సోషల్ మీడియాలో తప్పుడు వార్తల ప్రచారంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వీటి వల్ల దేశానికే చెడ్డ పేరు వస్తోందని విచారం వ్యక్తం చేసింది. తబ్లీగి జమాత్ వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సోషల్‌మీడియా, వెబ్ పోర్టళ్లపై కీలక వ్యాఖ్యలు చేసింది.
బలవంతులకేనా..
సోషల్‌మీడియా సంస్థలు కేవలం బలవంతుల మాటలనే వింటున్నాయని బలహీనులను పట్టించుకోవడం లేదని జస్టిస్ రమణ అన్నారు ఎలాంటి జవాబుదారీతనం లేకుండా వ్యవస్థలు, న్యాయమూర్తులకు వ్యతిరేకంగా వార్తలు ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహించారు. ఐటీ నిబంధనలపై అన్ని హైకోర్టుల్లో దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టుకు బదిలీ చేస్తున్నట్లు ఈ సందర్భంగా ధర్మాసనం వెల్లడించింది. వీటిపై ఆరు వారాల తర్వాత విచారణ చేపడతామని తెలిపింది. వీటిని నియంత్రించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది.