమగ్నమయ్యారు. అయితే ఇదే అదునుగా చైనా ఓ మాస్టర్ స్కెచ్ వేసింది. అఫ్గాన్ లోని బాగ్రామ్ ఎయిర్ ఫోర్స్ బేస్ పై డ్రాగన్ కన్నేసింది. ఈ ఎయిర్ బేస్ దాదాపు 20 ఏళ్ల పాటు అమెరికా చేతుల్లో ఉంది. ఈ మేరకు అమెరికాకు చెందిన సీనియర్ దౌత్యవేత్త నిక్కీ హేలీ హెచ్చరించారు .
డ్రాగన్ కన్ను..
ఈ ప్రాంతంలో కాలుమోపేందుకు ఎప్పటినుంచో చైనా ఎదురుచూస్తుందని నిక్కీ హేలీ అన్నారు.
చైనాను జాగ్రత్తగా గమనించాలి. బాగ్రామ్ ఎయిర్ బేస్ కోసం చైనా కచ్చితంగా ప్రయత్నిస్తుంది. అఫ్గానిస్థాన్ లో ఎంటర్ అయి పాకిస్థాన్ ను ఉపయోగించుకొని భారత్ పై మరింత దూకుడుగా వ్యవహరించేదుకు చైనా పావులు కదుపుతోంది. కనుక మన మిత్రదేశాలతో బంధాలను మరింత బలోపేతం చేసుకోవాలి. సైన్యాన్ని మరింత ఆధునీకరించాలి. సైబర్ క్రైమ్స్, ఉగ్రదాడులను దీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి.
నిక్కీ హేలీ, అమెరికా సీనియర్ దౌత్యవేత్త
మన సైబర్ సెక్యూరిటీ బలంగా ఉందని అనుకోవడానికి లేదు. ఎందుకంటే రష్యా ఎన్నో ఏళ్లుగా మన సమచారాన్ని హ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తోంది. తన మిత్రదేశాలైన భారత్, జపాన్, ఆస్ట్రేలియా వెనుక అమెరికా ఉందనే సందేశం బలంగా వినిపించాలి. అలానే మీ మద్దతు కూడా మాకు కావాలని బైడెన్ సర్కార్ కోరాలి.
నిక్కీ హేలీ, అమెరికా సీనియర్ దౌత్యవేత్త
బైడెన్ పై విమర్శలు..
అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా దళాలను ఉపసంహరించుకున్న తీరును నిక్కీ హేలీ తప్పుబట్టారు. ఈ చర్యతో బైడెన్ పై ఉన్న నమ్మకం పోయిందన్నారు.
సైన్యం, సైన్యం కుటుంబాలలో తనపై ఉన్న నమ్మకం, విశ్వాసాన్ని బైడెన్ పోగొట్టుకున్నారు. తన మిత్రపక్షాల విశ్వాసం కూడా అమెరికా పోగొట్టుకుంది. అందుకే యూఎస్ లేకుండానే వారు తాలిబన్లతో చర్చలు జరుపుతున్నారు. ఎందుకంటే అసలు అమెరికా ఏం చేసింది? ఏం చేస్తోందో? వారికి తెలియడం లేదు.
నిక్కీ హేలీ, అమెరికా సీనియర్ దౌత్యవేత్త